ఆలస్యంగా పదవీ విరమణ చేస్తే ప్రయోజనాలు చాలానే!

ఆలస్యంగా పదవీ విరమణ చేస్తే ప్రయోజనాలు చాలానే!

మన దేశంలో పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలు. కొన్ని డిపార్ట్‌మెంట్స్‌లో అయితే 60 ఏళ్లు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల లెక్క అయితే.. సుమారుగా ప్రైవేటు ఉద్యోగాల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగం చేసే ఓపిక కొందరిలో ఉన్నా.. విధుల్లో కొనసాగించేందుకు సంస్థలు అంతగా సిద్ధపడడం లేదు. అంటే పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలుగా ఫిక్స్ చేసేసుకోవచ్చు.


45 సంవత్సరాల వయసు దాటిన దగ్గరి నుంచి రిటైర్మెంట్‌పై బెంగ మొదలయిపోవడంలో ఆశ్చర్యం లేదు. పదవీ విరమణ తరువాత జీవితం గురించి.. అంతకు ఓ 10-15 ఏళ్ల ముందు ఆలోచన మొదలుకావడం సహజమే. ప్రస్తుతం ఏటా ఓ వ్యక్తి రూ. 6 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నాడని భావిద్దాం. తన పదవీ విరమణ లక్ష్యాన్ని అందుకునేందుకు వెంటనే తన పొదుపు మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటే.. టార్గెట్ అందుకోవడం సాధ్యమయ్యే స్థితిలో ఉన్నాడని అనుకుందాం. అయితే.. చాలామందికి ఇలా పొదుపు మొత్తం పెంచడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సమయంలో తను పదవీ విరమణ చేయదలచుకున్న వయసును మరో రెండున్నరేళ్లు పొడిగించుకుంటే.. ఇప్పుడు పెట్టుబడి చేసే మొత్తాన్నే కొనసాగించినా లక్ష్యం చేరువవుతుంది. 

 

వివిధ రకాల ఆదాయాలు, నివాస పరిస్థితులు, రాబడి వ్యత్యాసాలు ఉన్నా.. ఇలా పదవీ విరమణను కొంత ఆలస్యం చేసుకోవడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న మొత్తాలను పొదుపు చేస్తూ వచ్చిన వారు.. చివరలో తమ పదవీ విరమణ వయసును పొడిగించుకోవడం ద్వారా.. పెద్ద మొత్తానికి కొన్నేళ్ల పాటు వడ్డీ పొందే సౌలభ్యం ఉంటుంది.

 

ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాలను పొందుతున్న వారిని గమనిస్తే.. మన దేశంలో పీఎఫ్ అత్యుత్తుమ లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఒకటి అనే సంగతి తెలిసిందే. ఓ వ్యక్తికి పదవీ విరమణ సమయంలో రూ. 10 లక్షలు పీఎఫ్ ప్రయోజనంగా అందుతుందని భావిస్తే.. ఆ వ్యక్తి మరో ఐదేళ్ల పాటు తన రిటైర్మెంట్‌ను పొడిగించగలిగితే.. ఈ మొత్తం 50 శాతానికి పెరిగిపోతుంది. రూ. 16 లక్షల వరకు ప్రయోజనం దక్కుతుంది. 

 

మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు.. బీమాల్లో పెట్టుబడులు చేస్తున్న వారికి.. సిప్ రూపంలో పెట్టుబడులు చేసిన వారికి కూడా ఇలాంటి ప్రయోజనాలే లభిస్తాయి. ఫండ్స్, మార్కెట్ ఆధారిత పెట్టుబడులు చేసిన వారికి.. ఐదేళ్ల అదనపు సమయం అంటే అది సుదీర్ఘమైనదే. ఈ కాలంలో వారి ఇన్వెస్ట్‌మెంట్, డబుల్ అయినా ఆశ్చర్యమేమీ లేదు.

 

వీటితో పాటు వారి సర్వీసు, సుదీర్ఘ అనుభవం ఆధారంగా ఆయా వ్యక్తులు పొందే జీతం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే పదవీ విరమణను ఎంత వాయిదా వేయగలిగితే.. అంత గరిష్టంగా ప్రయోజనాలు సిద్ధిస్తాయని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. 
 Most Popular