ఓపెన్ ఆర్థిక వ్యవస్థకు వీలుగా తలుపులు మరింత తెరవనున్నట్లు చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ తాజాగా ప్రకటించడంతో ముడిచమురు ధరలకూ రెక్కలొచ్చాయ్. ఆటో, వినియోగ వస్తువుల దిగుమతులపై టారిఫ్లను తగ్గించనున్నట్లు వెల్లడించడంతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. ధరలు మరింత పుంజుకుంటే ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఆరామ్కో పబ్లిక్ ఇష్యూని చేపట్టవచ్చన్న ఆలోచనలో సౌదీ అరేబియా ఉన్నట్లు వెలువడ్డ వార్తలు కూడా చమురుకు ఆజ్యం పోసినట్లు నిపుణులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ సోమవారం ఏకంగా 4 శాతం(2.56 డాలర్లు) జంప్చేసింది. 71.21 డాలర్లను తాకింది. ఇక న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ బ్యారల్ 3.3 శాతం(2.1 డాలర్లు) ఎగసి 65.51 డాలర్లకు చేరింది. వెరసి 2014 డిసెంబర్లో నమోదైన గరిష్ట ధరలను తాకాయి.
ఇతర కారణాలూ ఉన్నాయ్
సిరియా పరిణామాలపై కన్నేసిన అమెరికా ప్రెసిడెంట్ సోమవారం ట్రంప్ దక్షిణ అమెరికా దేశాల పర్యటనను రద్దు చేసుకోవడంతోపాటు మిలటరీ అధికారులతో హుటాహుటిన సమావేశమయ్యారు. సిరియాలో ఆ దేశ ప్రభుత్వం ప్రజలపై రసాయన దాడులకు దిగిన అంశంపై ట్రంప్ మిలటరీ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బ్రెంట్ బ్యారల్ 0.35 శాతం క్షీణించి 70.79 డాలర్లకు చేరగా.. నైమెక్స్ 0.25 శాతం వెనకడుగుతో 65.35 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
చమురుకూ చైనా జోష్-2014 స్థాయికి ధరలు!
