పతన మార్కెట్లో తీపెక్కిన షుగర్‌ షేర్లు! 

పతన మార్కెట్లో తీపెక్కిన షుగర్‌ షేర్లు! 

ప్రపంచవ్యాప్త అమ్మకాలతో పతన బాట పట్టిన దేశీ స్టాక్‌ మార్కెట్లలో ప్రస్తుతం షుగర్‌ రంగ షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల తీపిని పంచుతున్నాయి. బీఎస్‌ఈలో పలు షుగర్‌ షేర్లు 20-3 శాతం మధ్య జంప్‌చేశాయి. అవధ్‌ షుగర్స్‌ 20 శాతం దూసుకెళ్లగా.. ధంపూర్‌, మగథ్‌, మవానా, ఉత్తమ్‌, ద్వారికేష్‌, త్రివేణీ, దాల్మియా, గాయత్రి, తిరుఅరూరన్‌ తదితరాలు 13-3 శాతం మధ్య ఎగశాయి.
కారణాలున్నాయ్‌..
ఈ ఏడాది చెరకు సీజన్‌లో చక్కెర ఉత్పత్తి ఊపందుకోనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ధరలు పతనంకాకుండా నిలువరించే బాటలో దేశీయంగా చక్కెర అమ్మకాలపై షుగర్‌ మిల్లులకు ప్రభుత్వం తాజాగా పరిమితులను విధించింది. ఫిబ్రవరి, మార్చిలలో ఈ పరిమితులు అమలుకానున్నాయి. ఫిబ్రవరిలో చక్కెర మిల్లులు తమ నిల్వలను 83 శాతం వరకూ నిలపుకోవలసి ఉంటుంది. మార్చికల్లా 86 శాతం నిల్వలను కొనసాగించాల్సి ఉంటుంది. తద్వారా దేశీయంగా అధిక విక్రయాలకు తెరపడనుంది. 
దిగుమతి సుంకం పెంపు
దేశీయంగా విక్రయాలకు చెక్‌ పెట్డడంతోపాటు చక్కెర దిగుమతులపైనా ప్రభుత్వం సుంకాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న  50 శాతం సుంకాన్ని 100 శాతానికి హెచ్చించింది. ఫలితంగా ఇప్పటికే క్షీణ పథంలో సాగుతున్న చక్కెర ధరలను నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుత సీజన్‌లో పాకిస్తాన్ తదితర దేశాల నుంచి చౌక దిగుమతులు దేశీయ మార్కెట్‌ను ముంచెత్తకుండా ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ చర్యల వల్ల చక్కెర ధర స్థిరత్వాన్ని పొందుతుందని.. తద్వారా మిల్లర్లు రైతులకు బకాయిలను చెల్లించేందుకు ఆసక్తి చూపుతారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఒకవేళ మార్చి క్వార్టర్‌కల్లా చక్కెర నిల్వలు పెరిగితే మరోవైపు ఎగుమతి ప్రోత్సాహకాలను ప్రకటించడం వంటి చర్యలు చేపట్టే అవకాశమున్నట్లు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో షుగర్‌ రంగ షేర్లకు డిమాండ్‌ ఊపందుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.Most Popular