లోధా డెవలపర్స్‌ ఐపీవోకి రెడీ!

లోధా డెవలపర్స్‌ ఐపీవోకి రెడీ!

ముంబై కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ కార్యకాలపాలు నిర్వహిస్తున్న లోధా డెవలపర్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు వీలుగా ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా మొత్తం రూ. 5,000 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు 1.8 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వీటికి అదనంగా రూ. 3750 కోట్ల విలువైన స్టాక్స్‌ తాజాగా జారీ చేయనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 750 కోట్లు సమకూర్చుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ఈక్విటీలో 15 శాతం వాటా వరకూ ఆఫర్‌ చేయనుంది. నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రస్తుత రుణభారం రూ. 17,397 కోట్లుగా నమోదైంది.
డీఎల్‌ఎఫ్‌ స్థాయిలో
ఐపీవో ప్రకారం కంపెనీ విలువను రూ. 38,000 కోట్లుగా లోధా యాజమాన్యం అంచనా వేసినట్లు తెలుస్తోంది. వెరసి దేశీయంగా లిస్టయిన రియల్టీ కంపెనీలలో డీఎల్‌ఎఫ్‌ తదుపరి రెండో విలువైన కంపెనీగా లోధా డెవలపర్స్‌ నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం డీఎల్‌ఎఫ్‌ మార్కెట్‌ విలువ రూ. 39,000 కోట్లుగా ఉంది. కాగా.. ఎనిమిదేళ్ల తరువాత రియల్టీ రంగం నుంచి వెలువడనున్న తొలి ఇష్యూగా లోధా డెవలపర్స్‌ నిలిచే వీలుంది. గతంలో ఒబెరాయ్‌ రియల్టీ 2010 అక్టోబర్‌లో ఐపీవోకు వచ్చింది. రూ. 1028 కోట్లను సమీకరించింది. అంతకుముందు 2009 డిసెంబర్‌లో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ఐపీవో ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకుంది. 
కంపెనీ వివరాలివీ
ప్రధానంగా ముంబైలో రియల్టీ కార్యకలాపాలను కేంద్రీకృతం చేసిన లోధా డెవలపర్స్‌ 1995లో ఏర్పాటైంది. ఓవైపు విలాసవంత ప్రీమియం గృహ సముదాయాల నిర్మాణంతోపాటు మరోపక్క అందుబాటు ధరల గృహ సముదాయాల ప్రాజెక్టులనూ చేపడుతోంది. 2017 డిసెంబర్‌కల్లా  37 ప్రాజెక్టులను చేపట్టింది. వీటిలో రెండు ప్రాజెక్టులను లండన్‌లో తలపెట్టింది. దాదాపు 34 మిలియన్‌ చదరపు అడుగుల్లో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. వీటిలో 32 మిలియన్‌ చదరపు అడుగుల ప్రాజెక్టులు ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోనే ఉన్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. డిసెంబర్‌కల్లా గతేడాది తొలి 9 నెలల కాలంలో రూ. 6635 కోట్ల ఆదాయం పొందింది. రూ. 565 కోట్ల నికర లాభం ఆర్జించింది. డిసెంబర్‌కల్లా మొత్తం 50.49 మిలియన్‌ చదరపు అడుగుల్లో ప్రాజెక్టులను పూర్తి చేసింది. Most Popular