అనుకోని ఖర్చులను అందుకునేందుకు మార్గాలు

అనుకోని ఖర్చులను అందుకునేందుకు మార్గాలు

అందరూ తమ ఖర్చులను ప్రణాళికా బద్ధంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. కానీ అన్నిసార్లు ఇది సాధ్యం కాదు. అనుకోకుండా ప్రయాణం చేయాల్సి రావడమో, ఇంటి ఖర్చులు, కారు మరమ్మత్తుల వంటివి అకస్మాత్తుగా వచ్చిపడవచ్చు. కాసింత చవకగా ఏదైనా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కనుక వస్తే.. అప్పటివరకూ పర్ఫెక్ట్‌గా చేసుకున్న ప్రణాళిక మొత్తం తలకిందులు కావచ్చు.

సుదీర్ఘ కాలం పాటు పలు పెట్టుబడి సాధనాలలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన తర్వాత.. అనుకోకుండా ఇలా ఓ ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సి వస్తే.. వేటి నుంచి నగదును ఉపసంహరించుకోవాలని అనే గందరగోళం ఏర్పడడం సహజం. 40ఏళ్ల తర్వాత ఇలా అనుకోకుండా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలని భావించడం, లేదా ఖరీదైన గృహోపకరణాలను కొనుగోలు చేయడం వంటివి ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను దెబ్బ తీస్తాయి.

 

ఇలాంటి అకస్మాత్తుగా వచ్చే ఖర్చుల కోసం అయినా.. మరే ఇతర అంశాలకు అయినా నిధులు అవసరం అవుతాయి. ఇలాంటి సమయంలో ఉన్న పెట్టుబడుల నుంచి ఉపసంహరించుకోవాలా.. లేక మరేదైనా చవకగా వచ్చే ఇతర రుణాన్ని ఆశ్రయించాలా అనే సందిగ్ధత ఏర్పడుతుంది. అవకాశం ఉంటే షార్ట్-టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కదల్చడం వంటివి చేయవచ్చు. అయితే దీర్ఘకాలిక లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడి సాధనాలను మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. 

సడెన్‌గా వచ్చే ఖర్చుల కోసం లాంగ్-టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపయోగించడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. 

 

బ్యాంక్ డిపాజిట్ లేదా ఎమర్జెన్సీ ఫండ్
అకస్మాత్తుగా ఖర్చులు వచ్చినపుడు ఎవరైనా సరే తమ బ్యాంక్ ఖాతా నిల్వల వైపు చూడడంలో ఆశ్చర్యం లేదు. 4 నుంచి 6 శాతం చొప్పున మాత్రమే వడ్డీ రేటు ఇస్తున్న సేవింగ్స్ ఖాతాలు, ఫిక్సెడ్ డిపాజిట్స్‌కు అత్యధిక డిమాండ్ కనిపించేది ఇందుకే అని చెప్పాలి. మీ గృహ బడ్జెట్‌ను మరీ దెబ్బ తీసేంతగా లేకపోతే.. మొదటగా బ్యాంకు ఖాతాలలో ఉన్న నిల్వలను పరిశీలించాలి.

ఆ తర్వాత పరిశీలించాల్సిన అంశం ఎమర్జెన్సీ ఫండ్ లేదా అత్యవసర నిధి. ఉద్యోగం కోల్పోవడం.. సడెన్‌గా ఆదాయ మార్గాలు మూసుకుపోవడం వంటి వాటి కోసం ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. గృహోపకరాలు కొనుగోలు చేయడం వంటి వాటి కోసం వీటిని ఉపయోగించవచ్చు. అనుకోకుండా వచ్చే ఖర్చులను ఎదుర్కొనేందుకు కంటిజెన్సీ ఫండ్‌ను ఉపయోగించడం తొలి ఐచ్ఛికం కావాలని నిపుణులు చెబుతున్నారు. 

 

అత్యవసర నిధి

ఈ కంటిజెన్సీ ఫండ్ సాధారణంగా ఒక వ్యక్తి నెలవారీ అవసరాలకు 3 నుంచి 6 రెట్లు ఉండాలి. ఉద్యోగ భద్రత మరీ తక్కువ అయిన సందర్భాలలో దీన్ని 12 నెలల వరకూ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిధి నుంచి చిన్నపాటి ఖర్చుల కోసం నగదును ఉపయోగించుకోవచ్చు. 

ఎందుకంటే వీటిని సాధారణంగా ఎక్కువగా లిక్విడిటీ ఉండే షార్ట్ టెర్మ్ మ్యూచువల్ ఫండ్స్, వంటి వాటిలో పెట్టుబడులు చేస్తారు. వీటిని కదల్చడం ద్వారా వడ్డీ ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉండదు. అయితే వీటిపై కొంత ఎగ్జిట్ లోడ్‌తో పాటు, పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే ఓ ఫండ్ నుంచి బయటకు వచ్చేటపుడు.. ఆ ఫండ్ గత పెర్ఫామెన్స్, భవిష్యత్ అవకాశాలను కూడా పరిశీలించండి.

 

పెద్ద ఖర్చులు అయితే
సేవింగ్స్ బ్యాంక్‌లో నిల్వ, షార్ట్‌-టెర్మ్ ఫండ్స్ విత్‌డ్రాయల్ ద్వారా అవసరం తీరకపోతే.. అపుడు ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలోని ఇతర పెట్టుబడులను పరిశీలించాలి. లాభదాయకంగా ఉన్న స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఆరా తీయండి. మీకు తగినంత పెద్ద పోర్ట్‌ఫోలియో ఉంటే.. వాటిలో ప్రాఫిట్ బుకింగ్ చేయడంపై ఆలోచన చేయవచ్చు. 

మీరు రూ. 5 లక్షల మేర ఖర్చు చేస్తున్నట్లు అయితే.. స్టాక్స్ లేదా ఫండ్స్‌లో లాభాల స్వీకరణ చేపట్టవచ్చు. ఈ తరహా లాభాల స్వీకరణ సమయంలో ఏడాదికి మించిన పెట్టుబడులపై ఇప్పుడు ఎల్‌టీసీజీ చెల్లించాల్సి ఉన్నా.. షార్ట్-టెర్మ్ లాభాలతో పోల్చితే ఇది తక్కువగానే ఉంటుంది. 

కానీ ఆస్తి కొనుగోలు వంటి సమయాల్లో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వంటివి చేతికి అంది వస్తాయి. బ్యాంకులు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీని కూడా పరిశీలించవచ్చు. 

 

బీమాపై రుణం

ఇన్సూరెన్స్ పాలసీపై రుణాన్ని తీసుకుంటున్నపుడు సరెండర్ విలువపై కొంత భాగాన్ని మీకు రుణంగా మంజూరు చేస్తారు. ట్రెడిషనల్ ప్లాన్స్‌లో ఇది 80 శాతం వరకూ ఉంటుంది. వడ్డీ రేటు 10శాతం లేదా అంతకు మించి ఉండవచ్చు. అయితే ఎల్ఐసీ మాత్రం 9 శాతం వడ్డీని విధిస్తుంది. ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకుంటున్నపుడు.. మీ పాలసీ ద్వారా వచ్చే ప్రయోజనాలపై అధికారం రుణదాతకు చెందుతాయని మీరు సంతకం చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.

లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ

మీకు గృహ లేదా వాణిజ్య ఆస్తి ఉన్నట్లయితే, దానిని తాకట్టు పెట్టడం ద్వారా లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ ఐచ్ఛికాన్ని ఉపయోగించుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ వంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆస్తి విలువలో 60 శాతం వరకూ రుణాన్ని అందిస్తాయి. దీనికి 9.5 నుంచి 10.5 శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

 

అత్యవసర ఖర్చులను అందుకోవడం
అందుబాటులో ఉన్న ఆస్తులు: బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్లు, అత్యవసర నిధి, బీమా, మ్యూచువల్ ఫండ్స్

అవసరం అయిన మొత్తం        ఎంపిక ఎలా ఉండాలి?
రూ. 2 లక్షలు                      అత్యవసర నిధి, ఫిక్సెడ్ డిపాజిట్ల వంటి స్వల్ప కాలిక పెట్టుబడులు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్
రూ. 5 లక్షలు                      అత్యవసర నిధి కంటే అధికంగా నిధులు కావాల్సినపుడు లిక్విడ్ ఫండ్స్ ఎంపిక చేసుకోవాలి. ఎగ్జిట్ లోడ్‌తో పాటు పన్ను భారం కూడా ఉంటుందని గమనించండి.
రూ. 10 లక్షలు                     బీమా పాలసీపై రుణం, లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ వంటి వాటి ద్వారా ఖర్చులకు తగిన నిధులను సమకూర్చుకోవచ్చు.
 Most Popular