కర్ణాటక ఫలితాలపై మార్కెట్ల కన్ను!

కర్ణాటక ఫలితాలపై మార్కెట్ల కన్ను!

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్ల నడక కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై ఆధారపడే అవకాశముంది. నేడు(12న) ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. ఫలితాలు మంగళవారం(15న) వెల్లడికానున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇన్వెస్టర్లు ఫలితాలను నిశితంగా పరిశీలించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌తో బీజేపీ తలపడుతోంది. దేశాన్ని బీజీపీ పాలిస్తుండగా.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి కావడంతో ఫలితాలకు ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. 
ఫలితాలూ కీలకమే
ఇప్పటికే క్యూ4(జనవరి-మార్చి) ఫలితాల సీజన్‌ స్పీడందుకోగా.. వచ్చే వారం మరికొన్ని బ్లూచిప్స్‌ ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ జాబితాలో అల్యూమినియం దిగ్గజం హిందాల్కో, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఉన్నాయి. బుధవారం(16న) వీటి పనితీరు వెల్లడికానుండగా.. శుక్రవారం(18న) బజాజ్‌ఆటో ఫలితాలు ప్రకటించనుంది. 
గణాంకాలకూ ప్రాధాన్యం
కర్ణాటక పోలింగ్‌, క్యూ4 ఫలితాలతోపాటు ఆర్థిక గణాంకాలూ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. సోమవారం(14న) ప్రభుత్వం ఏప్రిల్‌ నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు ప్రకటించనుంది. మార్చిలో సీపీఐ 4.28 శాతం, డబ్ల్యూపీఐ 2.47 శాతం చొప్పున పెరిగాయి.
ఇతర అంశాలపైనా దృష్టి
15న చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, 16న జపాన్‌ క్యూ1(జనవరి-మార్చి) జీడీపీ పురోగతి వివరాలు వెలువడనున్నాయి. ఇదే విధంగా అమెరికా రిటైల్‌ అమ్మకాల గణాంకాలు తెలియనున్నాయి. ఈ అన్ని అంశాలతోపాటు ముడిచమురు ధరలు,  విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో రూపాయి మారకం వంటి పలు పరిస్థితులు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. Most Popular