పిసి జ్యువెలర్స్ స్టాక్ పతనానికి ఇదే కారణం

పిసి జ్యువెలర్స్ స్టాక్ పతనానికి ఇదే కారణం

పీసీ జ్యువెలర్స్‌లో వక్రంజీ వాటా కొనుగోలు చేసిందన్న వార్తలు ఈ రెండు కౌంటర్లలోనూ భారీ అమ్మకాలకు కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం పీసీ జ్యువెలర్స్‌కు చెందిన 20 లక్షల షేర్లను జనవరి 25న వక్రంగీ రూ. 561.71 సగటు ధరలో కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 112.32 కోట్లను వెచ్చించింది.ఇప్పటికే వక్రంజీ కౌంటర్లో అక్రమ లావాదేవీలు జరిగిన అభియోగాలతో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తును చేపట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో తాజాగా పీసీ జ్యువెలర్స్‌ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టారు. 
షేర్లపై అమ్మకాల పిడుగు  
వరుసగా ఐదో రోజు టెక్నాలజీ సేవల సంస్థ వక్రంజీ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు మరోసారి 10 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 29 పతనమై రూ. 263 దిగువన ఫ్రీజయ్యింది. బుధవారం సైతం ఈ షేరు భారీ ట్రేడింగ్‌ పరిమాణంతో 20 శాతం పడిపోయి రూ. 365 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి గత ఐదు రోజుల్లోనూ 73 శాతం కుప్పకూలింది. ఈ నెల 25న ఈ షేరు రూ. 505 వద్ద ట్రేడయ్యింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 1.72 కోట్ల సెల్‌ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి.
పీసీ నేలచూపు
మరోవైపు తాజాగా పీసీ జ్యువెలర్స్‌ కౌంటర్లో అనూహ్యంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఒక దశలో పీసీ జ్యువెలర్స్‌ కౌంటర్‌ ఎన్‌ఎస్ఈలో 60 శాతానికిపైగా పడిపోవడం గమనించదగ్గ అంశం. క్రితం ముగింపు రూ. 484తో పోలిస్తే రూ. 218 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం కాస్త కోలుకుని 31 శాతం(రూ. 152) పతనంతో రూ. 332 వద్ద ట్రేడవుతోంది. 
ఏంజరిగిందంటే?
ఇటీవల కొంతకాలంగా వక్రంజీ లిమిటెడ్‌ షేరు భారీ ర్యాలీ చేస్తూ వచ్చింది. 2015లో రూ. 65 వద్ద ఉన్న ఈ షేరు ఈ ఏడాది జనవరికల్లా రూ. 500ను అధిగమించింది. కాగా.. 2016 జనవరి 1 మొదలు జూన్‌ 30వరకూ, తిరిగి 2016 సెప్టెంబర్‌ మొదలు 2017 జూన్‌ 15 వరకూ వక్రంజీ కౌంటర్లో అవకతవకలతోకూడిన ట్రేడింగ్‌ జరిగినట్లు సెబీ దృష్టికి వచ్చినట్లు ముంబై మీడియా పేర్కొంది. మరోపక్క పీసీ జ్యువెలర్స్‌ ప్రమోటర్లు వక్రంజీతో తమకు బిజినెస్‌ లావాదేవీలు లేవంటూ తాజాగా వివరణ ఇవ్వడం విశేషం.Most Popular