పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లకు హుషార్‌!

పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లకు హుషార్‌!

ముందురోజు భారీ అమ్మకాలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లకు నేటి ట్రేడింగ్లో డిమాండ్‌ పుట్టింది. దీంతో ఎన్‌ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.5 శాతం ఎగసింది. పీఎన్‌బీని మోసం చేసిన నీవర్‌ మోడీ, గీతాంజలి జెమ్స్‌కు తోడు ఆంధ్రా బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ అనూప్‌ ప్రకాష్‌ గార్గ్‌పై ఈడీ చార్జిషీట్‌ను దాఖలు చేసిన నేపథ్యంలో సోమవారం పతనబాటన సాగిన ఆంధ్రా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ తదితర కౌంటర్లు లాభాల హైజంప్‌ చేశాయి. 
ఇదీ జోరు తీరు
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 8.3 శాతం దూసుకెళ్లగా.. ఆంధ్రా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ 6-5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ బాటలో సిండికేట్‌, ఓబీసీ, బీవోబీ, అలహాబాద్‌, కెనరా, ఇండియన్‌ బ్యాంక్‌, ఐడీబీఐ, ఎస్‌బీఐ 5-1.5 శాతం మధ్య పెరగడం విశేషం.
కుదేలైన కౌంటర్లు
సుమారు రూ. 5,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆంధ్రా బ్యాంక్ మాజీ డైరెక్టర్‌ అనూప్‌ ప్రకాష్‌ గార్గ్‌పై చార్జిషీట్‌ను దాఖలు చేయడంతో సోమవారం ఆంధ్రా బ్యాంక్‌ షేరు రూ. 34 దిగువన 13 ఏళ్ల కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. అనూప్‌ను జనవరి 12న ఈడీ అరెస్ట్‌ చేసి జ్యుడిషియల్‌ కస్టడీలో ఉంచింది. వడోదరా కంపెనీ సందేశర గ్రూప్‌(స్టెర్లింగ్‌ బయోటెక్‌) కంపెనీలకు రుణ లబ్ది చేకూర్చేందుకు వీలుగా రూ. 1.52 కోట్లను అనూప్‌ స్వీకరించినట్లు ఈడీ తాజాగా పేర్కొంది. ఆంధ్రా బ్యాంక్‌ అధ్యక్షతన ఏర్పడిన బ్యాంకుల కన్సార్షియం నుంచి స్టెర్లింగ్‌ బయోటెక్‌ రూ. 5,000 కోట్ల రుణాలను పొందింది.
నీరవ్‌ మోడీ దెబ్బ!
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ. 15,000 కోట్ల వరకూ కుచ్చుటోపీ పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ కుంభకోణంలో యూనియన్‌ బ్యాంక్‌కూ రూ. 295 కోట్లమేర వాటా ఉన్నట్లు వెల్లడికావడంతో సోమవారం యూనియన్‌ బ్యాంక్‌ 3 శాతం పతనంకాగా.. పీఎన్‌బీ సైతం 2.2 శాతం క్షీణించిన విషయం విదితమే. ఇటీవల అమ్మకాలతో నీరసించిన ఈ కౌంటర్లలో ట్రేడర్లు స్క్వేరప్‌ లావాదేవీలకు తెరతీయడంతో జోరందుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు.   Most Popular