బ్యాంకర్లకు ఎన్‌బీఎఫ్‌సీల గాలం..!

బ్యాంకర్లకు ఎన్‌బీఎఫ్‌సీల గాలం..!

బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం నాన్ బ్యాంకింగ్ రంగంలో అవకాశాలకు తలుపులు తెరిచింది. మొండి బాకీల దెబ్బతో కుదేలైన బ్యాంకింగ్ రంగం కుదేలు అవగా, ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రం పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్, గ్రామీణ డిమాండ్ నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలు చాలా వరకూ బ్యాంకింగ్ రంగ నిపుణులకు తమ సంస్థల్లో ఉపాధి కల్పిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల్లో సుమారు 60 నుంచి 70 శాతం మంది సిబ్బంది బ్యాంకింగ్ రంగానికి చెందినవారే కావడం గమనార్హం. 

గతానికి భిన్నంగా ఎన్‌బీఎఫ్‌సీలకు ఒక సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రంగంలోని వ్రుద్ధితో పాటు, సాంప్రదాయ బ్యాంకింగ్ రంగానికి చెందిన అడ్డంకులు ఎన్‌బీఎఫ్‌సీల్లో తలెత్తకపోవడం విశేషం. అలాగే వేతనాల్లో పెరుగుదలతో పాటు, వినూత్న విధానాలకు స్థానం కల్పించడం, అంత్రప్రెన్యూర్ కల్చర్ వంటివి బ్యాంకర్లను ఎన్‌బీఎఫ్‌సీల వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. 

ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీల్లో నెలకొన్న సిబ్బంది డిమాండ్ కూడా బ్యాంకర్లను ఇటు వైపు  ఆకర్షించేలా చేస్తోంది. అయితే ప్రధానంగా మల్టీ నేషనల్, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన వారినే ఈ రంగం ఎక్కువగా ఆకర్షిస్తోంది. గత క్వార్టర్ లో గమనిస్తే పలు ఎన్‌బీఎఫ్‌సీల్లో దాదాపు 50 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి కలిగిన బ్యాంకర్లు వివిధ హోదాల్లో బాధ్యతలు చేపట్టారు. అయితే గతంలో ఎన్‌బీఎఫ్‌సీల వైపు చిన్నచూపు చూసేవారు. అందుకు కారణంల ఆర్థిక అవకతవకలతో పాటు సాంప్రదాయ మార్కెట్లో వీటి స్పేస్ కూడా చాలా తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బ్యాంకింగ్ రంగం నుంచి ఎన్‌బీఎఫ్‌సీవైపు మరలడాన్ని బ్యాంకర్లు పెద్ద రిస్క్ గా భావించడం లేదు. 

2017-18 ఆర్థికసంవత్సరంలో ప్రముఖ ఆర్థిక సంస్థ ఐఐఎఫ్ఎల్ లో సుమారు మూడొంతుల మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లను బ్యాంకింగ్ రంగం నుంచి రిక్రూట్ చేసుకున్నారు. అలాగే ఐసీఐసీఐ, బర్క్‌లీ బ్యాంక్, సిటీ బ్యాంకులో పలు హోదాల్లో పనిచేసిన కుశల్ రాయ్ ను టాటా కేపిటల్ ఎండీ స్థాయిలో నియామకం జరిపింది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ లో పలు హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న నిలేష్ రత్‌కాంత్‌వర్ ను సైతం బజాజ్ ఫైనాన్స్ తమ సీనియర్ లీగల్ కౌన్సిల్ గా నియామకం చేసుకుంది. 

బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్నటువంటి నిపుణులను చీఫ్ ఎగ్జీక్యూటివ్ ఆఫీసర్ హోదాలో సైతం పలు ఎన్‌బీఎఫ్‌సీలు నియమించుకున్నాయి. వీరికి సాలీనా రూ.2 నుంచి 4.5 కోట్ల వేతనాలు ఇస్తున్నాయి. అలాగే కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు కంపెనీలో వాటాలను సైతం ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. రానున్న 5 ఏళ్లలో మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ మేరకే ఈ తరహాలో బ్యాంకర్లను ఈ రంగం వైపు ఆకర్షిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 2008 నాటికే ఎన్‌బీఎఫ్‌సీల్లో సుమారు 45.5 శాతం మంది సిబ్బంది బ్యాంకింగ్ రంగం నుంచి రిక్రూట్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బ్యాంకర్లకు మార్కెట్ మీద ఉన్నటువంటి అపార అనుభవంతో పాటు మార్కెటింగ్ నైపుణ్యం, ఆడిటింగ్, అలాగే కస్టమర్ రిలేషన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఎన్‌బీఎఫ్‌సీలు ఎక్కువగా బ్యాంకర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. 

ఎన్‌బీఎఫ్‌సీలకు కలిసొచ్చిన కాలం..
మరోవైపు గత పదేళ్లుగా మల్టీ నేషనల్ బ్యాంకులు తమ కార్యకలాపాలను పరిమితం చేసుకోవడం, ఎన్‌బీఎఫ్‌సీలకు కలిసి వస్తోంది. అలాగే మొండి బాకీలతో బ్యాంకింగ్ రంగం సతమతమవడంతో పాటు ఆర్బీఐ అమలు చేస్తున్న నిబంధనల కారణంగా బ్యాంకింగ్ రంగం పలు ఒడిదిడుకులకు గురవుతోంది. ఈ సందర్భంలోనే ఎన్‌బీఎఫ్‌సీలు విస్తరణకు సానుకూలంగా మారింది. ఈ వాతావరణంలో ఎన్‌బీఎఫ్‌సీలు వేగంగా విస్తరిస్తున్నాయి. క్రిసిల్ వంటి సంస్థలు సైతం మంచి రేటింగ్ ఇవ్వడం ప్రయోజనం చేకూర్చుతోంది.      Most Popular