మల్టీబ్యాగర్‌ అయ్యే స్టాక్స్‌ ఇవిగో..!

మల్టీబ్యాగర్‌ అయ్యే స్టాక్స్‌ ఇవిగో..!

ప్రభుత్వం మౌలిక రంగానికి పెద్ద పీట వేస్తుండటంతో ముఖ్యంగా జాతీయ రహదారులు వేగంగా డెవలప్‌ అవుతోన్నాయి. కనెక్టివిటీని మరింత మెరుగు పరచడానికి రోడ్లు, భవనాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎకానమీపై దృష్టిపెట్టింది. దీంతో ఈ రంగ స్టాక్స్‌ రాబోయే రోజుల్లో మల్టీ బ్యాగర్స్‌ అవుతాయని మార్కెట్‌ నిపుణులు డీకే అగర్వాల్‌ అంచనా వేస్తున్నారు. కన్‌స్ట్రక్షన్‌, ఇన్‌ఫ్రా కంపెనీలకు ముందుంది మంచికాలం అని ఆయన అభిప్రాయపడుతున్నారు. 

ఇంజనీరింగ్ సేకరణ నిర్మాణం (EPC), హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా (HAM) మార్గాలను నిర్మించడం నిర్వహించడం బదిలీ (BOT) పద్ధతిలో 9,829 కిలోమీటర్ల జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఈ పనులను దశల వారీగా వేగంగా పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని భావిస్తోంది. 2016-17లో 8,231 కి.మీ. జాతీయ రహదారులను పునరుద్ధరించగా.. 2017-18లో 17,055 కి.మీ. రోడ్లను డెవలప్‌ చేసింది. దీనివల్ల పెద్ద నిర్మాణ సంస్థల ఆర్డర్‌ బుక్‌ల విలువ గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారిగా పెరిగింది. 

2017 బడ్జెట్లో రోడ్ల అభివృద్ధికి రూ.లక్ష కోట్ల నిధులను కేటాయించగా గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పెట్టుబడుల ద్వారా రూ.1.5 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.2 లక్షల కోట్లుగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులు ఇదే రకమైన నాణ్యతతో విజయవంతంగా పూర్తయ్యే అవకాశముంది. వచ్చే ఐదేళ్ళలో 35వేల కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులను పూర్తి చేసే లక్ష్యంతో కేంద్రం ఉంది. ఇందులో భారత్‌ మాలా కింద 24,800 కి.మీ., మిగతాది నేషనల్‌ హైవేస్‌ డెవలప్‌మెంట్‌ పోగ్రామ్‌(NHDP) కింద చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. వచ్చేది ఎన్నికల సంవత్సరం(2019) కావడంతో ప్రజా మౌలిక సదుపాయాలపై వ్యయాన్ని ప్రభుత్వం పెంచే ఛాన్స్‌ వుంది. ఈ నిధులతో మౌలిక రంగ సదుపాయాలతో పాటు, రోడ్లు, హైవేలను చేపట్టనున్నారు. 
 
ప్రభుత్వం ఇన్‌ఫ్రాకు పెద్ద పీట వేయడంతో రోడ్డు అభివృద్ధి సంస్థల ఆర్డర్‌ బుక్‌ గత ఆర్థిక సంవత్సరంలో అమాంతం పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత నాలుగేళ్ళుగా ఈ రంగంలోని ఆయా కంపెనీల వృద్ధి భారీగా పెరిగింది. అలాగే నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉన్న స్టీల్‌, సిమెంట్‌, ఇతర రంగాలు కూడా వేగంగా వృద్ధిని నమోదు చేశాయి. అలాగే ఈ రంగాలు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి. 

ఈ రంగంలోని స్టాక్స్‌ అయిన దిలీప్‌ బిల్డ్‌కాన్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌, అశోక్‌ బిల్డ్‌కాన్‌, సద్భావ్‌ ఇన్‌ఫ్రాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెడితే మంచిది. ఈ స్టాక్స్‌ రాబోయే కాలంలో చక్కని రిటర్న్స్‌ అందించే అవకాశాలున్నాయని డీకే అగర్వాల్‌ అంచనా వేస్తున్నారు. Most Popular