ఇల్లు, కార్ లోన్ ఈఎంఐలు మళ్లీ పెరగబోతున్నాయా ?

ఇల్లు, కార్ లోన్ ఈఎంఐలు మళ్లీ పెరగబోతున్నాయా ?

మార్కెట్ నుంచి నిధుల సేకరణ ఖర్చులు పెరగడంతో మార్జిన్లను కాపాడుకునేందుకు.. బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు వైపు దృష్టి సారిస్తున్నాయి. డిపాజిట్ రేట్లను ఆకర్షణీయంగా మార్చేందుకు వడ్డీ రేట్ల పెంపు తప్పనిసరి. ఇదే సమయంలో రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరిగిపోవడం ఖాయం. మార్చ్‌ లేదా ఏప్రిల్‌లలో వడ్డీ రేట్లను పెంపునకు బ్యాంకులు సిద్ధపడవచ్చని నిపుణులు అంటున్నారు.

బేస్‌రేటును ఎంసీఎల్ఆర్‌తో లింక్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నా.. ఇది ఏప్రిల్ 1 నుంచి అమలు కానుంది. నాలుగేళ్ల పాటు తగ్గుతూ వచ్చిన వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని, ఫిబ్రవరి 7న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ భేటీ అనంతరం సూచనప్రాయంగా తెలిసింది.


గత కొన్ని నెలలలో బాండ్ ఈల్డ్స్‌ ఒక శాతం మేర పెరిగాయి. దీంతో డిపాజిట్ సర్టిఫికెట్స్‌ను జారీ చేయడం బ్యాంకులకు ఖరీదుగా మారింది. అంతే కాదు, మార్కెట్ బారోయింగ్స్ ఖర్చు పెరగడంతో అధిక రేటెడ్ కార్పొరేట్ కంపెనీలు కూడా బ్యాంకులకు క్యూ కడుతున్నాయి. దీంతో వడ్డీ రేట్ల పెంపు వైపునకు బ్యాంకులు సమాలోచనలు జరుపుతున్నాయి. 
ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రైవేటు బ్యాంకులు అయిన యాక్సిస్, కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్‌, యస్ బ్యాంక్‌లు 5-10 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ రేటును పెంచాయి.

 

10 ఏళ్ల ఈల్డ్‌లో అంతరం & గృహరుణాలపై 4 ఏళ్ల కనిష్ట స్థాయిలో ఎస్‌బీఐ వడ్డీ
పదేళ్ల ఈల్డ్ 7.5 శాతం.. ఎస్‌బీఐ హోమ్ లోన్ రేట్ 8.3 శాతంగా ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఇంత తక్కువ అంతరం ఉండడం.. గత నాలుగేళ్లలో ఇదే ప్రథమం. ఇలాంటి అధిక ఈల్డ్ కారణంగా ప్రభుత్వ నిధుల సేకరణ ఖర్చులు పెరుగుతాయి. అవి మానిటరీ పాలసీపై ప్రభావం చూపుతాయి. అందుకే ఎంసీఎల్ఆర్ పెరగడం ప్రారంభమైంది. 
బల్క్ డిపాజిట్ రేట్లను బ్యాంకులు పెంచడం ప్రారంభించడాన్ని.. వడ్డీ రేట్లు పెరరగడానికి ప్రారంభంగా చెప్పవచ్చు. ఏడాదికి పైబడ్డ కాలవ్యవధి గల రూ. 1 కోటికి పైగా డిపాజిట్లపై వడ్డీ రేటును.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 200 బేసిస్ పాయింట్ల మేర పెంచి 6.25 శాతానికి చేర్చింది. డిపాజిట్స్ వృద్ధి రేటు 4.5 శాతంగా ఉండగా.. లోన్స్ వృద్ధి 1 శాతంగా ఉన్నట్లు జనవరి 5 నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. 

 

ఈ లిక్విడిటీ పరిస్థితుల ప్రకారం వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు పుష్కంలగా ఉన్నాయని మనీ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ మార్కెట్ లీడర్ ఎస్‌బీఐ.. ఎంసీఎల్ఆర్ రేట్‌ను పెంచలేదు. కానీ గత నెలలో బేస్‌రేటును 30 బేసిస్ పాయింట్లు తగ్గించినా.. ఇతర బ్యాంకులు ఏవీ ఈ చర్యను అనుసరించలేదు. బ్యాంకులు తాము అందించే రుణాలను బేస్‌రేటుకు మాత్రమే లింక్ చేసి ఉన్నాయి. ఇవి వడ్డీ రేట్ల పెంపునకు మాత్రమే సిద్ధమవుతున్నాయని క్రిసిల్ అంటోంది.Most Popular