హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ ఐపీవో 26న!

హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ ఐపీవో 26న!

మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కంపెనీ హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఐపీవో ఈ నెల 26న(సోమవారం) ప్రారంభంకానుంది. షేరుకి రూ. 263-270 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 462 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఆఫర్ 28న(బుధవారం) ముగియనుంది. నిధులను పరికరాల కొనుగోలు, రుణాల చెల్లింపు, సాధారణ పాలనా వ్యవహారాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 
55 షేర్లు ఒక లాట్‌
రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 55 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువకు మించకుండా ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 300 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుండటంతోపాటు 60 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో ప్రమోటర్లు రూ. 162 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు.
కంపెనీ వివరాలివీ
2003లో ప్రారంభమైన హెచ్‌జీ ఇన్‌ఫ్రా మౌలిక సదుపాయాల రంగంలో ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) విభాగంలో ప్రధానంగా సర్వీసులు అందిస్తోంది. రహదారులు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల నిర్మాణంలో కార్యకలాపాలు విస్తరించింది. వీటితోపాటు నీటిపారుదల ప్రాజెక్టులలోకి సైతం ప్రవేశించింది. రాజస్తాన్‌లో టర్న్‌కీ పద్దతిలో నీటిపారుదల ప్రాజెక్టులను చేపడుతోంది. మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారానే 93 శాతం టర్నోవర్‌ సమకూరుతున్నట్లు కంపెనీ ఎండీ హరేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.
ఆర్థిక పనితీరు
2017 మార్చితో ముగిసిన ఏడాదిలో 36 శాతం వృద్ధితో రూ. 974 కోట్ల ఆదాయం సాధించింది. నికర లాభం 63 శాతం జంప్‌చేసి రూ. 49 కోట్లను తాకింది. కాగా.. గతేడాది మౌలిక సదుపాయాల సంస్థ భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. Most Popular