రుసాల్‌ ఎఫెక్ట్- నాల్కో, హిందాల్కో లబోదిబో!

రుసాల్‌ ఎఫెక్ట్- నాల్కో, హిందాల్కో లబోదిబో!

రష్యన్‌ అల్యూమినియం దిగ్గజం రుసాల్‌పై ఆంక్షలను సరళతరం చేయనున్నట్లు అమెరికా సూచించడంతో దేశీయంగా మెటల్‌ స్టాక్స్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. రుసాల్‌ ఎగుమతులను అమెరికా అనుమతించనుందన్న వార్తలతో లండన్‌ మెటల్‌ ఎక్స్ఛేంజీ(ఎల్‌ఎంఈ)లో ప్రధానంగా అల్యూమినియం ధరలు 8 శాతం పతనమయ్యాయి. దీంతో మొత్తం మెటల్‌ ఇండెక్స్‌ 3 శాతం నీరసించింది. 
నేలచూపులో 
దేశీయంగా అల్యూమినియం తయారీ సంస్థలైన నాల్కో, హిందాల్కో కౌంటర్లు భారీ అమ్మకాలతో కుప్పకూలాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో నాల్కో 8.5 శాతం పతనమై రూ. 78 దిగువన ట్రేడవుతోంది. ఇక హిందాల్కో సైతం 8.6 శాతం దిగజారి రూ. 234 దిగువన కదులుతోంది. తొలుత రూ. 231 వరకూ క్షీణించింది. ఈ బాటలో వేదాంతా, హిందుస్తాన్‌ కాపర్‌, టాటా స్టీల్‌, సెయిల్‌ సైతం 3.5-2.5 శాతం మధ్య తిరోగమించాయి. 
గతంలో ర్యాలీ
ఈ నెల మొదట్లో ట్రంప్‌ ప్రభుత్వం రష్యన్‌ సంస్థ రుసాల్‌పై ఆంక్షలు విధించడంతో దేశీయంగా మెటల్‌ కౌంటర్లు ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. గత 13 సెషన్లలో మెటల్‌ ఇండెక్స్‌ 11 శాతం దూసుకెళ్లింది. ప్రధానంగా హిందాల్కో 27 శాతం, నాల్కో 21 శాతం చొప్పున జంప్‌చేశాయి.Most Popular