ఇకపై ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీకి చెల్లుచీటీ! ఎందుకో తెలుసా?

ఇకపై ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీకి చెల్లుచీటీ! ఎందుకో తెలుసా?

సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎస్‌జీఎక్స్‌)లో ఇకపై నిఫ్టీ ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ను అనుమతించబోమంటూ తాజాగా దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ప్రకటించాయి. ఇందుకు వీలుగా వెంటనే అమల్లోకి వచ్చే విధంగా లైసెన్సింగ్‌ను రద్దు చేస్తున్నట్లు తెలియజేశాయి. తద్వారా ఎస్‌జీఎక్స్‌కు నిఫ్టీ సంబంధిత రియల్‌ టైమ్‌ డేటాను అందివ్వబోమంటూ పేర్కొన్నాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ), ముంబై స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ), మెట్రోపాలిటన్‌ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎంఎస్‌ఈ) సంయుక్తంగా ఈ ప్రకటనను విడుదల చేయడం విశేషం! విదేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీల ప్లాట్‌ఫామ్‌లపై ఇకనుంచీ దేశీ ఇండెక్సులు లేదా స్టాక్‌లకు సంబంధించిన డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ను నిలుపుదల చేసేందుకు వీలుగా లైసెన్సింగ్‌ ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు తెలియజేశాయి. అయితే ఇప్పటివరకూ నమోదైన ఔట్‌ స్టాండింగ్‌ కాంట్రాక్టులకు ఆరు నెలల గడువు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి. 
కారణమేవిటంటే?
గత కొన్నేళ్లుగా ఎస్‌జీఎక్స్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్‌ జరుగుతోంది. ఇందుకు దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందుకు ఎస్‌జీఎక్స్‌ ఒప్పందం ప్రకారం ఫీజును చెల్లిస్తుంటుంది. అయితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) నిఫ్టీ ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్‌కు ఎస్‌జీఎక్స్‌నే ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. దీంతో నిఫ్టీ ఫ్యూచర్స్‌లో జరిగే ప్రపంచవ్యాప్త ట్రేడింగ్‌లో సగం ఎస్‌జీఎక్స్‌కు బదిలీ అయింది. 2017లో నిఫ్టీ ఫ్యూచర్స్‌లో మొత్తం రూ. 51 లక్షల కోట్ల టర్నోవర్‌ నమోదుకాగా.. దీనిలో ఎన్‌ఎస్‌ఈ వాటా 53 శాతానికి పరిమితమైతే... ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 46 శాతంపైగా వాటాను ఆక్రమించడం గమనించదగ్గ అంశం!
 

పన్నుల ఎఫెక్ట్‌
భారత్‌యేతర ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్‌ వ్యయాలు తక్కువగా ఉండటంతో ఎఫ్‌ఐఐ సంస్థలు నిఫ్టీ ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్‌కు ఎస్‌జీఎక్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు.  కమోడిటీలలో ట్రేడింగ్‌కు దుబాయ్‌ గోల్డ్‌ అండ్‌ కమోడిటీస్‌ ఎక్స్ఛేంజ్‌(డీజీసీఎక్స్‌)ను ఆశ్రయిస్తున్నాయి. దేశీయంగా అయితే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ టాక్స్‌(ఎస్‌టీటీ)తోపాటు లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉండటం వంటి అంశాలు దీనికి కారణాలుగా మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ట్రేడింగ్‌ లిక్విడిటీ విదేశాలకు మళ్లి పన్ను వసూళ్లు తగ్గుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఎస్‌జీఎక్స్‌, దుబాయ్‌ ఎక్స్ఛేంజీలలో ఈ తరహా పన్నులు లేకపోగా.. ట్రేడింగ్‌ సమయం సైతం అధికంగా ఉండటం ఎఫ్‌ఐఐలను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు పార్టిసిపేటరీ నోట్ల(పీనోట్స్‌) రిజిస్ట్రేషన్‌ దేశీయంగా తప్పనిసరికావడం వల్ల కూడా విదేశీ ఇన్వెస్టర్లు ట్రేడింగ్ కోసం ఎస్.జి.ఎక్స్‌ను ఆశ్రయించడం మరో కారణం. 

ప్రభుత్వం, సెబీ అంసతృప్తి
దీంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చాయి. టర్నోవర్ తరలిపోతున్న ఫలితంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సైతం విదేశాలలో ట్రేడింగ్‌కు చెక్‌ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వెరసి అటు ఎస్‌జీఎక్స్‌తోపాటు ఇటు దుబాయ్‌ కమోడిటీ ఎక్స్ఛేంజీతోనూ లైసెన్సింగ్‌ ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు తీర్మానించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
 

స్టాక్‌ ఫ్యూచర్స్‌కు సైతం
ఇప్పటికే నిఫ్టీ ఫ్యూచర్స్‌లో భారీ వాటాను కొల్లగొట్టిన ఎస్‌జీఎక్స్‌ ఇటీవల విడిగా స్టాక్స్‌లోనూ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌కు తెరతీసే సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు నో చెప్పినప్పటికీ గత వారం ఎస్‌జీఎక్స్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసింది. దీంతో దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు టోటల్‌గా లైసెన్సింగ్‌ ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.Most Popular