స్టాక్ మార్కెట్‌లో పిడుగులు పడ్డా..ఈ 6 షేర్లకి తిరుగులేదట!

స్టాక్ మార్కెట్‌లో పిడుగులు పడ్డా..ఈ 6 షేర్లకి తిరుగులేదట!

ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో సరళరేఖా పద్దతిలో పయనం సాగుతోంది. అటు భారీగా పెరగడం కానీ...తగ్గడం కానీ కన్పించడంలేదు..కొత్త గరిష్ట స్థాయిలు దగ్గర్లోనే కన్పిస్తూ ఊరిస్తూ ఉన్నా..సూచీలు మాత్రం పరుగు పెట్టడం లేదు. అలాగని నష్టాల బాటలోనూ సాగడం లేదు..నిఫ్టీ 10700 పాయింట్ల నుంచి పాత గరిష్టాలను  అధిగమించడానికి నిజానికి నాలుగంటే నాలుగు సెషన్లు చాలు..కానీ 2017 చివరి మూడు నెలల్లో కన్పించిన దూకుడు ఇప్పుడు లేదు. పైగా బ్యాంకులలో వెలుగు చూస్తోన్న మోసాలు, ప్రభుత్వపరంగా తీసుకుంటున్న కొన్ని చర్యలు ..మదుపరుల మదిలో రక్షణాత్మకవైఖరిని ప్రోదికొల్పాయి. ఇలాంటి స్థితిలో ఓ మంచి ఆరు షేర్లని ఐడిబిఐ కేపిటల్‌కి చెందిన ఏకే ప్రభాకర్,సుదీప్ ఆనంద్‌లు ఎంపిక చేసారు.అమెరికా, చైనా, భారత్, ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాలూ ఇదే ప్రొటెక్షనలిజిమ్ అనే విధానానికి కట్టుబడుతున్నాయ్. అంటే కనీసపు లక్ష్యాలకే పరిమితం అవడం. ముందు దేశ ఆర్ధిక స్థితుల రక్షణకే కట్టుబడి ఉండటం..దూకుడుగా ముందుకు వెళ్లకుండా ఉన్న స్థితి దిగజారకుండా జాగ్రత్తలు తీసుకోవడమే. తయారీ, సేవల రంగంలో దేశీయ ఉత్పత్తులు, సంస్థల ప్రయోజనాలు కాపాడుకోవడానికే ఇప్పుడు ఈ దేశాలు ప్రాధాన్యత ఇస్తున్నాయ్. ఇందుకోసమే ట్రంప్ వీసా ఛార్జీలు పెంచడం ,స్టీల్, అల్యూమినియం, ఇతర ఉత్పత్తుల దిగుమతులపై సుంకం విధించారు. ఇదే విధంగా చైనా కూడా ట్రేడ్ వార్‌కి సిధ్దపడింది. మన దేశం విషయానికి వస్తే బ్యాంకుల్లోని మోసపూరిత రుణమంజారు సెంటిమెంట్‍‌ని తీవ్రంగా దెబ్బతీసింది.ఈ సందర్భాల్లోనే పతనం ఇంకా కొనసాగి..మరింత లోతులకి విస్తరిస్తే..ఎలా?..ఏ స్టాక్స్ అలాంటి స్థితిలోనూ లాభాలు పంచుతాయ్?

అలా ఏరి కోరి ఎంచిన ఆరు స్టాక్సే మారుతి సుజికి, కోటక్ మహీంద్రా బ్యాంక్, టిసిఎస్, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జి, ఎన్‌బిసిసి, భారత్ ఎలక్ట్రానిక్స్

మారుతి సుజికి : CMP 8775.15   32.75 (+0.37%)
గుజరాత్‌లో ఉత్పత్తి సామర్ద్యం పెంచుకున్నది. రానున్న త్రైమాసికాలలో మార్జిన్ల ఒత్తిడి ఎదుర్కోవడం ఖాయంగా తెలుస్తోంది. ఐతే దీర్ఘకాలంలో కంపెనీ మార్జిన్లు పెరిగేందుకు కొత్త వేరియంట్ల లాంఛ్ ఉపయోగపడనుందని అంచనా. రానున్న రెండేళ్లలో రాబడి 18శాతం చొప్పున సిఏజిఆర్ 16శాతం చొప్పున పెరుగుతుందని అంచనా. అలానే రిటన్ ఆన్ కంపెనీ ఎంప్లాయీ 24శాతానికి చేరుతుందని అంటున్నారు.
కొటక్ మహీంద్రా బ్యాంక్ : CMP  1241.40   -3.15 (-0.25%)
కస్టమర్ల బేస్‌ని 50శాతం పెంచుకున్న బ్యాంక్ ఏదైనా ఉందంటే అది కొటక్ బ్యాంకే..ఈ ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికే 12మిలియన్ల అంటే 1కోటి20లక్షలమంది బ్యాంకు కస్టమర్లని దక్కించుకుంది. అలానే ఇతర బ్యాంకులతో పోల్చుకుంటే ఎక్కువ అప్పులు ఖాతాదారులకు పంపిణీ చేసిన ఘనత కూడా కోటక్‌దే. తొందర్లోనే సంస్థలోని ఇతర విభాగాలను విడదీయబోతోన్న కొటక్ బ్యాంక్ ఎలాంటి పరిస్థితిలోనైనా మంచి షేరుగా వర్ణిస్తున్నారు.

టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ : CMP  3441.05   13.35 (+0.39%)
మేనేజ్‌మెంట్‌లోని ఉన్నతస్థాయి పదవీ మార్పిడి అత్యంత సాఫీగా సాగిపోయిన తర్వాత టిసిఎస్ 2018-2020 ఆర్ధిక సంవత్సరాలలో ఆదాయపరంగా గొప్ప మెరుగుదల నమోదు చేస్తుందని అంచనా. ఇది 11.2శాతంగా ఉండొచ్చు. అలానే డిజిటల్ సొల్యూషన్స్‌నుంచి వచ్చే రాబడి మొత్తం ఆదాయంలో 40శాతానికి చేరవచ్చనే లెక్కలు ఉన్నాయ్. ఇది ఇప్పుడు 22.1శాతంగా ఉంది.

పెట్రోనెట్ ఎల్ఎన్‌జి :   CMP 219.35  -2.30 (-1.04%)

సంస్థ ఉత్పాదక సామర్ధ్యంలో 95శాతం వినియోగమవుతోంది. అది కూడా దీర్ఘకాలిక ఒప్పందాల ఆధారంగా! 2019 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి కొచ్చి-మంగళూరు- బెంగళూరు పైప్‌లైన్ పూర్తవుతుందని అంచనా. దీంతో కొచ్చి ప్లాంట్‌లోని ఉత్పత్తి అయిన వాయువు వినియోగం 10శాతం నుంచి 50శాతానికి చేరే అవకాశం కన్పిస్తోంది

ఎన్‌బిసిసి : CMP  104.50  0.95 (+0.92%)

ఎన్‌బిసిసికి రూ.8000కోట్ల ఆర్డర్ బుక్ వేల్యూ ఉండగా..అదంతా కూడా కార్యనిర్వాహకంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయ్. దీంతో రానున్న రెండేళ్లలోనే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 37శాతం పెరుగుతుంది. అలా నిర్వహణ సామర్ద్యం రూపేణానే నికరలాభంలో 64శాతం వృధ్ది నమోదు అవుతుందని అంచనా


భారత్ ఎలక్ట్రానిక్స్ : CMP  131.85   0.60 (+0.46%)

మేక్ ఇన్ ఇండియా-దేశంలోనే తయారీ అనే కాన్సెప్ట్‌ని ఊతంగా చేసుకుని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మంచి రాబడి ఆర్జిస్తుందని అంటున్నారు. రక్షణ రంగంలో ప్రభుత్వం ఖర్చుపెట్టే నిధులు కూడా భారీగానే ఉన్నాయ్. రక్షణ రంగంలో ఆధునిక సాంకేతికత పొందుపరిచేందుకు ప్రభుత్వం భారీగా ధనం కేటాయించనుంది. అందుకే ఇప్పటికే బిఈఎల్ పొదిలో 40500కోట్ల మేర ఆర్డర్ బుక్ ఉంది. ఇదే రానున్న రోజుల్లో భారత్ ఎలక్ట్రానిక్స్ షేరు ధర జూమ్ అవడానికి సాయపడుతుందని అంటున్నారు.

(పైన చెప్పిన స్టాక్ రికమండేషన్స్ ఐడిబిఐ కేపిటల్ రీసెర్చ్ హెచ్ ఏకే ప్రభాకర్, ఈక్విటీ రీసెర్చ్ హెడ్ సుదీప్ ఆనంద్ వి మాత్రమే)

 Most Popular