ఇక ఫ్యూచర్‌ గ్రూప్‌ డీల్‌?- షేర్లకు కిక్‌!

ఇక ఫ్యూచర్‌ గ్రూప్‌ డీల్‌?- షేర్లకు కిక్‌!

దేశీ ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను గ్లోబల్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ భారీ ప్రీమియంతో కొనుగోలు చేసిన నేపథ్యంలో ఫ్యూచర్‌ గ్రూప్‌ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పుట్టింది. దేశీ రిటైల్‌ రంగంలో భారీగా విస్తరించిన ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి సారించడంతో ప్రస్తుతం ఈ కౌంటర్లు జోరందుకున్నాయి.
10 శాతం వాటా అమ్మకం
ఇటీవల దేశీ రిటైల్‌ రంగ దిగ్గజం ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు కిశోర్‌ బియానీ తమ గ్రూప్‌లో 10 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో బలమైన సంస్థకు 10 శాతంవరకూ వాటాను విక్రయించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీపేరు ప్రస్తావించనప్పటికీ వాల్‌మార్ట్‌, అమెజాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఇన్వెస్టర్ల దృష్టి ఒక్కసారిగా ఫ్యూచర్‌ గ్రూప్‌ కౌంటర్లపైకి మళ్లినట్లు నిపుణులు పేర్కొన్నారు.
జోరు తీరు
ప్రస్తుతం బీఎస్ఈలో ఫ్యూచర్‌ మార్కెట్‌ నెట్‌వర్క్స్‌ 15 శాతం దూసుకెళ్లి రూ.  144కు చేరింది. ఇంట్రాడేలో రూ. 150 వరకూ ఎగసింది. ఈ బాటలో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 9.5 శాతం జంప్‌చేసి రూ. 40ను తాకగా.. ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్ 5 శాతం పెరిగి రూ. 478 వద్ద, ఫ్యూచర్‌ కన్జూమర్‌ 5.3 శాతం ఎగసి రూ. 60 వద్ద, ఫ్యూచర్‌ రిటైల్‌ 4 శాతం జంప్‌చేసి రూ. 598 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక ఫ్యూచర్‌ సప్లైచైన్‌ సొల్యూషన్స్‌ సైతం 2.5 శాతం బలపడి రూ. 692 వద్ద కదులుతోంది.Most Popular