సమ్మర్‌లో వైట్ గూడ్ కంపెనీలకు చెమటలు.. ఎందుకో తెలుసా

సమ్మర్‌లో వైట్ గూడ్ కంపెనీలకు చెమటలు.. ఎందుకో తెలుసా

డాలరుతో రూపాయి విలువ మళ్లీ కనిష్టాలకు చేరుకుంది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ డాలరుకు రూ. 65 కంటే దిగువకు చేరుకుంది. కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో పాటు రూపాయి పతనం ప్రభావం కూడా తోడవడంతో కన్జూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతోంది. రూపాయి మారకం మూడు నెలల కనిష్టానికి చేరుకున్న పరిస్థితులలో రూ. 66/డాలరుకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ను దిగుమతి చేసుకుంటున్న పలు కంపెనీలు ప్రస్తుతం ధరల పెంపుపై సమాలోచనలు చేస్తున్నాయి. ప్రస్తుతం రూపాయి పతనం కారణంగా దిగుమతులపై ఆధారపడిన కంపెనీలు డాలరు మారకంపై దృష్టి సారించాయి. 

 

సమ్మర్ ఎఫెక్ట్ కూడా
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మార్కెట్ దిగుమతుల విలువ రూ. 60 వేల నుంచి రూ. 70 వేల కోట్లుగా ఉంది. విడి భాగాల కోసం కూడా ఈ కంపెనీలు దిగుమతుల పైనే ఆధారపడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత, అంటే ఏప్రిల్ నెలల 3 నుంచి 5 శాతం మేర రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి-ఫిబ్రవరి కాలంలో ఎయిర్ కండిషనర్ల ధరలు 5-6 శాతం వరకూ పెరిగాయి. కొత్త లేబులింగ్ నిబంధనల కారణంగా ఈ పెంపు చేయాల్సి వచ్చింది. ఇదే కారణంగా రిఫ్రిజిరేటర్ల రేట్లు 3 శాతం మేర పెరిగాయి. సమ్మర్ కారణంగా డిమాండ్ ఊపందుకోనుండడంతో.. ఏప్రిల్‌లో మరోసారి రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

 

పెరిగిన స్టీల్ రేట్లు 
స్టీల్ ధరల వైపు నుంచి కూడా కంపెనీలపై ఒత్తిడి కనిపిస్తోందని గోద్రెజ్ అప్లయెన్సెస్ వర్గాలు చెబుతున్నాయి. వైట్ గూడ్స్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్ల తయారీలో.. స్టీల్, కాపర్ వినియోగం అధికంగా ఉంటుంది. ఇతర దేశాలతో యూఎస్ ట్రేడ్ వార్ కారణగా మెటల్ ధరలపై ఒత్తిడి కనిపిస్తోంది. గత కొన్ని నెలల కాలంగా అంతర్జాతీయంగా స్టీల్ రేట్లు 8 శాతం మేర పెరిగాయి. రాబోయే నెలలో ఇది మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యూఎస్‌కి స్టీల్ ఇంపోర్ట్స్‌పై 25 శాతం వరకూ పన్ను విధించే యోచన చేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పేశారు. ఈ పరిస్థితిని క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నామని హెయర్ అప్లయెన్సెస్ చెబుతోంది. 

 

బడా కంపెనీలూ అదే రూట్లో

రూపాయి మారకం ఊగిసలాట ఇదే స్థితిలో కొనసాగితే రేట్లను పెంచక తప్పదని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ఎల్‌జీ, శాంసంగ్, పానాసోనిక్, విడియోకాన్ వంటి కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకూ రేట్ల పెంపు విషయంలో దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా.. ఫ్లాట్ ప్యానెల్ టీవీలపై 6-8 శాతం మేర పెంపుదల తప్పదని అంటున్నారు. బడ్జెట్‌లో వీటిపై కస్టమ్స్ డ్యూటీ పెంచిన సంగతి తెలిసిందే. డ్యూటీ పెంపుదల కారణంగా డిమాండ్‌పై ప్రభావం ఉంటుందని ఎల్‌జీ అంటోంది. అక్టోబర్ 2017- జనవరి 2018 మధ్య 3-5 శాతం ధరల పెంపును మూడు సార్లుగా అమలు చేసినట్లు ఎల్‌జీ తెలిపింది. డాలరుతో రూపాయి మారకం రూ. 66ను దాటినట్లయితే మరోసారి రేట్ల పెంపు తప్పదని సూచనలు చేస్తోంది.
 Most Popular