ఇవీ బంధన్‌ బ్యాంక్‌ ఐపీఓ వివరాలు 

ఇవీ బంధన్‌ బ్యాంక్‌ ఐపీఓ వివరాలు 

భారత బ్యాంకింగ్‌ రంగంలో అతి పెద్ద ఐపీఓ ఈనెల 15న ప్రారంభం కానుంది. ఈనెల 19న ముగిసే ఈ ఇష్యూ ద్వారా రూ.4430-4473 కోట్ల నిధులను సమీకరించే యోచనలో ఉన్నట్టు బంధన్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ప్రైస్‌బాండ్‌ ఒక్కో షేరుకు రూ.370-375 కాగా.. ఇష్యూలో భాగంగా 11.92 కోట్ల ఈక్విటీ షేర్లను బంధన్‌ బ్యాంక్‌ జారీ చేయనుంది. కొత్తగా జారీ చేసే 9.76 కోట్ల షేర్లతో పాటు ఇప్పటికే సంస్థలో వాటా ఉన్న రెండు సంస్థలకు సంబంధించిన షేర్లను జారీ చేయనున్నారు. ఈ ఇష్యూకు కనీసం 40 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేయాలి. ఈ ఇష్యూకు లీడ్‌ మేనేజర్లుగా యాక్సిస్‌ బ్యాంక్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా ప్రై.లి., జేఎం ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్స్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌లు వ్యవహరిస్తున్నాయి. 

కంపెనీ నేపథ్యం : 
కోల్‌కతాలో మైక్రోఫైనాన్స్ సంస్థగా ప్రారంభమైన బంధన్.. ఆ తర్వాత తన కార్యకలాపాలను విస్తరించింది. 2014 ఏప్రిల్‌లో బ్యాంకింగ్‌ లైసెన్స్‌ను సంపాదించింది. 2015 ఆగస్టులో బ్యాంకింగ్‌ కార్యకలాపాలను ఈ సంస్థ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం కోటి మంది సూక్ష్మ రుణ కస్టమర్లను కలిగివుంది. ప్రస్తుతం 864 బ్రాంచ్‌లు, 386 ఏటీఎంలను బంధన్‌ బ్యాంక్‌ కలిగివుంది. ఇందులో 70 శాతానికి పైగా బ్రాంచీలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌, అస్సాం, బీహార్‌లతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బ్యాంక్‌‌కు పటిష్టమైన నెట్‌వర్క్‌ వుంది. 

కంపెనీ ప్రమోటర్లు : BFHL, BFSL, FIT, NEFIT

ఫైనాన్షియల్స్‌ : 
కంపెనీ ఫైనాన్షియల్స్‌ పరంగా చూస్తే తొలి ఏడాది నుంచే ఈ సంస్థ మెరుగైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2016 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికరలాభం 2017లో 4 రెట్లు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ దీనిని కొనసాగించే అవకాశముంది. గత ఏడాది డిసెంబర్‌ చివరినాటికి బ్యాంక్‌ డిపాజిట్లు రూ.25,293 కోట్లుగా, అడ్వాన్స్‌లు రూ.24,463 కోట్లుగా ఉన్నాయి. మరిన్ని డీటైల్స్‌ కోసం పట్టికను చూడండి.

నిధులను ఎందుకు వినియోగిస్తారంటే..
ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను మూలధన అవసరాల కోసం వినియోగిస్తామని బంధన్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు, ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చంద్ర శేఖర్‌ ఘోష్‌ తెలిపారు. కార్పొరేట్‌ రంగ రుణాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వబోమని, సూక్ష్మ రుణాలు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రుణాలకే అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. 

ముఖ్యాంశాలు :
ఇష్యూ ప్రారంభం : మార్చి 15, 2018
ఇష్యూ ముగింపు : మార్చి 19, 2018
ఇష్యూ సైజ్‌ : సుమారు రూ.4470 కోట్లు
ఫేస్‌ వేల్యూ : ఒక్కో ఈక్విటీ షేరు రూ.10
ప్రైస్‌బాండ్‌ : ఒక్కో షేరు రూ.370-375
రిటైల్‌ పోర్షన్‌ : 35శాతం
జారీ చేసే ఈక్విటీ షేర్లు : 11,92,80,494
లాట్‌ సైజు : కనీసంగా 40 షేర్లు (రూ.15వేలు)

అలాట్‌మెంట్‌, లిస్టింగ్‌ వివరాలు :
షేర్ల కేటాయింపు ప్రారంభం : మార్చి 22, 2018
రిఫండ్‌ : మార్చి 23, 2018
డీమ్యాట్‌ అకౌంట్లో క్రెడిట్ : మార్చి 26, 2018
లిస్టింగ్‌ : మార్చి 27, 2018(బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో)



Most Popular