యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ ఐపీవో నేడు ముగింపు!

యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ ఐపీవో నేడు ముగింపు!

కొచ్చి కేంద్రంగా ఏర్పాటైన యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. ప్రధానంగా అరబ్‌ దేశాలలో ఆసుపత్రులను నిర్వహిస్తున్నసంస్థ ఐపీవో సోమవారం(12న) ప్రారంభమైంది.ఇష్యూకి ధరల శ్రేణి రూ. 180-190కాగా... తద్వారా సంస్థ రూ. 980 కోట్లవరకూ సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూ గురువారం(15న) ముగియనుంది. యాస్టర్‌, మెడ్‌కేర్‌, యాక్సెస్‌ బ్రాండ్లతో ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఫార్మసీలను నిర్వహిస్తోంది. 
78 షేర్లు ఒక లాట్‌
రూ. 10 ముఖ విలువగల 78 షేర్లను ఒకలాట్‌గా యాస్టర్‌ డీఎం నిర్ణయించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఇవే గుణిజాల్లో రూ. 2 లక్షల మొత్తానికి మించకుండా ఒకే లాట్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. ఐపీవో నిధులను సంస్థ రుణాల చెల్లింపు, వైద్య పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 
ఇతర వివరాలివీ
అరబ్‌ దేశాలతోపాటు కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ ఆసుపత్రులు, క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. తద్వారా వివిధ వైద్య సేవలను అందిస్తోంది. ఆదాయంలో 84 శాతం అరబ్‌ దేశాల నుంచే సమకూరుతుండగా.. దేశీయంగా 16 శాతం సమకూరుతోంది. మొత్తం 19 ఆసుపత్రులు, 4754 బెడ్‌లతో కార్యకలాపాలు విస్తరించింది. 
పనితీరు అంతంతే
గత ఐదేళ్లలో పనితీరులో నిలకడ లోపించమేకాకుండా ఆదాయంలో నామమాత్ర వృద్ధి నమోదవుతూ వచ్చింది. గత మూడేళ్లలో 4.5 శాతం స్థాయిలోనే కన్సాలిడేటెడ్‌ మార్జిన్లు సాధిస్తూ వస్తోంది. 2016-17లో యాస్టర్‌ రూ. 5968 కోట్ల ఆదాయం ప్రకటించింది. దీనిపై రూ. 267 కోట్ల నికర లాభం ఆర్జించింది. రూ. 4.3 ఈపీఎస్‌ నమోదైంది. అంటే ఐపీవోకు 44 రెట్లు అధిక ధర(పీఈ)ను ఆశిస్తోంది. అత్యధిక శాతం మంది విశ్లేషకులు ఇష్యూ ధర అధికంకావడంతో లాభాలకు ఆస్కారం తక్కువేనని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనవుతుండటంతో రిస్క్‌ అధికమని వ్యాఖ్యానిస్తున్నారు.Most Popular