ఈ కష్టకాలం నుంచి గట్టెక్కేందుకు పంచమహా సూత్రాలు

ఈ కష్టకాలం నుంచి గట్టెక్కేందుకు పంచమహా సూత్రాలు

స్టాక్ మార్కెట్లను నష్టాలు ముంచెత్తుతున్నాయి. నష్టాల సునామీలో కొట్టుకుపోవడం మినహా ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న ఇన్వెస్టర్లు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్లకు ఇది నిజంగా శరాఘాతం లాంటిదే. పోర్ట్‌ఫోలియోల్లో సొమ్ములు కరిగిపోతున్న ఈ తరుణంలో ఏం చేయాలో, ఏం చేయొద్దో అర్థం కాక లోలోపల సతమతమవుతున్న తరుణమిది. అయితే అంత ఆందోళన ఏమీ అక్కర్లేదని, ఇవి సింపుల్‌గా ఫాలో కావడం వల్ల కాస్త కుదుటపడొచ్చని చెబ్తున్నారు వేల్యూ రీసెర్చ్ సీఈఓ ధీరేంద్ర కుమార్. ఆ 5 పంచసూత్రాలేంటో మీరూ తెలుసుకోండి. 

మొదటి సూత్రం -
మొదటి పెట్టుబడి ఎప్పుడూ మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌‌తో ప్రారంభించొద్దు. 
మొదటగా మార్కెట్లోకి, మ్యుచువల్ ఫండ్లలోకి అడుగుపెట్టేవాళ్లు ఎప్పుడూ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌(అవసరాన్నిబట్టి)లో పెట్టుబడులు ప్రారంభించాలి. సాధారణంగా ఈ మూడు తరహా ఫండ్స్‌... అన్ని రకాల ఇన్వెస్టర్ల అవసరాలన్నింటినీ తీరుస్తాయి. సిప్, లంప్సమ్, ఫిక్స్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్.. ఇలా వాళ్ల వాళ్ల అవసరాలు, అవకాశాన్ని బట్టి పై మూడు ఫండ్లను ఎంపిక చేసుకోవచ్చు. 

రెండో సూత్రం - 
దీర్ఘకాల ఆలోచనతో పెట్టుబడి పెట్టేవాళ్లకు ఇప్పటికీ ఈక్విటీ మార్గమే బెస్ట్. అయితే ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత మొత్తాన్ని డెట్, ఫిక్స్‌డ్ ఇన్‌కం ఫండ్లలో కొంత మొత్తం ఉండేలా పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోవాలి. బాండ్ ఈల్డ్స్‌తో సంబంధం లేకుండా మీ ఎమర్జెన్సీ ఫండ్‌ను ఫిక్స్‌డ్ ఇన్‌కం ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. దీంతో పాటు 35 శాతం మొత్తాన్ని బ్యాలెన్స్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ మరింత తగ్గుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

మూడో సూత్రం -
ప్రస్తుత బాండ్ ఈల్డ్స్‌ను పరిగణలోకి తీసుకుని ఆందోళన పడొద్దు. అధిక శాతం ఈక్విటీ ఫండ్స్ అన్నీ తమ ఫిక్సెడ్ ఇన్‌కం అలొకేషన్లను అధిక ఆదాయం ఇచ్చే బాండ్స్, కార్పొరేట్ బాండ్స్‌లో చేస్తాయి. ప్రస్తుతం బాండ్ ఈల్డ్స్‌లో అనిశ్చితి ఉన్నా ఇవన్నీ మళ్లీ సర్దుకుంటాయి.

నాలుగో సూత్రం -
ప్రస్తుతం అందరూ ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్, మోతిలాల్ ఒస్వాల్ ఫోకస్డ్ 25, మిరే అసెట్ ఆపర్చునిటీస్ ఫండ్, ఎస్బీఐ బ్లూచిప్ వంటి లార్జ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులను కొనసాగించవచ్చు. ఇక బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఆదిత్యబిర్లా సన్‌లైఫ్ బ్యాలెన్స్‌డ్ 95, హెచ్ డి ఎఫ్ సి బ్యాలెన్స్‌డ్, ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ బ్యాలెన్స్‌డ్, టాటా బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ మంచి పనితీరు కనబరుస్తున్నాయి. 

ఐదో సూత్రం - 
ఆఖరిది అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండడం. ఈ గండాన్ని కూడా మార్కెట్లు గట్టెక్కుతాయి. మీరు ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేకపోతే మార్కెట్ల నుంచి దూరంగా ఉండండి. లేకపోతే ఈక్విటీ మార్కెట్ల నుంచి పొందాలనుకున్న ప్రయోజనాలన్నింటికీ దూరమైపోతారు జాగ్రత్త. హ్యాపీ ఇన్వెస్టింగ్. Most Popular