అమెరికా మార్కెట్లకు వాల్‌మార్ట్‌ షాక్‌!

అమెరికా మార్కెట్లకు వాల్‌మార్ట్‌ షాక్‌!

ప్రెసిడెంట్ డే సందర్భంగా సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. మంగళవారం మరోసారి భారీ అమ్మకాలతో పతనమయ్యాయి. ప్రదానంగా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ట్రేడింగ్‌ ముగిసేసరికి డోజోన్స్‌ 255 పాయింట్లు(1 శాతంపైగా) పతనమై 24,965 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ 16 పాయింట్లు(0.6 శాతం) క్షీణించి 2,716 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 5 పాయింట్ల నామమాత్ర నష్టంతో 7,234 వద్ద స్థిరపడింది. వెరసి ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. కాగా.. గడిచిన వారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు గత ఐదేళ్లలోనే అత్యధిక స్థాయిలో లాభపడిన సంగతి తెలిసిందే! 
వాల్‌మార్ట్‌ దెబ్బ
రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ షేరు 1988 జనవరి తరువాత తొలిసారి 10 శాతం పడిపోవడం మార్కెట్లను దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. హాలిడే సీజన్‌లోనూ ఆన్‌లైన్‌ అమ్మకాలు క్షీణించడంతోపాటు.. డిసెంబర్‌ క్వార్టర్‌లో నికర లాభం అంచనాలను చేరకపోవడం వంటి అంశాలు ఈ కౌంటర్లో భారీ అమ్మకాలకు కారణమైనట్లు తెలియజేశారు. దీంతో ఇతర రిటైల్‌ దిగ్గజాలలో టార్గెట్‌ 3 శాతం, క్రోగర్‌ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. అయితే అమెజాన్‌ 1.4 శాతం పుంజుకుంది.Most Popular