60 శాతం వరకూ పడ్డ 20 షేర్లు.. వీటి పరిస్థితేంటి?

60 శాతం వరకూ పడ్డ 20 షేర్లు.. వీటి పరిస్థితేంటి?

జనవరితో ముగిసిన త్రైమాసికంలో సెన్సెక్స్ 3 శాతం నష్టపోయింది. అయితే బీఎస్ఈ500 ఇండెక్స్‌లోని 400 షేర్లు నష్టాలను మూటకట్టుకోగా.. గరిష్టంగా 62 శాతం వరకూ స్టాక్ ధరలు క్షీణించాయి.

లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను విధించడం, బ్యాంకింగ్ రంగంలో కష్టాలు, అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ భయాలు, పశ్చిమ ఆసియా దేశాల్లో జియోపొలిటికల్ టెన్షన్స్, అంతర్జాతీయంగా లిక్విడిటీ తగ్గిపోవడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, క్రూడ్ ఆయిల్ ధరలు వంటి పలు అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి.

 

దేశీయంగా కూడా

అంతర్జాతీయ పరిణామాలతో పాటు, దేశీయంగా ప్రతిపక్షాల పరిస్థితి మెరగవుతుండడం.. యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవడం వంటివి కూడా మార్కెట్లలో ఆందోళనకు కారణంగా నిలిచాయని నిపుణులు చెబుతున్నారు. 

జనవరి-మార్చ్ కాలంలో బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు స్వల్పంగానే తగ్గినా.. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 11 శాతం పడిపోయింది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 10 శాతం క్షీణించిందంటే.. ఈ రంగాల్లోని షేర్లు ఏ స్థాయిలో నష్టపోయాయో అర్ధం అవుతుంది. 

స్టాక్ స్పెసిఫిక్‌గా పరిశీలిస్తే.. జేబీఎఫ్ ఇండస్ట్రీస్ (62%), వక్రాంగీ (47%), క్వాలిటీ (46%), హిందుస్తాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ (45%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (44%), యునిటెక్ (42%), బ్యాంక్ ఆఫ్ ఇండియా (39%) చొప్పున నష్టాలను మూట కట్టుకున్నాయి.

మార్కెట్లు మరికొంతకాలం రేంజ్‌బౌండ్‌లోనే ఉందే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయంగా కూడా మరికొంత ఆందోళనలు కొనసాగే అవకాసం ఉంది. నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 4 శాతం మాత్రమే నష్టపోయినా.. ఇతర స్టాక్స్‌పై భారీగా ప్రభావం కనిపిస్తోంది. 

అయితే ఇవన్నీ అంతర్జాతీయ పరిణామాలతో నష్టపోవడం జరగలేదు. డిసెంబర్ త్రైమాసికానికి నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో.. ఫిబ్రవరి నుంచి జేబీఎఫ్ ఇండస్ట్రీస్ డౌన్‌ట్రెండ్‌లో ఉంది. 2017 ఏప్రిల్-డిసెంబర్ కాలానికి రూ. 43.7 కోట్ల నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలానికి రూ. 24.5 కోట్ల లాభం నుంచి నష్టాల్లోకి జారడం గమనించాలి. 

ప్రైస్ మానిప్యులేషన్‌పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. విచారణ చేపట్టనుందన్న వార్తలు వెలుపడిన సమయం నుంచి వక్రాంగీ షేర్ భారీగా పతనం అవుతూనే ఉంది. రిటైల్ విభాగంలో పాయింట్ ఆఫ్ సేల్ నెట్‌వర్క్‌ను పెంచుతూ వ్యాపారం వృద్ధి చేసుకునే ప్రణాళికల్లో కంపెనీ ఉండగా.. ఈ కంపెనీ కార్యకలాపాలలో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 

మార్కెట్లతో పాటు ఈ స్టాక్స్‌ పతనం కావడానికి ఇతర అంశాలు కూడా కారణం అని చెబుతున్న మార్కెట్ ఎనలిస్ట్‌లు.. ఆయా అంశాలపై కంపెనీల నుంచి క్లారిటీ వచ్చి.. తిరిగి అప్‌ట్రెండ్ మొదలైతే మాత్రమే వీటిలో పెట్టుబడులు సమర్ధనీయం అని నిపుణులు చెబుతున్నారు. 
 Most Popular