రేటింగ్‌తో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా హైజంప్‌!

రేటింగ్‌తో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా హైజంప్‌!

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఓమాదిరి ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బీవోబీ 7.2 శాతం జంప్‌చేసి రూ. 167 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 173 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇందుకు విదేశీ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ బీవోబీ స్టాక్‌కు ఈక్విల్‌ వెయిటేజీని ప్రకటించడం దోహదపడింది. ఏడాది కాలంలో బీవోబీ షేరుకి రూ. 195 టార్గెట్‌ ధరను ప్రకటించింది. ఇది ప్రస్తుత ధరతో పోలిస్తే 25 శాతం ప్రీమియంకావడం విశేషం.
క్యూ3 వీక్‌
క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బీవోబీ నికర లాభం 56 శాతం క్షీణించి రూ. 112 కోట్లకు పరిమితమైంది. అయితే  నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 40 శాతం పెరిగి రూ. 4,394 కోట్లను అధిగమించింది. కాగా.. లాభదాయకతను మొండిబకాయిల(ఎన్‌పీఏలు)కు కేటాయింపులు ప్రధానంగా దెబ్బతీశాయి. ప్రొవిజన్లు రూ. 2079 కోట్ల నుంచి రూ. 3426 కోట్లకు ఎగశాయి. స్థూల ఎన్‌పీఏలు 11.16 శాతం నుంచి 11.31 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 5.05 శాతం నుంచి 4.97 శాతానికి ఉపశమించాయి. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 2.31 శాతం నుంచి 2.72 శాతానికి బలపడ్డాయి. Most Popular