గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ నేడు?!

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాలతో(గ్యాప్‌డౌన్‌) ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 75 పాయింట్లు పతనమై 10,750 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. వరుసగా రెండో రోజు ట్రెజరీ ఈల్డ్స్‌ ఊపందుకోవడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. 2011 తరువాత ఈల్డ్స్‌ దాదాపు 3.1 శాతానికి చేరడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ అత్యధిక శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. కాగా..  బీజేపీకి సైతం స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు, ప్రపంచ మార్కెట్ల బలహీనతలు దేశీ స్టాక్‌ మార్కెట్లపై నేడు ప్రతికూల ప్రభావాన్ని చూపే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం ఆటుపోట్ల మధ్య సెన్సెక్స్‌ 13 పాయింట్ల స్వల్ప నష్టంతో 35,544 వద్ద నిలవగా.. నిఫ్టీ 5 పాయింట్ల నామమాత్ర నష్టంతో 10,802 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు ఇలా..!
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 10,746 పాయింట్ల వద్ద, తదుపరి 10,690 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే..  తొలుత 10,893 పాయింట్ల వద్ద, తదుపరి 10,985 స్థాయిలోనూ రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని   భావిస్తున్నారు. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు 
సోమవారం రూటుమార్చి నగదు విభాగంలో రూ. 718 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం యథాప్రకారం రూ. 518 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించారు. మరోవైపు సోమవారం రూ. 687 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మంగళవారం సైతం రూ. 531 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. 

 



Most Popular