మీ టీడీఎస్ ప్రభుత్వానికి జమ అవ్వడం లేదా ? 

మీ టీడీఎస్ ప్రభుత్వానికి జమ అవ్వడం లేదా ? 

మీ మూల వేతనంలో టీడీఎస్ కట్ అవుతున్నప్పటికీ, అది ప్రభుత్వానికి జమకావడం లేదా ?

మీ శాలరీ స్లిప్ లో కట్ అవుతున్న టీడీఎస్ మొత్తాన్ని కంపెనీ పక్కదారి పట్టిస్తోందా ?

అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే ! ఈ చిక్కుల నుంచి బయటపడేందుకు మార్గం ఉంది...

టీడీఎస్ గురించి ప్రతీ వేతనజీవులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి విషయం. టీడీఎస్ అంటే మూల ఆదాయం మీద పన్ను. అంటే మీరు పనిచేస్తున్న సంస్థలో మీరు పొందుతున్న వేతనం నుంచి యాజమాన్యం కొంత సొమ్ము మినహాయించి ఇస్తుంది. ఈ మినహాయించిన సొమ్మును టీడీఎస్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. టీడీఎస్ మినహాయింపు అనంతరం సంస్థలు ఫారం 16ను జారీ చేస్తాయి. అందులో మీ వేతనం ఎంత, పన్నులు ఎంత, ఆదాయ సర్టిఫికెట్ వంటి ఉంటాయి. మూణ్ణెళ్ల కొకసారి కంపెనీ యాజమాన్యాలు టీడీఎస్ మొత్తాన్ని ప్రభుత్వానికి పంపిస్తాయి. ఫారం 16ను మార్చి నెలాఖరు అంటే ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి జారీ చేస్తారు. 

అయితే ఈ మధ్య ఐటీ శాఖ టీడీఎస్ కు సంబంధించిన వ్యవహారాల్లో పలు అవకతవకలను గుర్తించింది. దాదాపు 447 కంపెనీలు ఉద్యోగులకు టీడీఎస్ మినహాయించి దాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా పక్కదారి పట్టించినట్లు ఆదాయపన్ను శాఖ జరిపిన దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా ఈ కుంభకోణం విలువ రూ.3200 కోట్లుగా అంచనా వేశారు. దీంతో వేతన జీవులు నిండా మునిగారు. అయితే చాలా మంది ఉద్యోగులకు ఇలాంటి ఆర్థిక పరమైన అవగాహన ఉండదు. దీంతో టీడీఎస్ విషయంమై సగటు వేతన జీవులు ఆందోళన చెందుతున్నారు. 

టీడీఎస్ ఎంత కట్ చేశారో తెలుసుకోండిలా ...
పన్ను చెల్లింపుదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో పొందే ఆదాయాలపై టీడీఎస్ కట్ అవుతుంది. పనిచేస్తున్న సంస్థల నుంచి టీడీఎస్ కు సంబంధించిన సర్టిఫికెట్స్ తీసుకుంటే ఎంత టీడీఎస్ చెల్లిస్తున్నారో తెలుస్తుంది. లేని పక్షంలో ఆదాయపు పన్ను వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా 26ఎఎస్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు.  అంతే కాదు ఇన్‌కంటాక్స్ ఈఫైలింగ్ పోర్టల్ ద్వారా ప్రతీ మూణ్ణెళ్ల కొకసారి టీడీఎస్ వివరాలను తెలుసుకోవచ్చు. మీ పాన్ నెంబర్, లాగిన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా ఐటీ శాఖ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వొచ్చు. లాగిన్ అయిన తర్వాత ఫారం 26 ఏఎస్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ట్రేసెస్ వెబ్ సైట్ నుంచి ఫారం 26 ఏఎస్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ఉన్నట్లయితే నేరుగానే   ఈ ఫైలింగ్ సైట్ లోకి వెళ్లి ఈ ఫారం పొందవచ్చు.   

అయితే సాధారణంగా టీడీఎస్ కట్ చేసిన అనంతరం సంస్థ ఆ మొత్తాన్ని ఐటీ శాఖకు జమచేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. టీడీఎస్ ఎగ్గొట్టినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. పని చేస్తున్న సంస్థ టీడీఎస్ జమచేయకపోతే రిటర్న్స్ లో లెక్కలకు, అసలు లెక్కలకు పొంతన ఉండదు. టీడీఎస్ ను ఎప్పటికప్పుడు సంస్థ ఆదాయపన్నుల శాఖకు చెల్లిస్తే ఇబ్బంది ఉండదు. అలా చెల్లించకుండా మీ టీడీఎస్ ను కట్ చేసి ఆ సొమ్మును ఇతర అవసరాలను ఉపయోగిస్తేనే అసలు సమస్య, అప్పుడు ఆన్‌లైన్ లో మీరు చేసుకున్నప్పుడు పన్నుబకాయిలు ఉన్నట్లు వెబ్ సైట్ లో కనిపిస్తుంది. అప్పుడు సెక్షన్ 143(1) ఇన్ కంటాక్స్ చట్టం, 1961 ప్రకారం చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుంది.  ఇది చివరకు మీ జేబుకు చిల్లు పడే పరిస్థితికి దారి తీయొచ్చు.

జాగ్రత్త పడితే మేలు..
ఇలాంటి కార్పోరేట్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి వేతన జీవులకు టీడీఎస్ మొత్తం జమ అవుతుందా, లేదా తెలుసుకునేందుకు వీలుగా  అలర్ట్ సర్వీసును ప్రారంభించింది. దీన్ని బట్టి ఉద్యోగులు తమ సాలరీ స్లిప్ లో కట్ అవుతున్న టీడీఎస్ మొత్తంను ఐటీ శాఖలో జమఅవుతుందో లేదో సరిపోల్చుకోవచ్చు. లేదంటే ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. 

ఫిర్యాదుకు ముందే ఫారం 26ఏఎస్‌ను  చెక్ చేసుకోండి...
ఫారం 26 ఏఎస్‌ టీడీఎస్ మినహాయింపులు చెక్ చేసుకునేందుకు చాలా కీలకమైనది. ఫారం 26 ఏఎస్‌ని ఎలా చూడాలంటే.. ఐటీ  వెబ్‌సైట్‌ ఈ ఫైలింగ్ లోకి వెళ్లి మీ అకౌంట్‌తో లాగిన్‌ అవ్వండి. మీ అకౌంట్‌కి వెళ్లిన తర్వాత ‘వ్యూ ఫామ్‌ 26ఏఎస్‌’ లోకి వెళ్లండి. అసెస్‌మెంట్‌ సంవత్సరాన్ని సెలక్ట్‌ చేసుకోవాలి. ఫైల్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. అది ఓపెన్‌ అవ్వాలంటే పాస్‌వర్డ్‌ కావాలి. అది మీ పుట్టిన రోజు. అలా క్లిక్‌ చేయగానే మీ ముందు కనిపిస్తుంది మీ అకౌంట్‌.  మీ ఆదాయం,  జమచేసిన పన్ను వివరాలుంటాయి. ఫారం 16, 16ఎ సమచారాన్ని 26 ఏఎస్ సమాచారంతో పోల్చి చూడండి. అందులో ఏమైనా  తేడాలుంటే వెంటనే మీ సంస్థకు తెలియజేయండి అప్పుడు సవరించిన ఫారం 16 ను పొందండి. 
 
 Most Popular