భారత్‌ డైనమిక్స్‌ ఐపీఓకు అప్లయ్‌ చేయొచ్చా?

భారత్‌ డైనమిక్స్‌ ఐపీఓకు అప్లయ్‌ చేయొచ్చా?

ప్రభుత్వరంగ రక్షణ పరికరాల తయారీ సంస్థ భారత్ డైనమిక్స్ ఐపీఓ మార్చి 13న ప్రారంభం కానుంది. 12 శాతానికి సమానమైన 2,24,51,953 షేర్లను కంపెనీ విక్రయిస్తోంది. ఇష్యూ షేరు ధరను రూ.413 నుంచి రూ.428 మధ్యలో నిర్ణయించింది. మార్చి 15న ముగియనున్న ఈ ఇష్యూ ద్వారా కంపెనీ గరిష్టంగా రూ.960 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్, యస్‌  సెక్యూరిటీస్‌ సంస్థలు ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లకు, సంస్థ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.10 డిస్కౌంట్‌ ఇస్తున్నారు. 

ఫైనాన్షియల్స్‌ : 
1970లో ప్రారంభమైన భారత్‌ డైనమిక్స్‌ క్షిపణులను, ఇతర రక్షణ పరికరాలను తయారు చేస్తోంది. గత ఏడాది మార్చి నాటికి కంపెనీ నెట్‌వర్త్‌ రూ.2,212 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి కంపెనీ ఆర్డ‌ర్ బుక్ విలువ రూ.10,543కోట్లు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏటా కంపెనీ ఆదాయంలో 30 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం కంపెనీ ఆదాయం రూ.4832 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికరలాభం 5 శాతం వృద్ధితో రూ.490 కోట్లుగా నమోదైంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో కంపెనీ ఆదాయం రూ.1806 కోట్లు, నికరలాభం రూ.172 కోట్ల రూపాయలుగా ఉంది. గత చరిత్రను చూస్తే 60శాతానికి పైగా కంపెనీ ఆదాయం రెండో అర్ధభాగంలోనే వచ్చింది. ఇక గత ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను దిగువ పట్టికలో చూడండి.

విస్తరణ ప్రణాళికలు :
ప్రస్తుతం హైదరాబాద్‌, భానూర్‌, విశాఖపట్నంలలో మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్లను కలిగి వుంది. త్వరలోనే హైదరాబాద్‌కు సమీపంలోని ఇబ్రహీంపట్నం, మహారాష్ట్రలోని అమరావతిలో రెండు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. భూమి నుంచి గ‌గ‌న‌త‌లంలోని లక్ష్యాలను చేధించే క్షిప‌ణుల‌ను త‌యారీచేసే సంస్థ‌ల్లో ప్ర‌పంచ ప్ర‌సిద్ది గాంచిన సంస్థ భార‌త్ డైన‌మిక్స్. ఇండియ‌న్ ఆర్మీ కోసం ఎస్ఏఎమ్ (స‌ర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్), ఏటీజీఎమ్(యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్) తయారీలో నిమ‌గ్న‌మై ఉంది. అలాగే తెలంగాణాలో టెస్ట్ ఫైర్ రేంజ్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు కంపెనీ సంకేతాలిచ్చింది. 

కంపెనీ అంచనాలు :
ప్రస్తుతం భారత్‌లో క్షిపణి మరియు టోర్పెడో మార్కెట్ విలువ $24.49 బిలియన్లు. అంటే సుమారు రూ. 1.59 లక్షల కోట్లని ఫ్రాస్ట్ అండ్ సులివాన్ అనే ప్రముఖ రీసెర్చ్ సంస్థ అంచనా వేస్తోంది. అయితే ఇందులో సుమారు రూ.1.26 లక్షల కోట్ల విలువైన మార్కెట్‌ను మనవాళ్లు కనీసం అందుకోలేకపోవడంతో విదేశీ సంస్థలు పోటీపడ్తున్నాయి. ప్రస్తుతం బిడిఎల్‌కు ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని చూస్తే.. ఇండియన్ మార్కెట్‌కు అవసరమైన వాటిలో 53 శాతాన్ని సరఫరా చేసేంత సత్తా ఉంది.    దీనికి తోడు ఇప్పుడున్న మార్కెట్‌ కూడా ఏటా 4.75 శాతం చొప్పున వృద్ధి కూడా నమోదు కావొచ్చని రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 

రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ :
భద్రత దళాల అవసరాల కోసం ఆయుధాలను తయారు చేస్తున్న ఈ కంపెనీ కేవలం ఒకే ఒక కస్టమర్‌పై ఆధారపడి ఉంది. FY18 తొలి అర్ధభాగంలో వచ్చిన ఆదాయంలో 98 శాతం ఇండియన్‌ ఆర్మీ నుంచే వచ్చింది. టెక్నాలజీలో మార్పులు, పోటీకి అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రోడక్ట్స్‌ను అందిస్తే కంపెనీ ఆదాయం రాబోయే కాలంలో భారీగా పెరిగే ఛాన్స్‌ వుంది. ఉత్పత్తులను ఆలస్యంగా డెలివరీ చేయడంతో గత మూడేళ్ళుగా కాంట్రాక్ట్‌ విలువలో 5-10 ఆదాయాన్ని నష్టపోవలసి వచ్చింది. 

వాల్యుయేషన్‌ :
ఇష్యూ ధర రూ.428 అధికంగా కనిపిస్తోందని రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది FY17 ఈపీఎస్‌ కన్నా 16 రెట్లు అధికంగా ఉంది. అలాగే FY18 తొలి అర్ధభాగంలో వచ్చిన ఈపీఎస్‌  కన్నా 22 రెట్లు అధికంగా వుంది. మిస్సైల్‌ తయారీ కంపెనీల్లో లిస్ట్‌ అవుతోన్న తొలి కంపెనీ ఇదే. అయితే ఇతర రక్షణ రంగ సప్లయ్‌దారులైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆస్ట్రా మైక్రోవేవ్‌, అపోలో మైక్రో సిస్టమ్స్‌లు వార్షిక ఎర్నింగ్స్‌పై  13-40 రెట్ల అధిక మొత్తంపై ట్రేడవుతోన్నాయి. గత మూడేళ్లుగా కంపెనీ రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (RoE) చూస్తే వరుసగా 26.8శాతం, 30.4శాతం, 22.2శాతంగా ఉన్నాయి. అందుకే షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసేవాళ్లకు ఈ ఐపిఓ అంత లాభాలను పంచలేకపోవచ్చు. దీనికి తోడు సాధారణంగా డిఫెన్స్ సంస్థల ఆర్డర్ బుక్స్ జెస్టేషన్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక బలహీన పాయింట్. అందుకే లాంగ్ టర్మ్ ఆలోచన ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఐపిఓ వైపు చూడొచ్చు. 

ముఖ్యాంశాలు :
ఐపీఓ ప్రారంభం : మార్చి 13, 2018
ముగింపు : మార్చి 15, 2018
ఐపీఓ సైజ్‌ : సుమారు రూ.960 కోట్లు
ఫేస్‌ వేల్యూ : ఒక్కో షేరుకు రూ.10
ప్రైస్‌ బాండ్‌ : ఒక్కో షేరుకు రూ.413-428
రిటైల్‌ పోర్షన్‌ : 35శాతం
రిటైల్‌, ఎంప్లాయీస్‌ డిస్కౌంట్‌ : రూ.10
కనీస లాట్‌ : 35 షేర్లు
షేర్ల కేటాయింపు : మార్చి 20, 2018
రీ ఫండ్‌ : మార్చి 21, 2018
డీమ్యాట్‌లో షేర్ల క్రెడిట్‌ : మార్చి 22, 2018
లిస్టింగ్‌ : మార్చి 23, 2018 (బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో)Most Popular