లెమన్‌ ట్రీ హోటల్స్‌ లిస్టింగ్‌ నేడు!

లెమన్‌ ట్రీ హోటల్స్‌ లిస్టింగ్‌ నేడు!

మార్చి నెలాఖరున ఐపీవోకి వచ్చిన ఆతిథ్య రంగ సంస్థ లెమన్‌ ట్రీ హోటల్స్‌ నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 54-56కాగా.. తద్వారా కంపెనీ దాదాపు రూ. 1039 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 311 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి అంతంత మాత్ర స్పందనే కనిపించింది. ఇష్యూకి 1.2 రెట్లు అధికంగా మాత్రమే బిడ్స్‌ దాఖలయ్యాయి. 
బిడ్స్‌ వివరాలిలా
ఐపీవోలో భాగంగా లెమన్‌ ట్రీ 12.98 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 15.47 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్‌) కోటా 3.88 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కాగా.. సంపన్న వర్గాలు, రిటైల్‌ విభాగాల నుంచి నామమాత్రంగా 0.12 శాతమే దరఖాస్తులు లభించాయి. 
కంపెనీ వివరాలివీ..
మధ్యస్థాయి హోటళ్ల రంగంలో దేశీయంగా అతిపెద్ద సంస్థ అయిన లెమన్‌ ట్రీ హోటల్స్‌ 28 పట్టణాలలో 45 హోటళ్లను నిర్వహిస్తోంది. లెమన్‌ ట్రీ ప్రీమియం, లెమన్‌ ట్రీ, రెడ్‌ ఫాక్స్‌ బ్రాండ్లతో ప్రీమియం, మధ్యస్థాయి, ఎకానమీ విభాగాల్లో మొత్తంగా 4,700 రూములను ఆఫర్‌ చేస్తోంది. 2013-17 మధ్య కాలంలో కంపెనీ ఆదాయం 18 శాతం చొప్పున వృద్ధి చూపగా.. నిర్వహణ లాభం 33 శాతం స్థాయిలో ఎగసింది. Most Popular