పెళ్లయిన జంట ఖర్చులు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే?

పెళ్లయిన జంట ఖర్చులు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే?

జీవితం అంటే పలు దశల సమాహారం. బాల్యం.. విద్యాభ్యాసం.. యవ్వనం.. ఉద్యోగం.. వివాహం.. మధ్య వయసులో బాధ్యతలు.. మలి వయసులో విరామం. చూసేందుకు చాలా సింపుల్‌గానే కనిపించినా.. ఇంత సాఫీగా జీవితం సాగదు. అలా సాగాలంటే తప్పనిసరిగా కావాల్సినది ప్లానింగ్.

గతంతో పోల్చితే ఇప్పుడు ఆదాయ ప్రమాణాలు బాగానే పెరిగాయి. ఐటీ రంగం విస్తృతి కారణంగా శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఆదాయాలు కూడా బాగానే వస్తున్నాయి. అయినా సరే.. గతంతో పోల్చితే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఇందుకు కారణం ప్లానింగ్ లోపించడమే అనడంలో సందేహం అక్కరలేదు.

 

ఉదాహరణ 1: రమేష్ వయసు 34 ఏళ్లు, వనజకు 31 సంవత్సరాలు. హైద్రాబాద్‌లోని ఐటీ రంగంలో విధులు నిర్వహిస్తున్న వీరిద్దరికి 6 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. రెండు కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడినవే కావడంతో.. ఉన్నతమైన జీవన శైలిని గడపాలని నిర్ణయించుకున్నారు. వారాంతాల్లో మాల్స్‌లో చక్కర్లు కొట్టడం, వీలైనంత వరకు ఔటింగ్స్ వెళ్లడం వంటివి చేసేవారు. వారిద్దరికి కలిపి నెలకు రూ. 1.40 లక్షల ఆదాయం లభిస్తుండగా.. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు బ్యాంక్‌ బ్యాలెన్స్ రూపంలో రూ. 2 లక్షలను కలిగి ఉన్నారు. ఇదంతా బాగానే కనిపిస్తున్నా.. తరచి చూస్తే మాత్రం వారి నెలవారీ ఆదాయంలో 80 శాతానికి పైగా గ్రాసరీ, ఇంటి ఖర్చులు, కార్ లోన్ ఈఎంఐ, లైఫ్ స్టైల్ ఖర్చుల రూపంలో వెళ్లిపోతోంది. మిగిలిన మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్‌లో దాస్తున్నా.. అది వెకేషన్స్, పండుగ ఖర్చులు వంటి వాటికి వెచ్చించాల్సి వస్తోంది. ఇది వారి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పరిస్థితిని సూచిస్తోంది. ఈ జంట కల ఏంటంటే.. తమ ఐదేళ్ల చిన్నారికి ఉన్నతమైన విద్యను అందించడం, అలాగే వీలైనంత త్వరగా పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకోవడం. కానీ ప్రస్తుతం వారు ఉన్న తీరును గమనిస్తే.. ఇది కలగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.

 

ఉదాహరణ 2: మాధవరావు(52), శ్రావణి(49)లు ఈ మధ్యనే తమ వివాహం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు. కానీ ప్రస్తుతం వీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాధవరావుకు శ్రావణి తరచుగా రిటైర్‌మెంట్ ప్లానింగ్ గురించి గుర్తు చేస్తూనే ఉంది. కానీ ఆ విషయాలను మాధవరావు పట్టించుకోలేదు. అతని ఉద్యోగం ఎక్కువగా ప్రయాణాలతో కూడుకున్నది కావడంతో.. వారాంతాల్లో ఇంట్లో ఉన్న సమయంలో ఇలాంటి టాపిక్స్ మాట్లాడేందుకు ఇష్టపడేవాడు కాదు. ఇక్కడ శ్రావణి చొరవ చూపే ప్రయత్నం చేసినా.. ఆమెకు భర్త నుంచి సహకారం లభించలేదు. గతంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు కూడా మాధవరావు పద్ధతిని మార్చలేకపోయాయి. 

 

ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడంలో లోపాలని ఈ రెండు ఉదాహణలు చాటి చెబుతాయి. ఇలాంటి జంటలు మన చుట్టూ చాలామందే కనిపిస్తూ ఉంటారు. ఆర్థికంగా అత్యవసర పరిస్థితి వచ్చినపుడే.. ఇలా ఖర్చుల విషయాన్ని ఆయా కుటుంబాలు సీరియస్‌గా తీసుకోవడం చూస్తుంటాం. అనుకోని సంఘటనలు ఎదురైతే సిద్ధంగా ఉండాలనే ఆలోచన ఉన్న జంటలు అరుదుగానే కనిపిస్తుంటారు.

 

1. బడ్జెట్ వేసుకోవడం:

మీ ఖర్చులను క్రమ పద్ధతిలోకి మార్చుకోవాలంటే మొదటగా చేయాల్సిన పని ఇదే. మీరు నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారనే విషయం తెలియకుండా, ఎంత ఆదా చేయగలరనే అంశంపై అవగాహన తెచ్చుకోవడం కష్టమైన విషయం. ఏ అంశానికి ఎంత ఖర్చు చేస్తున్నారనే అంశం తెలిసేందుకు కూడా బడ్జెట్ వేసుకోవడం ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు షాపింగ్ విపరీతంగా ఇష్టపడే వ్యక్తి అయితే, దీనిపై ఎంత ఖర్చు అవుతోందో తెలిసినపుడు, అందుకు తగిన చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఒక భాగస్వామి ఖర్చులను లెక్కించే బాధ్యత తీసుకోవడం సబబుగా ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో ఇలా ఖర్చులను పట్టిక వేసుకునేందుకు అనేక ఆన్‌లైన్ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక వేళ మీ భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనపరులు అయితే, ఆయా ఖర్చులను సమంగా పంచుకుని, మిగిలిన మొత్తాన్ని ఇద్దరి పేరుపైనా విడివిడిగా పెట్టుబడులు చేయండి.

 

2. సమాచారం ఇచ్చిపుచ్చుకోండి:

ఏదైనా పాలసీ డాక్యుమెంట్/స్టేట్‌మెంట్ పత్రాలు ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే.. తన భర్త ఆ పాలసీ తీసుకున్నాడనే విషయం భార్యకు తెలియడం వంటి సంఘటనలు అనేక మార్లు కనిపిస్తాయి. తమ భాగస్వామి నిర్ణయ సామర్ధ్యంపై నమ్మకం లేకపోవడం వంటి వాటి కారణంగా ఇలాంటి సమాచార లోపాలు సంభవిస్తూ ఉంటాయి. నిజానికి ఆర్థిక అంశాలలో నిర్ణయం తీసుకోవడం మహిళలకు సమర్ధత ఎక్కువ అనే అంశం నిరూపితమైంది. ప్రధానమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకునేందుకు ముందు భార్యతో సంప్రదింపులు జరపడం ద్వారా.. వాస్తవ అవసరాలను గురించి అంశాలపై అవగాహనను పెంచుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఇంటిలోని వ్యక్తులతో సమాచారం పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణం కూడా ఏర్పాటు అవుతుంది. ఆర్థికపరమైన అంశాలు, ఆయా ఉత్పత్తుల కొనుగోళ్లపై ఉమ్మడి నిర్ణయాల కారణంగా ఆ జంట మధ్య సరైన అవగాహన ఏర్పడుతుంది. ఒక వేళ మీరు ఎవరికైనా సలహాదారులుగా ఉన్నట్లయితే, ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నారని ధృవీకరించుకోండి.

 

3. వీలైనంత త్వరగా పెట్టుబడి ప్రారంభించండి:

జంటలు సహజంగా తమకు పిల్లలు పుట్టిన తర్వాత కానీ లేదా 30లు దాటిపోతున్న పరిస్థితుల్లో కానీ పెట్టుబడులు చేస్తుంటారు. కానీ పెళ్లి అయిన మొదటి ఏడాది నుంచే పెట్టుబడులు ప్రారంభించడం సరైన పని. ఇలా చేస్తే ఆయా అవసరాలకు తగినట్లుగా పెద్ద మొత్తంలో కార్పస్‌ను సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. వెకేషన్ సమయంలో క్రెడిట్ కార్డులు ఉపయోగించడం కాకుండా.. రికరింగ్ డిపాజిట్ వంటివి చేయడం ద్వారా ఏటా ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్థిక లక్ష్యాలను అందుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ ప్రారంభించడం తగిన పని. ఎస్ఐపీ అయినా.. ఆర్‌డీ అయినా.. నేరుగా బ్యాంక్ నుంచి నిధులు కట్ అయ్యేలా ఈసీఎస్ ఆదేశాలు ఇస్తే.. పెట్టుబడులు పోను మిగిలిన మొత్తాన్నే ఖర్చు చేసుకునేలా ప్లాన్ చేసుకోవడం కుదురుతుంది.

 

ఇప్పటికే 40లలోకి వచ్చిన జంటలు అయితే, తాము ఆలస్యం చేశామని భావించాల్సిన పని లేదు. ఇప్పటికైనా తమ ఆర్థిక అంశాలను తగిన ప్లాన్ చేసుకోవడం తగిన విషయం. మూలధన నిధిని ఏర్పాటు చేసేందుకు చర్యలు, తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ వంటివి చేయడం ద్వారా మీ పొదుపు నిధులను వెచ్చించాల్సిన అవసరం లేకుండా చేయవచ్చు. ఇలాంటి ఆర్థిక అంశాలపై భార్యభర్తలలో ఒకరైనా చొరవ తీసుకోవడం ద్వారా ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను గాడిలో పెట్టవచ్చు. Most Popular