ఎస్‌బీఐ 3% డౌన్‌- ఫలితాల ఎఫెక్ట్‌!

ఎస్‌బీఐ 3% డౌన్‌- ఫలితాల ఎఫెక్ట్‌!

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అనూహ్య నష్టాలను ప్రకటించిన ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కౌంటర్‌లో అమ్మకాలు పెరగడంతో డీలా పడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3.1 శాతం క్షీణించి రూ.287 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 285 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. దాదాపు రెండు దశాబ్దాల తరువాత అత్యంత భారీ స్ఠాయిలో రూ. 2416 కోట్ల నికర నష్టం ప్రకటించడంతో ఈ కౌంటర్‌ బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంతక్రితం 1999లో మాత్రమే ఎస్‌బీఐ ఒక క్వార్టర్‌లో నష్టాలు ప్రకటించింది.
క్యూ3 వీక్‌
క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఎస్‌బీఐ లాభదాయకతను మొండిబకాయిల(ఎన్‌పీఏలు)కు కేటాయింపులు ప్రధానంగా దెబ్బతీశాయి. గతేడాది(2016-17) క్యూ3లో బ్యాంక్‌ రూ. 1820 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 5 శాతం పెరిగి రూ. 18,687 కోట్లను అధిగమించగా.. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 2 బేసిస్‌ పాయింట్లు బలపడి 2.45 శాతానికి చేరాయి. స్థూల ఎన్‌పీఏలు 9.83 శాతం నుంచి 10.35 శాతానికి ఎగశాయి. నికర ఎన్‌పీఏలు సైతం 5.43 శాతం నుంచి 5.61 శాతానికి పెరిగాయి.
ప్రొవిజన్లు అప్‌
మొండి బకాయిలకు కేటాయింపులు(ప్రొవిజన్లు) 145 శాతం ఎగసి రూ. 17,760 కోట్లను తాకాయి. సెప్టెంబర్‌ క్వార్టర్‌తో పోల్చినా ఇవి 6 శాతంపైగా పెరిగాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు ఒత్తిడిలో ఉన్న కొన్ని రుణాలను మొండి బకాయిలుగా చూపాల్సి వచ్చినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. దీంతో తాజా స్లిప్పేజెస్‌ రూ. 9026 కోట్ల నుంచి రూ. 25,836 కోట్లకు జంప్‌చేసినట్లు వెల్లడించింది. Most Popular