ఇల్లు కొనేవారికి ఈ బడ్జెట్‌లో ఏం కావాలంటే?

ఇల్లు కొనేవారికి ఈ బడ్జెట్‌లో ఏం కావాలంటే?

"ప్రతీ ఒక్కరికీ ఇల్లు" అనేది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నినాదం.. విధానం. గతేడాది బడ్జెట్‌లోనే ఇందుకు తగిన ప్రణాళికలకు బీజం బడింది. రియల్ ఎస్టేట్ రంగానికి ఉత్సాహం ఇచ్చేలా చర్యలను చేపట్టిన కేంద్రం 2022 నాటి లక్ష్యాలను కూడా అనౌన్స్ చేసింది. 
మే 1, 2017 నుంచి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్ 2016ను అమలులోకి తెచ్చింది కేంద్రం. అందరికీ ఇల్లు ప్రణాళికకు ఇది మరో మెట్టుగా భావించవచ్చు. అందుబాటు ధరలలో ఇల్లు అందించేందుకు గాను, ఫిబ్రవరి 1న ప్రకటించబోయే ఈ కింది పన్ను సంస్కరణలు ఉండవచ్చని భావిస్తున్నారు. 

 

1. హౌసింగ్ నష్టం రూ. 2 లక్షల నుంచి పెంపు
ఇతర ఆదాయంలో చూపే హౌసింగ్ లాస్‌ను ఫైనాన్స్ యాక్ట్ 2017 ప్రకారం రూ. 2 లక్షలకు పరిమితం చేశారు. అయితే రూ. 2 లక్షలకు మించిన నష్టాన్ని రాబోయే సంవత్సరాలకు అద్దె ఆదాయం రూపంలో క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. 
అద్దె ద్వారా వచ్చిన ఆదాయం కంటే.. గృహ రుణంపై చెల్లించిన వడ్డీ రూ. 3 లక్షలు అదనంగా ఉందని భావిద్దాం. అపుడు రూ. 2 లక్షలను ఆ ఏడాది నష్టంగా చూపి, మిగిలిన రూ. 1 లక్షను మరుసటి 8 సంవత్సరాలలో ఏదో ఒక దానికి క్యారీ ఫార్వార్డ్ చేయచ్చు. 
అయితే హౌసింగ్ లోన్ అంటే 15-25 సంవత్సరాలకు ఉంటుంది. మరుసటి 8 ఏళ్లలో చెల్లించిన వడ్డీకి సరిపడేంతగా అద్దెను భర్తీ చేయడం సాధ్యపడకపోవచ్చు. అలాంటి సమయంలో 8 ఏళ్ల తర్వాత నష్టం లాప్స్ అయిపోతుంది. 
అందుకే ప్రస్తుత ప్రాపర్టీ ధరలు, వడ్డీ రేట్ల ప్రకారం ఈ నష్ట పరిమితిని రూ. 2 లక్షల నుంచి కనీసం రూ. 3 లక్షలకు అయినా పెంచాలనే డిమాండ్స్ ఉన్నాయి. 

 

2. ప్రీ-కన్‌స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ రూపంలో అదనపు మినహాయింపు
నిర్మాణంలో ఉన్న ఇంటిపై చెల్లించిన హౌసింగ్ లోన్ వడ్డీని.. ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత 5 సమాన వాయిదాల రూపంలో రాయితీ క్లెయిమ్ చేసుకోవచ్చని ఆదాయపు పన్ను చట్టం చెబుతోంది. ఇది వినేందుకు చక్కగానే అనిపిస్తుంది. అయితే అనేక మంది పన్ను చెల్లింపుదారులు ఈ మినహాయింపుతో లబ్ధి పొందలేకపోతున్నారు. ఇందుకు కారణం హౌసింగ్ లోన్ డిడక్షన్ రూ. 2 లక్షలలోనే ఈ ప్రీ కన్‌స్ట్రక్షన్ పరిమితిని కూడా కేటాయించారు. 
ఉదాహరణకు ఓ నిర్మాణం పూర్తికాని గృహ రుణంపై రూ. 5 లక్షల వడ్డీ చెల్లించారని అనుకుందాం. అపుడు అంటి నిర్మాణం పూర్తయిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఏడాదికి 5 లక్షల చొప్పున క్లెయిం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సందర్భాలలో వడ్డీ చెల్లింపులు ఏటా రూ. 2 లక్షలకు మించి ఉంటాయి. అపుడు ప్రీ-కన్‌స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ రాయితీని పొందే అవకాశం ఉండదు. అందుకే దీనికి ప్రత్యేక మినహాయింపు ఉండాలని కోరుతున్నారు.

 

3. నిర్మాణంలో ఆలస్యం అయే సందర్భాలు
ఒక ఇంటి నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి 5వ ఏడాది.. ఆర్థిక సంవత్సరం ముగింపు లోపు పూర్తి అయిన సందర్భాలలో మాత్రమే.. గృహ రుణ వడ్డీపై మినహాయింపు రూ. 30 వేల నుంచి రూ. 2 లక్షలకు పెరుగుతుంది. 
అయితే సెక్షన్ 54, 54ఎఫ్ ప్రకారం ఒక గృహ నిర్మాణం 5 ఏళ్లలోపు పూర్తయితే మాత్రమే లాంగ్-టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను చెల్లింపుదారులకు మినహాయింపు లభిస్తుంది. అంటే ప్రాపర్టీ నిర్మాణంలో ఆలస్యం కావడంలో కొనుగోలుదారుని ప్రమేయం ఏమీ లేకపోయినా.. వారు పన్ను మినహాయింపు ద్వారా పొందాల్సిన లబ్ధిని కోల్పోతారు. 
ప్రస్తుతం రెరా చట్టం ద్వారా హౌసింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినా, నిర్మాణాలు ఆలస్యం అయే సందర్భాలలో కొనుగోలుదారులు పొందాల్సిన ప్రయోజనాలను కాపాడాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 

 

4. తొలిసారి ఇల్లు కొనేవారికి ప్రోత్సాహకాలు
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80ఈఈ ప్రకారం తొలిసారి ఇల్లు కొనే వ్యక్తులకు రూ. 50,000 వరకు అదనపు రాయితీని క్లెయిం చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు అర్హత పొందాలంటే 2016 ఏప్రిల్ 1.. 2017 మార్చ్ 31 మధ్య ఇంటి రుణం శాక్షన్ అయి ఉండాలి. గతేడాది మార్చ్ 31 తర్వాత రుణాలు పొందిన వారికి కూడా ఈ ప్రయోజనాలను పొడిగించాల్సిన అవసరం ఉంది. 
ఈ రాయితీని పొందేందుకు ఇంటి సైజు, ప్రాంతంతో సంబంధం లేకుండా.. ఆ ఆస్తి విలువ రూ. 50 లక్షలకు మించరాదనే నిబంధన ఉంది. టైర్1 నగరాలలో అధిక రేట్ల కారణంగా, అక్కడ నివాసం ఉండే వ్యక్తులు ఈ నిబంధన కారణంగా.. ప్రయోజనం పొందలేకపోతున్నారు.
ఆయా ప్రాంతాలు, పరిమాణాల ఆధారంగా శ్లాబులను నిర్ణయించి, మినహాయింపులు అందించాలనే కోరికలు వినిపిస్తున్నాయి. 

 

అనేక మంది పన్ను చెల్లింపుదారులకు ఇంకా సొంత ఇల్లు అనే అంశం కలగానే ఉంది. వారి ఊహలను వాస్తవాలుగా మార్చాలన్నా.. హౌసింగ్ ఫర్ ఆల్ ప్రణాళిక సాకారం కావాలన్నా.. పై చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తులు విరివిగా అందుతున్నాయి.
 Most Popular