ఫలితాలూ,  విదేశీ మార్కెట్లపై మార్కెట్‌ కన్ను!

ఫలితాలూ,  విదేశీ మార్కెట్లపై మార్కెట్‌ కన్ను!

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ఆర్ధిక గణాంకాలపై దృష్టిపెట్టనున్నాయి. శుక్రవారం(13న) మార్కెట్లు ముగిశాక దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ గతేడాది(2017-18) క్యూ4 ఫలితాలను ప్రకటించింది. దీంతో సోమవారం(16న) ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్‌ కౌంటర్‌పై ఫలితాల ప్రభావం కనిపించే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా బుధవారం(18న) సిమెంట్‌ రంగ దిగ్గజం ఏసీసీ క్యూ4 ఫలితాలు వెల్లడించనుంది. ఈ బాటలో ఐటీ సేవలకు దేశంలోనే నంబర్‌వన్ కంపెనీ టీసీఎస్‌తోపాటు, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 19న ఫలితాలు విడుదల చేయనున్నాయి. 
టోకు ధరల వెల్లడి
సోమవారం(16న) ప్రభుత్వం మార్చి నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ 2.48 శాతం  పుంజుకుంది. 
సిరియాపై దాడులు
ఫ్రాన్స్‌, బ్రిటన్‌లతో కలసి అమెరికా శుక్రవారం సిరియాపై దాడులకు దిగింది. సిరియా ప్రెసిడెంట్‌ బషర్‌ అస్సద్‌ ప్రజలపై రసాయనిక ఆయుధాలు వినియోగించడంపై సీరియస్‌ అయిన అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సిరియా ప్రభుత్వం రసాయనిక ఆయుధ స్థావరాలపై దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. ఇకపై పౌరులపై రసాయనిక దాడులకు దిగకుండా మిలటరీ చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. ఈ దాడులపై రష్యా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. 
ఇతర అంశాలకూ ప్రాధాన్యం
17న ఈ ఏడాది తొలి క్వార్టర్‌(క్యూ1) జీడీపీ గణాంకాలను చైనా వెల్లడించనుంది. ఇదే రోజున ఫిబ్రవరి నెలకు జపనీస్‌ పారిశ్రామికోత్పత్తి వివరాలు సైతం విడుదలకానున్నాయి. ఇక 20న మార్చి నెలకు జపనీస్‌ ప్రభుత్వం ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రకటించనుంది. ఇవికాకుండా ప్రపంచ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయ కదలికలు వంటి ఇతర అంశాలు సైతం మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు వివరించారు.Most Popular