ఈ వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్ ?

ఈ వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్ ?

దేశీ స్టాక్‌ మార్కెట్లను వచ్చే వారం ప్రధానంగా స్థూల ఆర్థిక గణాంకాలూ, విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు వంటి అంశాలే ప్రభావితం చేయనున్నాయి. ఇప్పటికే ఫెడరల్‌ రిజర్వ్‌సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు బాటను అనుసరించనున్న అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనమవుతున్నాయి. అమెరికా మార్కెట్లయితే గత రెండేళ్లలోలేని విధంగా గడిచిన వారం 5 శాతం కుప్పకూలాయి. వెరసి బేర్‌ దశలోకి ప్రవేశించినట్లు పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వారాంతాన(9న) అమెరికా మార్కెట్లు 1.5 శాతం జంప్‌చేయడం గమనించదగ్గ అంశం!
ద్రవ్యోల్బణం దారెటు?
జనవరి నెలకు వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను ప్రభుత్వం సోమవారం(12న) విడుదల చేయనుంది. ఇదే రోజు డిసెంబర్‌ నెలలో పారిశ్రామికోత్పత్తి ప్రగతి(ఐఐపీ) వివరాలను సైతం వెల్లడించనుంది. 2017 డిసెంబర్‌లో సీపీఐ 5.21 శాతం ఎగసింది. ఇక నవంబర్‌లో ఐఐపీ 8.4 శాతం పురోగమించింది. ఈ బాటలో జనవరికి టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలను ప్రభుత్వం బుధవారం(14న) తెలియజేయనుంది. 2017 డిసెంబర్‌లో డబ్ల్యూపీఐ 3.58 శాతం పెరిగింది. 
ఆర్‌బీఐపై ఎఫెక్ట్‌
సీపీఐ, ఐఐపీ, డబ్ల్యూపీఐ గణాంకాలు రిజర్వ్‌ బ్యాంక్ చేపట్టే పరపతి సమీక్షలపై ప్రభావం చూపే సంగతి తెలిసిందే. గత పాలసీ సమీక్షలో యథాతథ రేట్ల అమలుకే కట్టుబడ్డ ఆర్‌బీఐ ఇకపై వడ్డీ రేట్ల తగ్గింపు బాట నుంచి పెంపు బాట వైపునకు మళ్లే సంకేతాలు వెలువరించింది. దీంతో ఇన్వెస్టర్లు ధరల తీరును నిశితంగా గమనించనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ఫలితాలూ కీలకమే
వచ్చే వారం పలు బ్లూచిప్స్‌ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) పనితీరును వెల్లడించనున్నాయి. అమరరాజా, కేశోరామ్‌, కోల్‌ ఇండియా నేడు(శనివారం) ఫలితాలు ప్రకటించనుండగా.. బ్రిటానియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గెయిల్‌(12న).. ఎన్‌బీసీసీ, ఎన్‌ఎండీసీ(13న).. గ్రాసిమ్‌, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, నెస్లే, సన్‌ ఫార్మా, టాటా పవర్‌(14న) పనితీరును వెల్లడించనున్నాయి.
ఇతర అంశాలకూ ప్రాధాన్యం
జపాన్‌ జీడీపీ గణాంకాలు 13న వెలువడనుండగా, జనవరి నెలకు యూఎస్‌ సీపీఐ 14న తెలియనుంది. వీటితోపాటు.. ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి పలు అంశాలు దేశీ స్టాక్‌ మార్కెట్లో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.Most Popular