చిన్న షేర్లు భళా- భారీ లాభాల ముగింపు!

చిన్న షేర్లు భళా- భారీ లాభాల ముగింపు!

గత వారం చవిచూసిన భారీ నష్టాల నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడ్డ సెంటిమెంటు నేపథ్యంలో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు కట్టుబడటంతో మార్కెట్లు రోజంతా పటిష్ట లాభాలతో కదిలాయి. చివరికి రోజులో గరిష్టంవద్దే నిలిచాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 294 పాయింట్లు జంప్‌చేసి 34,300 వద్ద నిలవగా.. నిఫ్టీ 85 పాయింట్లు ఎసగి 10,540 వద్ద స్థిరపడింది. శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభపడగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా, యూరప్‌ మార్కెట్లు పురోగమించడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ డీలా
ఎన్‌ఎస్ఈలో రియల్టీ, ఫార్మా, ఆటో, మెటల్‌ రంగాలు 2-1 శాతం మధ్య పుంజుకోగా.. ఐటీ 0.6 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. బ్లూచిప్స్‌లో టాటా స్టీల్‌, అరబిందో, యూపీఎల్‌, యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్, పవర్‌గ్రిడ్‌, లుపిన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, హీరోమోటో 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌పీసీఎల్‌, అంబుజా, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, ఐటీసీ 2.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
చిన్న షేర్లకు డిమాండ్‌
మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్ ఏర్పడింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 2,031 లాభపడితే.. 771 మాత్రమే నష్టపోయాయి.
అమ్మకాలవైపే ఎఫ్‌పీఐలు
అమెరికా బాండ్ల ఈల్డ్స్‌ ఊపందుకున్న నేపథ్యంలో ఇటీవల దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ అమ్మకాలకు తెరతీసిన విషయం విదితమే. శుక్రవారం నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1352 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా... దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 588 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. గత రెండు సెషన్లలో(బుధ, గురువారాల్లో) ఎఫ్‌పీఐలు రూ. 3320 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2830 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.Most Popular