సెకండ్ ఇన్నింగ్స్ లో ఆసరాగా నిలిచే బహుమతులు ఇవే...

సెకండ్ ఇన్నింగ్స్ లో  ఆసరాగా నిలిచే బహుమతులు ఇవే...

రిటైర్ మెంట్ అనంతరం జీవితాన్ని సాఫీగా గడపాలంటే ఆర్థికంగా ఎలాంటి భారం ఉండకూడదు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో వైద్య ఖర్చుల భారం పడకుండా జాగ్రత్త పడటంతో పాటు వార్థక్యంలో తరిగిపోతున్న శక్తికి తగినట్లుగా ఆదాయం కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వయోభారంతో ఉన్న మీ తల్లిదండ్రులకు చక్కటి ఫైనాన్షియల్ బహుమతులను అందిస్తే వారికి అవి ఊతంగా పనిచేసే అవకాశం ఉంది. 

ఆరోగ్య బీమాతో భద్రత..
ఆరోగ్య బీమా పాలసీ కొనడం ద్వారా మీ తల్లిదండ్రులకు చక్కటి బహుమతి అందించవచ్చు. ముఖ్యంగా దీని ద్వారా వారి వైద్యఖర్చులకు అయ్యే మొత్తం నుంచి కవరేజీ లభిస్తుంది. పలు బీమాసంస్థలు ఇప్పటికే సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. మన దేశంలో వైద్య ఖర్చులు ఏటా 12 నుంచి 14 శాతం మేర పెరగుతూ వస్తున్నాయి. దీన్ని ద్రుష్టిలో ఉంచుకొని వ్రుద్ధాప్యంలో సైతం హెల్త్ కేర్ బీమాలు చేయించుకుంటే అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. 
 
సాధారణంగా బీమా పాలసీ తీసుకునేటప్పుడే పెళ్లి కానివారు అయితే వారితో పాటు తల్లిదండ్రులకు కూడా కవర్ తీసుకుంటే సరిపోతుంది. భార్య భర్తలు యుక్త వయస్సు కలవారై ఉంటే అందరికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. ఒక వేళ మీకు పిల్లలు కూడా ఉన్నట్లయితే, తల్లి దండ్రులకు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మాత్రం ప్రత్యేకంగా బీమా పాలసీ తీసుకోవడం తెలివైన పని, అంతే కాదు ఒక వేళ మీ తల్లిదండ్రులు 65 సంవత్సరాలు దాటిన వారైతే వారి మెడికల్ కవర్ చాలా ఖరీదుగా మారుతుంది. 

తక్కువ బేసిక్ కవర్ తో ఎక్కువ టాప్ అప్ ప్లాన్ ఉత్తమం..

అలాంటి సందర్భాల్లో ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకొని తక్కువ మొత్తం బేసిక్ కవర్ తీసుకోవాలి. ఉదాహరణకు 3 లక్షల రూపాయల బీమాతో పాటు సూపర్ టాప్ అప్ పేరుతో మరో 10  నుంచి 15 లక్షల టాప్ అప్ ప్లాన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది అంతగా ఆర్థికంగా భారమైనది కాదు. 60 ఏళ్ల పైబడిన వారికి రూ. 3 లక్షల బేస్ కవర్ ప్రీమియం సైతం సంవత్సరానికి 15 నుంచి 20 వేల మాత్రమే ఖర్చయ్యే అవకాశం ఉంది.

ఫ్యామిలీ ఫ్లోటర్ తో బహుళ ఉపయోగాలు..
మీరు పనిచేస్తున్న సంస్థ మీ కుటుంబ సభ్యులకు కూడా బీమా కల్పిస్తున్నట్లయితే అప్పుడు మీ తల్లిదండ్రుల పేర్లను కూడా చేర్చండి. అప్పుడు వారు కూడా ఫ్యామిలీ ఫ్లోటర్ కిందకు వస్తారు. అంతే కాదు మీ తల్లి దండ్రులకు మెడికల్ ఇన్సురెన్స్ తీసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్ కింద టాక్స్ డిడక్షన్ ఉపలబ్ఢి కూడా లభిస్తుంది.  

మదుపుతో ఉపయోగాలెన్నో..
మెడికల్ ఎమర్జన్సీ నుంచి బయటపడేందుకు మెడికల్ కార్పస్ కింద కొంత మొత్తం మేర మదుపు చేసి వాటిని డెట్, లేదా ఈక్విటీ ఫండ్స్ లో పెట్టడం ఉత్తమ మార్గం. ఉదాహరణకు మీరు ఏర్పాటు చేసిన 3 నుంచి 7 లక్షల రూపాయల మొత్తాన్ని ఏదైనా డెట్ ఫండ్ లో మదుపు చేస్తే చక్కటి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అది వారి రిటైర్ మెంట్ అనంతర జీవితానికి ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో రిస్క్ ఫ్రీ అయిన ఫండ్స్ లో మదుపు చేస్తే బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువ పొందే అవకాశం ఉంది. అలాగే ఫిక్స్ డ్ డిపాజిట్లపై టాక్స్ పడుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ, బాలెన్స్ డ్ ఫండ్స్ లో మదుపు చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే అవకాశం ఉంది. కాస్త రిస్క్ తీసుకున్నట్లయితే డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. 

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం :

పదవీ విరమణ పొందిన అనంతరం వచ్చే డబ్బును భద్రంగా, పన్ను మినహాయింపుతో పొందుపు చేసుకోవచ్చు.  కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా సీనియర్ సిటిజన్స్ కోసం రూపొందించిన పథకం ఇది. 1000 రూ.ల కనీస పెట్టుబడితో ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. గరిష్టంగా 15 లక్షల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో వార్షిక వడ్డీ 8.4 శాతం వరకూ చెల్లిస్తున్నారు. ఈ పథకాన్ని 5 ఏళ్ల పాటు కొనసాగించుకోవచ్చు. కావాలనుకుంటే మరో 3 ఏళ్ల వరకూ పొడిగించుకునే అవకాశం ఉంది. అయితే వార్షిక వడ్డీ విలువ రూ. 10 వేలు దాటితే టీడీఎస్ విధిస్తారు. ఏడాదికి 1.5 లక్షల వరకూ పెట్టే పెట్టుబడికి సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది. 

ప్రధాన్ మంత్రి వయా వందన్ యోజన్ :

ఈ స్కీం 60ఏళ్లు, ఆపై బడిన సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించడమైనది. ఈ స్కీం కింద సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం 10 ఏళ్ల పాటు గ్యారెంటీ వడ్డీని ఇవ్వనుంది. పాలసీ దారుకి ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, పన్నెండు నెలల పద్ధతిలో పెన్షన్ అందుతుంది. ఈ స్కీం లో ఏడాది పెన్షన్ ప్లాన్ కోసం కనీసం రూ. లక్షన్నర నుంచి 7.5 లక్షల దాకా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. లక్షన్నర పెట్టుబడి పెట్టిన వారికి నెలవారీ వెయ్యి రూపాయల పెన్షన్ పొందుతారు. అలాగే 7.50 లక్షల పెట్టుబడి పెట్టిన వారికి నెలవారీ 5వేల రూ.ల పెన్షన్ పొందుతారు. ఈ పాలసీపై జీఎస్టీ మినహాయింపుతో పాటు కొనుగోలు ధరపై 75 శాతం రుణసదుపాయం కూడా ఉంది. 
 Most Popular