కొత్త పెట్టుబడులు లేకుండా పన్ను ఆదా చేయడం ఎలా?

కొత్త పెట్టుబడులు లేకుండా పన్ను ఆదా చేయడం ఎలా?

ఆదాయపు పన్నును ఆదా చేయడం అంటే పెద్ద ప్రహసనం అని అంతా భావిస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం చివరలో, చేతిలో సరిగ్గా డబ్బులు ఆడని సమయంలో, నిధుల కొరత ఎదుర్కొంటున్న సమయంలో.. ఇన్‌కం ట్యాక్స్ ‌నుంచి తప్పించుకునేందుకు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాల్సి రావడం తలకు మించిన భారంగా కనిపిస్తుంది. 
పన్ను మినహాయింపు ప్రయోజనం కల్పించే పెట్టుబడులు చేయడం ఈ తరహా సమస్యల నుంచి కొంత ఉపశమనం కలిగిస్తుంది. అయితే, మీరు ఇప్పటికే ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉన్నట్లయితే, కొత్త పెట్టుబడులు లేకుండా, గతంలో చేసిన పెట్టుబడల ద్వారానే పన్ను ఆదా చేసుకునేందుకు 3 మార్గాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది.

 

పీపీఎఫ్ నుంచి ఉపసంహరించి మళ్లీ పెట్టుబడి చేయండి
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏటా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులపై.. ఇన్‌కం ట్యాక్స్ సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుందనే విషయం తెలిసిందే. ఒకవేళ మీరు ఇప్పటికే పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అయితే, ఈ నిధుల కొరతను ఎదుర్కునేందుకు ఒక అవకాశం ఉంటుంది. ప్రారంభించిన 7వ సంవత్సరం నుంచి పీపీఎఫ్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. నాలుగవ సంవత్సరం ముగిసినప్పటి నుంచి మొత్తం ఫండ్ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

అప్పటివరకూ క్రమం తప్పకుండా మీరు పీపీఎఫ్ పెట్టుబడులు చేస్తున్నట్లు అయితే, ఇందులోంచి నగదు ఉపసంహరణకు ఓ అవకాశం ఉంటుంది. మీరు తిరిగి ఇదే మొత్తాన్ని పీపీఎఫ్‌లో కానీ, మరే ఇతర మీకు నచ్చిన పెట్టుబడి సాధనంలో కానీ ఇన్వెస్ట్ చేసి.. సెక్షన్ 80సీ ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.


మ్యూచువల్ ఫండ్స్‌ను ఉపసంహరణ మరియు తిరిగి పెట్టుబడి 
ప్రస్తుతం టాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్(ఈఎల్ఎస్ఎస్)లో పెట్టుబడులు చేయడం సహజం అయిపోయింది. సెక్షన్ 80సీ పరిమితిలోనే ఈ పెట్టుబడులు కూడా ఉంటాయి. వీటికి మూడేళ్లపాటు లాక్ఇన్ పీరియడ్ ఉంటుంది. మీ దగ్గర 3 ఏళ్లకు మించిన కాలవ్యవధి నుంచి హోల్డ్ చేస్తున్న ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్లయితే, వాటిని విక్రయించి తిరిగి మరో పన్ను ఆదా చేసే స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి. వీటిని తాజా పెట్టుబడులుగా పరిగణించడంతో, పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులకు మరో మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందని గుర్తుంచుకోండి.

ఒకవేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్లయితే, వాటిని ఏడాది తిరిగిన వెంటనే విక్రయించేసినా ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు. వీటిని మరోసారి ఇన్వెస్ట్ చేసి పన్ను ఆదా పొందవచ్చు. 
ఇలా చేసినా సరే మీ అస్సెట్ కేటాయింపులు ఏమాత్రం మారవు.

 

ఫిక్సెడ్ డిపాజిట్ ఉందా? ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీగా మార్చేయండి
బ్యాంకులలో ఫిక్సెడ్ డిపాజిట్లు చేయడం ఎక్కువగానే జరుగుతుంది. వీటిని మధ్యలో బ్రేక్ చేసి ఉపసంహరిచుకోవచ్చు. అయితే ఫిక్సెడ్ డిపాజిట్ చేసినపుడు నిర్ణయించిన వ్యవధి కంటే ముందే ఉపసంహరించినట్లు అయితే.. కొంత వడ్డీ రేటును కోల్పోవచ్చు. అయినా సరే కొంత ప్రయోజనం తప్పుకుండా దక్కుతుంది. ఇప్పుడీ నిధులను బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్సెడ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టండి. ఈ డిపాజిట్లకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉటుంది. అలాగే సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపులు లభిస్తాయి.

ఈ విధంగా చేయడం ద్వారా అనవసరపు రిస్క్‌లు కూడా ఉండవు. అలాగే మీ అసెట్ అలాకేషన్‌లో కూడా మార్పులు రావు, పైగా పన్ను ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది.

 

ఇలాంటి ట్రిక్కులు తెలుసుకునేందుకు బాగానే ఉంటాయి. కానీ వీటిని ఆఖరి నిమిషంలో.. మరే ఇతర ఆప్షన్ లేకపోతే మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులను రోలోవర్ చేయడం ద్వారా.. పెట్టుబడులపై ప్రయోజనాలు కొంతమేర క్షీణించే అవకాశం ఉంటుంది. నిజానికి పెట్టుబడులు చేయడంలో పన్ను ఆదా చేయడం ఒకటే పరమావధి కాకూడదు. మీ వయసు, కెరీర్ పెరుగుతున్న కొద్దీ.. పెట్టుబడులు కూడా పెంచుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏ సమయంలో అయినా నగదుకు కొరత ఏర్పడినట్లయితే, అపుడు తగిన చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని గుర్తించాలి. 
 Most Popular