అమెరికా మార్కెట్లకు ట్రెజరీ ఈల్డ్స్‌ దెబ్బ!

అమెరికా మార్కెట్లకు ట్రెజరీ ఈల్డ్స్‌ దెబ్బ!

ఏప్రిల్‌ నెలకు కీలక రిటైల్‌ విక్రయాలు 0.4 శాతం పుంజుకోవడంతో మళ్లీ ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు ఊపందుకున్నాయి. దీంతో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ దాదాపు 3.1 శాతానికి ఎగశాయి. వెరసి ఏడేళ్ల గరిష్టాన్ని తాకాయి. ఇంతక్రితం 2011 జూలైలో మాత్రమే ఈల్డ్స్‌ ఈ స్థాయికి చేరాయి. ఫలితంగా డాలరు ఇండెక్స్‌ బలపడగా... మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. డోజోన్స్‌ 193 పాయింట్లు(0.8 శాతం) క్షీణించి 24,706కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 19 పాయింట్లు(0.7 శాతం) వెనకడుగుతో 2,711 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ సైతం 60 పాయింట్లు(0.8 శాతం) వెనకడుగుతో 7352 వద్ద స్థిరపడింది.  
డాలరు ఇండెక్స్‌ అప్‌
మార్చితో పోలిస్తే రిటైల్‌ విక్రయాలు 0.3 శాతం పెరగడంతో 2018 రెండో క్వార్టర్‌లో వినియోగం ఊపందుకున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఇది జూన్‌లో పరపతి సమీక్ష చేపట్టనున్న ఫెడరల్‌ రిజర్వ్‌కు వడ్డీ రేట్ల పెంపువైపు మొగ్గుచూపేందుకు దోహదపడగలదని చెబుతున్నారు. దీంతో డాలరు ఇండెక్స్‌ 93.45ను తాకింది. ఇది 2018లోనే గరిష్టంకాగా.. యూరో 1.18కు బలహీనపడింది. చైనాతో వాణిజ్య వివాదం విషయంలో అనిశ్చితి తలెత్తడం కూడా సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు.  కాగా.. మంగళవారం రిటైలింగ్‌ సంస్థ హోమ్‌ డిపో 2 శాతం క్షీణించగా.. లోవ్స్‌ కంపెనీ 1 శాతం నీరసించింది. Most Popular