శాప్‌, టుల్లో అప్‌- యూరప్‌ మార్కెట్లు ఓకే!

శాప్‌, టుల్లో అప్‌- యూరప్‌ మార్కెట్లు ఓకే!

ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపును వేగవంతం చేయవచ్చన్న అంచనాలతో అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌కు రెక్కలొచ్చాయి. తాజాగా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ 2.99 శాతాన్ని తాకాయి. చమురు ధరలు చల్లారకపోవడంతో ద్రవ్యోల్బణం బలపడుతుందన్న అంచనాలు దీనికి కారణంకాగా.. స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు క్షీణించనున్న అంచనాలతో టెక్నాలజీ షేర్లలో అమ్మకాలు నమోదవుతున్నాయి. దీంతో సోమవారం అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసినప్పటికీ ఆసియాలో ప్రధాన మార్కెట్లు బలహీనపడ్డాయి. అయితే డాలరు బలపడటంతో చైనా, జపాన్‌ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ స్వల్పంగా బలపడగా, జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌, యూకే ఇండెక్స్‌ ఫుట్సీ  0.5 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.
టుల్లో ఆయిల్‌ జోరు
సమస్యాత్మక పరిస్థితుల్లోనూ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో జర్మన్‌ టెక్ దిగ్గజం శాప్‌ 3 శాతం ఎగసింది. క్రెడిట్‌ స్వీస్‌ అప్‌గ్రేడ్‌ చేయడంతో బ్రిటిష్‌ ఆయిల్‌ సంస్థ టుల్లో ఆయిల్‌ 2 శాతం పుంజుకుంది. నిరుత్సాహకర ఫలితాల కారణంగా స్టాఫింగ్‌ సంస్థ రాండ్‌స్టాండ్‌ షేరు 4 శాతం పతనమైంది. ట్రావెల్‌, లీజర్‌ సంస్థ విలియమ్‌ హిల్‌ 11 శాతం కుప్పకూలింది. Most Popular