వ్యాపారం @ పదివేలు

వ్యాపారం @ పదివేలు

వ్యాపారాన్ని ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరమవుతుందని భావిస్తున్నారా..? రిస్క్‌ తీసుకొని డబ్బును సమకూరిస్తే వ్యాపారం సరిగ్గా నడవక డబ్బుతో పాటు సమయం, శ్రమ వృద్ధా అవుతాయని భయపడుతున్నారా...? అయితే ఒక్క నిమిషం ఆగండి. కేవలం పదివేల పెట్టుబడితో వ్యాపారం చేసుకుంటూ పదిమందికి ఉపాధి కల్పించే అవకాశముంటే ఎలా ఉంటుంది. ఇంకెందుకాలస్యం ఈ స్టోరీని చదివేసేయండి. చక్కని బిజినెస్‌ ఐడియాస్‌ను ఈవారం మీకోసం అందిస్తోంది మీ ప్రాఫిట్‌యువర్‌ ట్రేడ్‌ డాట్‌ఇన్‌.

వ్యాపారవేత్తగా మారాలంటే భారీగా నిధులు కావాలి. నిధుల వేటకు మీ శాయశక్తులూ వెచ్చించాలి. అయితే మీ కలలను సాకారం చేసుకోవడానికి ఒక్కోసారి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయినా ఢీలా పడకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తే ఎన్నో చక్కని ఐడియాలు వస్తాయి. చిన్న పెట్టుబడే మీతో పాటు పదిమందికి ఉపాధిని చూపుతుంది. అందుకు తగ్గట్టుగా ప్లాన్‌ చేసుకుంటే మీ లక్ష్యాలను మీరు అవలీలగా అందుకోవచ్చు. నిజానికి ఇక్కడ మీ నిజమైన పెట్టుబడి …మొదటిది మీ సమయం కాగా, రెండవది మీ యొక్క నైపుణ్యాలు (నాయకత్వ నైపుణ్యాలు, జట్టుని నడిపించడం, మీ సిబ్బందిని ఉత్సాహపరచడం లాంటివి). ఇక్కడ రిస్కు ఉన్నప్పటికీ... "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు" అన్నట్టు కొద్దిగా కష్టపడితే ఏదీ అసాధ్యం కాదని పలువురు నిరూపిస్తున్నారు. అతి తక్కువ పెట్టుబడితో మీ కలలను సాకారం చేసే వ్యాపారాలేంటో ఇప్పుడు చూద్దాం.

ట్రావెల్‌ ఏజెన్సీ : ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఎదుగుతోన్న రంగం టూరిజం. ప్రజల మైండ్‌సెట్‌ మారడం, కొత్త ప్రాంతాలను చూసేందుకు ఆసక్తి పెరగడంతో గత దశాబ్దకాలంగా ట్రావెల్‌ ఇండస్ట్రీ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. దీంతో చాలా మంది ట్రావెల్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేసుకొని పలువురికి ఉపాధిని చూపుతూ భారీగా ఆదాయాన్ని పొందుతున్నారు. 

ఆన్‌లైన్‌ టీచింగ్‌/ట్యూషన్‌ సెంటర్‌/ఆన్‌లైన్‌ కోర్సులు : ప్ర‌స్తుతం గూగుల్ లో వెతికితే ఎన్నో ఆన్‌లైన్ టీచింగ్ అవ‌కాశాలు ల‌భిస్తున్నాయి. ఇందులో మీకు అనుకూల‌మైన అంశం ఏమిటంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు పాఠాలు చెప్ప‌వ‌చ్చు. ఆన్‌లైన్ ట్యూట‌ర్ వెబ్‌సైట్ల‌లో న‌మోదు చేసుకునేందుకు కొన్ని ఉచితంగా అవ‌కాశాలు క‌ల్పిస్తుండ‌గా కొన్ని రుసుములు వ‌సూలు చేస్తున్నాయి. ఒక‌సారి ఆ వెబ్‌సైట్ల‌లో ట్యూట‌ర్‌గా నమోదు చేసుకున్న త‌ర్వాత మీకు అనుకూల‌మైన స‌మ‌యాన్ని అందులో పేర్కొన‌వ‌చ్చు. స్టేట్ సిల‌బ‌స్‌, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పదో త‌ర‌గ‌తి లోపు పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పేందుకు అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

అలాగే మీరు ఇంకొంచెం ధైర్యం చేస్తే పైసా ఖర్చు లేకుండా ట్యూషన్‌ సెంటర్‌ను కూడా ప్రారంభించొచ్చు. దీనికి పెద్ద ప్రచారం కూడా అవసరం లేదు. మీకు తెలిసిన వారికి ఈ విషయాన్ని చెప్పి పదిమందికి తెలిసేలా చేస్తే చాలు. మీరు ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించొచ్చు. అవసరమైతే సోషల్‌ మీడియాను కూడా వినియోగించుకుని ట్యూషన్‌ సెంటర్‌ను డెవలప్‌ చేయొచ్చు. సొంత ఇంట్లోనే క్లాసులు తీసుకొని రోజూ రెండు మూడు గంటలు కష్టపడితే చాలు. మీ ఫ్యామిలీ హాయిగా బతికేయొచ్చు. 

మొబైల్‌ రీఛార్జ్‌ షాపు : ప్రస్తుతం ఆన్‌లైన్‌ రీఛార్జికి డిమాండ్‌ పెరిగినప్పటికీ భారత్‌లో మొబైల్‌ వినియోగదారులు రీఛార్జి షాపునకు వెళ్ళడానికే ఇప్పటికీ మొగ్గు చూపుతున్నారు. చిన్న షాపును అద్దెకు తీసుకుని ఈ బిజినెస్‌ను అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. నెల అద్దె, అతి తక్కువ మెయింటనెన్స్‌తో ఎంతోమంది ఈ సెగ్మెంట్లో ఉపాధిని పొందుతున్నారు. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా తదితర మొబైల్‌ ఆపరేటర్లు రీఛార్జిలపై ప్రోత్సాహకర కమిషన్‌ను ఇస్తున్నాయి. 

బ్రేక్‌ఫాస్ట్‌, టీ స్టోర్స్‌ : ఈ బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రెడీ టు డ్రింక్‌తో పాటు బయటి ఫుడ్‌పై ఆసక్తి చూపుతున్నారు. ప్రైమ్‌ లొకేషన్స్‌లో అతి తక్కువ ధరకు లభించే షాపును అద్దెకు తీసుకుని బిజినెస్‌ను నడపవచ్చు. కస్టమర్లను సగౌరవంగా ఆహ్వానించేలా ప్లాన్‌ చేసుకొని,  లాభం  కొద్దిగా తక్కువగా వచ్చినప్పటికీ నాణ్యమైన సరుకులతో టేస్టీ ఫుడ్‌ను అందించాలి. దీంతో కస్టమర్లే బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారి  మీ సంస్థ గురించి తెలిసిన వారందరికీ చెప్పడంతో మీకు ఉచితంగా ప్రచారం లభించి మీ బిజినెస్‌ వేగంగా వృద్ధి చెందుతుంది. 

గార్మెంట్‌ టైలర్‌ : ప్రస్తుతం భారత్‌లో ఫ్యాషన్ డిజైనర్‌లకు చక్కని డిమాండ్‌ ఉంది. అయిత పెద్ద మొత్తంలో డబ్బును వెచ్చించలేని మధ్యతరగతి ప్రజలు తమకు అందుబాటులో ఉన్న టైలర్‌ దగ్గరికి వెళ్ళి తమకు నచ్చిన దుస్తులు కుట్టించుకుంటారు. రెడీమేడ్‌ దుస్తులకు అనుగుణంగా అతి తక్కువ ధరకే సరికొత్త డిజైన్స్‌ కుట్టే టైలర్స్‌కు కోల్‌కతా, ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో చక్కని డిమాండ్‌ ఉంది. కొంచెం కష్టపడితే ఈ రంగంలో పెద్ద మొత్తంలో కాసులు సంపాదించుకోవచ్చు. ఐదారు మంది ఉద్యోగులతో చిన్న షాపులో అతి తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఫ్యాషన్‌పై జనం మక్కువ చూపినంతకాలం ఈ బిజినెస్‌ బంగారు బాతులాంటింది.

ఆన్‌లైన్‌ జాబ్స్‌, యూట్యూబ్‌ ఛానెల్‌ : ఇంట‌ర్నెట్ రాక‌తో ప్ర‌పంచం కుగ్రామం అయిపోయింది. దీంతో ఇక్క‌డ ఇంట్లో కూర్చొని వేరే దేశం వాళ్ల‌కు అవ‌స‌ర‌మైన ప‌నిచేసి పెట్టి గంట‌కు ప‌దుల‌ డాల‌ర్ల‌లో డ‌బ్బు సంపాదించే మార్గాలు వ‌చ్చాయి. కాస్త సాంకేతిక ప‌రిజ్ఞానం ఉండి ఒక కంప్యూట‌ర్ లేదా ల్యాప్‌ట్యాప్ ఉంటే చాలు ఆన్‌లైన్‌లో డ‌బ్బు ఆర్జించ‌వ‌చ్చు. మీ ఉద్యోగం ప‌నిగంట‌ల వ‌ర‌కే మీరు కార్యాల‌యంలో ప‌ని చేస్తూ ఉండి మీకు ఫ్రీ టైం ఉండేట్ల‌యితే అద‌న‌పు డ‌బ్బు సంపాదించ‌డానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొంచెం కష్టపడి మీలాంటి మరికొంతమందిని ఒక్కచోట చేర్చి చిన్న ఆఫీస్‌ను అద్దెకు తీసుకుని చిన్న చిన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి వ్యాపారంలో సక్సెస్‌ కావచ్చు. అలాగే బ్లాగులు, యూట్యూబ్‌ ఛానెల్‌ను కూడా ప్రారంభించవచ్చు. 

నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ : ఇది ఒక ఒక ప్రత్యేకమైన అమ్మకాల వ్యవస్థ. ఇది సంప్రదాయ సేల్స్‌ సిస్టమ్స్‌కి భిన్నంగా, స్నేహితులకి, బంధువులకి, పరిచయస్తులకు, ఇతరులకి నేరుగా వస్తువులను అమ్మే ఒక డైరెక్ట్‌ సెల్లింగ్‌ పద్ధతి. ఇప్పటివరకూ ఈ పద్ధతి వల్ల వేర్వేరు సామాజిక నేపథ్యాలున్న, వేర్వేరు ఆర్ధిక పరిస్థితుల నుండి వచ్చిన  లక్షలాది మంది స్త్రీ పురుషులు లక్షల్లో సంపాదిస్తున్నారు. 

సంప్రదాయ వ్యాపారంలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరమవుతుంది. డబ్బుతో పాటు, సమయం, శ్రమ ఇవన్నీ కూడా ఖర్చవుతాయి. నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌లో పెట్టుబడి చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే మీరు ప్రమోట్ చేసే ఉత్పత్తుల నాణ్యతను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే అదృష్టవశాత్తూ అనేక సంస్థలు మెరుగైన నాణ్యతగల ఉత్పత్తులను అందిస్తున్నాయి. వీటిలోనుంచి ఉత్తమ స్థాయి వాటిని మాత్రమే ఎంచుకుని ప్రమోట్ చేయగలిగితే మార్కెట్లో మీ విశ్వసనీయత కూడా పెరుగుతుంది.Most Popular