బేర్ మార్కెట్ వస్తే.. చరిత్రలో భారీ పతనం ఖాయం!!

బేర్ మార్కెట్ వస్తే.. చరిత్రలో భారీ పతనం ఖాయం!!

స్టాక్ మార్కెట్లలో ఆందోళన పూర్వక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న వార్తలు అక్కడి మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్లను వణికించడమే కాదు.. శాసిస్తున్నాయి కూడా. గత ఏడాదిన్నర కాలంగా బుల్ మార్కెట్‌ను ఎంజాయ్ చేస్తున్న మదుపర్లకు.. ఇపుడు సడెన్‌గా బేర్ మార్కెట్ వస్తే పరిస్థితి ఏంటనే ఆలోచన ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పుడు కనుక బేర్ మార్కెట్ వస్తే మాత్రం.. అది ఇప్పటివరకూ ఇన్వెస్టర్లు తమ జీవితంలో చూడనటువంటి భారీ పతనాలను ఫేస్ చేయాల్సి వస్తుందని సీనియర్ మోస్ట్ ఇన్వెస్టర్లలో ఒకరైన జిమ్ రోజర్స్ అంటున్నారు. 75 ఏళ్ల వయసున్న ఈయన.. అమెరికాలో ఆర్థిక సంక్షోభం కాలం నాటితో పోల్చితే మరింత ఎక్కువగా రుణాలు పేరుకుపోయిన సంగతి గుర్తు చేస్తున్నారు. మార్కెట్లలో ఇప్పుడు కనిపిస్తున్న ఆటుపోట్లు సర్వసాధారణమైనవిగా ఆయన అభిప్రాయపడుతున్నారు. 

 

వరస్ట్ ఫేజ్

"మళ్లీ బేర్ మార్కెట్ వచ్చినపుడు, మనం బేర్ మార్కెట్ దశలోకి వెళుతున్నపుడు, జీవితంలో అత్యంత వరస్ట్ ఫేజ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సర్వత్రా రుణాలు పేరుకుపోయి ఉన్నాయి. ఇవి ఇప్పుడు మరింతగా పెరిగిపోయాయి" అన్నారు రోజర్స్ హోల్డింగ్స్ ఛైర్మన్ రోజర్స్. 

ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీకి ఓ వారం రోజులుగా బ్రేక్ పడింది. అమెరికా మార్కెట్లు ఒకే రోజున 4 శాతం చొప్పున పడిపోవడం.. ఒకే వారంలో 2 సార్లు జరిగింది. జనవరి 26న గరిష్ట స్థాయి నుంచి చూసినపుడు ఇప్పటికే 10శాతం మేర యూఎస్ మార్కెట్లు పతనం అయ్యాయి. డౌజోన్స్ ఏకంగా 1000 పాయింట్ల చొప్పున నష్టాలను నమోదు చేయడం చూస్తుంది. 

 

బేర్ మార్కెట్స్
ఇప్పటివరకూ తాను 7 మార్లు బేర్ మార్కెట్స్ చూశానని అంటున్నారు రోజర్స్. ఆర్థిక సంక్షోభం సమయంలో.. అంటే అక్టోబర్ 2007లో అత్యంత గరిష్ట స్థాయి నుంచి మార్చ్ 2009  కనిష్ట స్థాయికి పడిపోయినపుడు.. మార్కెట్లు 50శాతానికి పైగా పతనం అయ్యాయి. 2000లో ఐటీ బబుల్ పీక్స్ లో ఉన్న కాలంతో పోల్చితే.. 2002 ఫిబ్రవరి నాటికి మార్కెట్లు 38 శాతం పతనం అయ్యాయి. 

"జిమ్ అనేక పతనాలను చూసి, వాటిని గురించి మాట్లాడుతున్నారు. నేను వ్యాపారాన్ని 30 ఏళ్ల క్రితం మాత్రమే ప్రారంభించాను. ఆయన చెబుతున్నది ఏదో ఒక సమయంలో నిజం కావచ్చని అనుకుంటున్నాను," అని ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ ప్రెసిడెంట్ మైక్ ఎవాన్స్ అంటున్నారు. 

 

ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే నిర్ణయాలు తీసుకునేవరకూ ఇలాంటి పరిస్థితి కనిపించవచ్చని జిమ్ రోజర్స్ అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో స్టాక్స్ మళ్లీ పెరగవచ్చని ఆయన అంచనా. ఇప్పుడు అయితే తాను అగ్రికల్చర్ ఇండెక్స్‌ను కొనుగోలు చేస్తానని చెప్పారు రోజర్స్. కొంతకాలంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఒత్తిడికి లోను కావడమే ఇందుకు కారణంగా చెప్పారు. 

మార్కెట్ టైమింగ్ విషయంలో తాను అంత కరెక్ట్ కాదన్న జిమ్ రోజర్స్.. మార్చ్‌లో వడ్డీ రేట్ల పెంపు అనంతరం మార్కెట్లు భారీగా నష్టపోయినా.. తిరిగి ర్యాలీ సాధించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
 Most Popular