మీ లక్ష్యాలను అందుకునేందుకు చిన్న 'సిప్'(SIP) సరిపోతుందా!

మీ లక్ష్యాలను అందుకునేందుకు చిన్న 'సిప్'(SIP) సరిపోతుందా!

మీరు 15 ఏళ్ల క్రితం నెలకు రూ. 10 వేల చొప్పున ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడి చేయడం ప్రారంభించినట్లు అయితే.. ఇప్పటికి రూ. 57 లక్షలకు దీని విలువ చేరుకునేది. బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్స్, పీపీఎఫ్ వంటి పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఇదో వింతలాగా కనిపిస్తుంది. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు భారీ రాబడులు ఇస్తాయి. ఈక్విటీ టాప్ ఫండ్‌లో దేనిలో అయినా ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ. 65-70 లక్షల రాబడి వచ్చి ఉంటుంది. అయితే సగటున లెక్కించినా రూ. 50  లక్షల రిటర్న్ సాధ్యమయ్యేది.

 

సిప్‌లపై పెరుగుతున్న విశ్వాసం
ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఎస్‌ఐపీ మార్గాన్ని అధికంగా ఎంచుకుంటున్నారు. 15 ఏళ్ల పాటు సిప్ విధానం చేయడం సాధారణం కాకపోయినా.. రాబోయే కాలంలో మాత్రం ఈ ట్రెండ్ బాగా ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్ఐపీ కల్చర్‌కు డిమాండ్ పెరుగుతోంది. కానీ ఇన్నీ 7-8 ఏళ్లకు పరిమితం అవుతున్నాయి. సిప్ విధానం ద్వారా అద్భుతమైన రాబడులు అందుతుండడంతో వీటిలో పెట్టుబడి చేస్తున్న ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
నెలకు రూ. 20వేల వేతనం అందుకునే స్థాయి ఉద్యోగులు కూడా సిప్ విధానం ద్వారా రూ. 3000 పెట్టుబడిని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధపడుతున్నారు. లాంగ్‌టెర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయడం కచ్చితమైన రాబడులను అందిస్తుందనే విశ్వాసం మదుపర్లలో పెరుగుతోంది. అయితే ఇలా ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తం వారి దీర్ఘకాలిక లక్ష్యాలను అందుకునే స్థాయిలో ఉందా అన్నదే ఆలోచించాల్సిన విషయం. 


నిర్ణీత మొత్తం పెట్టుబడి
సంపాదనలో కొంత నిర్ణీత మొత్తాన్ని తప్పనిసరిగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనే ధృడ నిశ్చయాన్ని అలవరచుకోవాలి, ఆచరణలో పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 
పెట్టుబడితో పోల్చితే వచ్చే రాబడిని చూసి మీరు ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ చిన్నమొత్తాలు పెట్టుబడి చేస్తే ఇవి మీ జీవితంలో అంతగా మార్పులు తీసుకురాలేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 
రూ. 2500 చొప్పున ఓ 15 ఏళ్ల పాటు పెట్టుబడి చేస్తే.. సగటున వచ్చే రాబడి రూ. 12 లక్షల వరకు ఉండవచ్చు. పెట్టుబడితో పోల్చితే ఇది పెద్ద మొత్తమే అయినా.. ఇది అవసరాలకు తగినంతగా సరిపోదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాబడి రేటు ఎక్కువగా ఉన్నా.. పెట్టుబడి మొత్తం తక్కువగా ఉండడమే ఇలా తగినంత మొత్తం నిధి సమకూరకపోవడానికి కారణంగా చెప్పవచ్చు.

 

సిప్ అమౌంట్ పెంచండి
సహజంగా సిప్‌ ద్వారా పెట్టుబడులు చేస్తున్న వారు తమ నెలవారీ మొత్తాన్ని చివరి వరకూ అదే మొత్తాన్ని పెట్టుబడి చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం సరికాదు. 15 ఏళ్ల క్రితం ఓ వ్యక్తికి రూ. 40 వేల సంపాదన ఉందని అనుకుంటే.. అప్పుడు రూ. 10000 ఇన్వెస్ట్ చేస్తే.. మొత్తం సంపాదనలో 20 శాతం సిప్‌ చేశారని అర్ధం. ద్రవ్యోల్బణం ప్రకారం జీతం పెరుగుదల లెక్కించినా.. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ 7 శాతానికే పరిమితం అయిపోయినట్లు అర్ధం చేసుకోవాలి. అయితే.. ఏటేటా 10 శాతం వరకూ.. కనీసం 5 శాతం అయినా పెట్టుబడిని పెంచుకోవడం ద్వారా భారీ లబ్ధి పొందడానికి అకాశం ఉంటుంది. జీతం పెరిగిన ప్రతీసారి పెట్టుబడి కూడా పెంచుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. 

మీ ఆర్థిక లక్ష్యాలను అందుకునేందుకు పెట్టుబడిని కూడా ఆదాయంతో పాటు పెంచుకోవడం అలవరచుకోవాలి. మీ లక్ష్యం చేరుకునేందుకు తగిన మొత్తం ఎంతో అంచనా వేసుకుని అందుకు తగినట్లుగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఈక్విటీ ఆధారిత పెట్టబడులు మీ గమ్యాలను చేర్చేందుకు సహకరించే సాధనాలలో అత్యుత్తమైనవిగా చెప్పవచ్చు. 
 Most Popular