బ్యాంక్స్‌ అప్‌-ఐటీ డౌన్‌- మిశ్రమ ముగింపు!

బ్యాంక్స్‌ అప్‌-ఐటీ డౌన్‌- మిశ్రమ ముగింపు!

రోజు మొత్తం ఒడిదుడుకుల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేట్‌ అయ్యాయి. చివరికి స్వల్ప మార్పులతో మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 61 పాయింట్లు క్షీణించి 33,857 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 5 పాయింట్లు బలపడి 10,427 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2 శాతం జంప్‌చేయగా.. ఫార్మా, రియల్టీ 1.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. అయితే ఐటీ 1.5 శాతం పతనమైంది.
టీసీఎస్‌ పతనం
టాటా సన్స్‌ వాటా విక్రయం నేపథ్యంలో టీసీఎస్ 5.4 శాతం పతనంకాగా.. కొటక్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హిందాల్కో, అంబుజా, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, హెచ్‌యూఎల్‌ 1.6-0.5 శాతం మధ్య తిరోగమించాయి. మరోపక్క హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ 4 శాతంపైగా జంప్‌చేయగా.. ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌, సన్‌ ఫార్మా, యాక్సిస్‌, ఐషర్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐబీ హౌసింగ్‌ 3-2 శాతం మధ్య ఎగశాయి.
చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు మిశ్రమంగా ముగిసినప్పటికీ చిన్న షేర్లకు డిమాండ్‌ ఏర్పడింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1730 లాభపడితే.. 957 మాత్రమే డీలాపడ్డాయి.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) శుక్రవారం రూటు మార్చి నగదు విభాగంలో రూ. 550 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా... సోమవారం మరోసారి రూ. 375 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. అయితే గత కొంతకాలంగా పెట్టుబడుల బాటలో సాగుతున్న దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సోమవారం రూ. 464.5 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. శుక్రవారం సైతం డీఐఐలు స్వల్పంగా రూ. 65 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.Most Popular