చప్పగా.. హెచ్‌జీ ఇన్‌ఫ్రా లిస్టింగ్‌!

చప్పగా.. హెచ్‌జీ ఇన్‌ఫ్రా లిస్టింగ్‌!

మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కంపెనీ హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో యథాతథంగా లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 270కాగా.. బీఎస్‌ఈలో అదే ధరలో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఆపై గరిష్టంగా రూ. 275 సమీపానికి  చేరగా.. రూ. 253 స్థాయిలో కనిష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం దాదాపు 2 శాతం నష్టంతో రూ. 265 వద్ద ట్రేడవుతోంది. ఇష్యూ ఫిబ్రవరి 28న ముగిసిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 462 కోట్లను సమీకరించింది. ఇష్యూ నిధులను పరికరాల కొనుగోలు, రుణాల చెల్లింపు, సాధారణ పాలనా వ్యవహారాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 
కంపెనీ వివరాలివీ
2003లో ప్రారంభమైన హెచ్‌జీ ఇన్‌ఫ్రా మౌలిక సదుపాయాల రంగంలో ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) విభాగంలో ప్రధానంగా సర్వీసులు అందిస్తోంది. రహదారులు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల నిర్మాణంలో కార్యకలాపాలు విస్తరించింది. వీటితోపాటు నీటిపారుదల ప్రాజెక్టులలోకి సైతం ప్రవేశించింది. రాజస్తాన్‌లో టర్న్‌కీ పద్దతిలో నీటిపారుదల ప్రాజెక్టులను చేపడుతోంది. మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారానే 93 శాతం టర్నోవర్‌ సమకూరుతుండటం గమనించదగ్గ అంశం. 



Most Popular