గత రెండేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్ కొంటున్న 10 స్టాక్స్ ఇవే

గత రెండేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్ కొంటున్న 10 స్టాక్స్ ఇవే

మ్యూచువల్ ఫండ్స్‌లోని నిధుల వరద పారుతోంది. గత కొద్దికాలం నుంచి ఇన్వెస్టర్లలో ఫండ్స్‌పై అవగాహన పెరుగుతున్న నేపధ్యంలో ఫండ్స్ ఇన్‌ఫ్లో బాగా పెరిగింది. వీటికి తోడు మార్కెట్ కూడా కొద్దికాలం వరకూ రికార్డుల పై రికార్డులను నమోదు చేయడంతో చాలా మంది ఉత్సాహాన్ని చూపించారు. ఇక మిడ్, స్మాల్ క్యాప్స్‌లో అనూహ్యమైన యాక్షన్ కనిపించడం కూడా అందరినీ ఆకర్షించింది. ఒక రకంగా ఇది దేశీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు వరంగా మారడంతో పాటు ఫారిన్ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నప్పుడు భారీ ఎత్తున నిధులను కుమ్మరించేందుకు దోహదపడింది. 

ఇదే సమయంలో గత ఎనిమిది క్వార్టర్లు (రెండేళ్లు) నుంచి మ్యూచువల్ ఫండ్ సంస్థలు సుమారు 10 మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ను ఒడిసిపట్టుకుంటూనే ఉన్నారు. క్యాపిటలైన్ డేటాబేస్ ప్రకారం ఈ స్టాక్స్ ఇప్పటికే 200 శాతం వరకూ పెరిగాయి. 

వీటిల్లో టాటా కెమికల్స్ ఒకటి. 2015 డిసెంబర్ ఆఖరి నాటికి ఈ స్టాక్‌లో మ్యూచువల్ ఫండ్స్‌కు 11.27 శాతం వాటా మాత్రమే ఉండేది. ఇప్పుడది 24.58 శాతానికి పెరిగింది(డిసెంబర్ 21,2017 నాటికి). గత ఎనిమిది త్రైమాసికాల నుంచి దేశీయ ఫండ్లు ఈ స్టాక్‌లో తమ వాటాలను పెంచుకుంటూనే వస్తున్నాయి. బ్యాలెన్స్ షీట్లను పటిష్టం చేసుకోవడం, నిర్వాహణా సామర్ధ్యం, లాభదాయకతను పెంచుకోవడం వల్లే ఫండ్స్ దృష్టి పెరుగుతూ వస్తోంది. 

గత రెండేళ్లులో 102 శాతం పెరిగిన స్టాక్ ఇప్పుడు రూ. 675 దగ్గర ట్రేడవుతోంది. రెండేళ్ల క్రితం రూ.345 దగ్గర స్టాక్ ఉండేది. 

ఇండియా సిమెంట్స్‌దీ అదే బాట. 2015లో 6.49 శాతం ఉన్న దేశీయ ఫండ్స్ వాటా ఇప్పుడు 20.77 శాతానికి ఎగబాకింది. 
తమిళనాడులో ఇసుక లభ్యత, అక్కడి డిమాండ్, ప్రైస్ రికవరీ వంటివన్నీ ఇండియా సిమెంట్స్‌కు కలిసొస్తున్నాయని ఎడిల్వైజ్ సెక్యూరిటీస్ చెబ్తోంది. గత రెండేళ్లలో ఈ స్టాక్ 112 శాతం రాబడిని ఇచ్చింది. ప్రస్తుతం స్టాక్ రూ.150 దగ్గర కోట్ అవుతోంది. 


కార్బోరాండమ్ యూనివర్సల్, ఇది మురుగప్పా గ్రూపునకు చెందిన స్టాక్. గత రెండేళ్ల కాలంలో 98 శాతం లాభాన్ని ఇచ్చింది. 2015లో 11.2 శాతం వాటాలను మ్యూచువల్ ఫండ్ సంస్థలు కలిగి ఉండేది. ఇప్పుడది 19 శాతానికి పెరిగింది. 
ఇండస్ట్రియల్ సిరామిక్స్, ఎలక్ట్రో మినరల్స్, అబ్రేసివ్స్‌లో ఈ సంస్థ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.328 దగ్గర ట్రేడవుతోంది. ఈ మధ్యే రూ.438 నుంచి స్టాక్ పడ్తూ వస్తోంది. 


2015లో ఓరియంట్ కార్బన్ కెమికల్స్ స్టాక్‌లో మ్యూచువల్ ఫండ్స్‌కు 6.41 శాతం వాటా ఉండేది. 2017 నాటికి ఇది 14.46 శాతానికి ఎగబాకింది. సంస్థ తయారు చేసే ఇన్‌సాల్యుబల్ సల్ఫర్‌కు దేశీయ మార్కెట్లలోనే కాకుండా యూఎస్,  చైనా నుంచి కూడా  గిరాకీ పెరగడం వీళ్లకు కలిసొచ్చే అంశం. 
ప్రస్తుతం ఈ స్టాక్ రూ. 1130 దగ్గర కదలాడుతోంది. 
వీళ్ల సబ్సిడరీ సంస్థ డంకన్ ఇంజనీరింగ్‌ టర్న అరౌండ్, మార్జిన్లు పెరగడం, ఆపరేటింగ్ లెవరేజ్ వంటివి కలిసొస్తాయని సెంట్రమ్ రీసెర్చ్ చెబ్తోంది. గత రెండేళ్లలో ఈ స్టాక్ ఏకంగా 193 శాతం లాభాలను పంచింది. 

వీటితో పాటు మ్యూచువల్ సంస్థలు జెకె సిమెంట్స్ డెక్కన్ సిమెంట్స్ స్టాక్స్‌ను కూడా తమ పోర్ట్‌ఫోలియోల్లో ఉంచుకున్నాయి. ఇప్పటికే ఈ స్టాక్స్ సుమారు 90 నుంచి 100 శాతం రాబడిని ఇచ్చాయి. సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ విఎస్‌టీ టిల్లర్స్(92 శాతం లాభం) , కెమికల్ తయారీ సంస్థ గుజరాత్ హెవీకెమికల్స్ (166 శాతం లాభం), వైట్ గూడ్స్ తయారీ సంస్థ సింఫోనీ (51 శాతం), ఎంటర్‌టైన్‌మెంట్ నెట్వర్క్ లిమిడెట్ (13శాతం లాభం) స్టాక్స్ కూడా గత రెండేళ్లుగా మ్యూచువల్ ఫండ్ సంస్థల రాడార్‌లో ఉన్నాయి. 


 Most Popular