ఈ స్టాక్స్‌లో పాతిక శాతం పతనం

ఈ స్టాక్స్‌లో పాతిక శాతం పతనం

గత ఏడాది కాలంగా ఆకాశమే హద్దుగా ఎగిసిన సూచీలు బడ్జెట్ దెబ్బతో ఒక్కసారిగా నేల చూపులు చూశాయి. బడ్జెట్ అనంతరం శుక్రవారం ట్రేడింగ్ లో బీఎస్ఈ 500 సూచీలో ప్రతీ ఐదు స్టాక్స్ లో ఒక స్టాక్ ఏడాది గరిష్ట స్థాయి నుంచి 25 శాతం చొప్పున నష్టపోయాయి. 

పీసీ జువెలరీ, వక్రాంజీ, జస్ట్ డయల్, వోకార్త్, యూనిటెక్, అబన్ ఆఫ్‌షోర్, రెయిన్ ఇండస్ట్రీస్, జిందాల్ సా, ప్రజ్ ఇండస్ట్రీస్, జై కార్ప్, బొంబే బర్మా ట్రేడింగ్, ఫిలిప్ కార్బన్ బ్లాక్, బొంబే డైయింగ్ లాంటి షేర్లు ఒక్క రోజు ట్రేడింగ్ లోనే 25 శాతం చొప్పున నష్టపోయాయి. అలాగే అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ ( అడాగ్) కు చెందిన రిలయన్స్ పవర్, రిలయన్స్ నేవల్, ఆర్ కాం లాంటి షేర్లు సైతం ఏడాది గరిష్ట స్థాయి నుంచి 25 శాతం చొప్పున షేర్ విలువను నష్టపోయాయి.

బీఎస్ఈ 500 సూచీ ఇప్పటికే 1.9 శాతం నష్టపోగా, అదే సమయంలో సెన్సెక్స్ 1.5 శాతం నష్టపోయింది. బడ్జెట్ 2018లో లాంగ్ టర్మ్ కేపిట్ గెయిన్స్ లక్ష రూ.లు దాటితే పదిశాతం పన్ను బాదుడు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో ఒక్కసారిగా మదుపరులు అమ్మకాలకు తెరతీసారు. శుక్రవారం ట్రేడింగ్ లో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2.6 శాతం, 3.4 శాతం చొప్పున నష్టపోయాయి.  లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ టాక్స్ ముఖ్యంగా విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులకు దెబ్బగానే చెప్పవచ్చు. అయితే ఈ ప్రభావం కేవలం స్టాక్ మార్కెట్లపై మాత్రమే కాదు, విదేశీ మారక ద్రవ్య నిల్వలపై కూడా చూపే అవకాశం ఉందని మనప్పురం ఫైనాన్స్ ఎండీ అండ్ సీఈవో వీపీ నందకుమార్ పేర్కొన్నారు.

ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా ప్రకారం లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ టాక్స్ కారణంగానే ఈక్విటీ షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ లో నిధులు ప్రవాహానికి ప్రతిబంధకంగా మారనుందని అంచనా వేసింది. 

ఇక స్పెసిఫిక్ స్టాక్స్ అయిన పీసీ జువెలరీ శుక్రవారం ఇంట్రాడేలో 60 శాతం నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి డే కనిష్ట స్థాయి నుంచి రికవరీ అయి 24 శాతం నష్టంతో క్లోజయ్యింది. ఇంట్రాడేలో 100 శాతం మేర షేర్ బౌన్స్ బ్యాక్ అవ్వడం అనూహ్య పరిణామమనే చెప్పవచ్చు. మరోవైపు కంపెనీ ఫండమెంటల్స్ పరంగా బలంగా ఉన్నప్పటికీ షేర్ పతనానికి కారణం తెలియట్లేదని, కంపెనీ ఫండమెంటల్స్ పరంగా స్థిరంగా ఉందని పీసీ జువెలరీ ఒక వివరణ ఇవ్వడంతో నష్టనివారణ కొంతమేర జరిగిందని చెప్పవచ్చు. 



Most Popular