న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ ఐపీవోకు అప్లై చేయవచ్చా?

న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ ఐపీవోకు అప్లై చేయవచ్చా?

ఢిల్లీ కేంద్రంగా ఐటీ సేవలందించే న్యూజెన్ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 16న ప్రారంభంకానున్న ఐపీవో 18న ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 240-245కాగా.. తద్వారా న్యూజెన్‌ రూ. 424 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా 1.34 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచడంతోపాటు రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. 

ఇతర వివరాలు
న్యూజెన్‌ ఐపీవోకు లాట్‌ పరిమాణం 61 షేర్లుకావడంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 61 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే.. రూ. 2 లక్షల విలువకు మించకుండా ఇవే గుణిజాల్లో ఒకేసారి అప్లై చేయాల్సి ఉంటుంది. షేర్లు బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలలో లిస్ట్‌కానున్నాయి. ఐపీవో నిధులను సాధారణ పాలనా వ్యవహారాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 

కంపెనీ సంగతేంటంటే?
ప్రధానంగా దేశీయంగానే దృష్టిపెట్టిన న్యూజెన్‌.. సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్టులతోపాటు సపోర్ట్‌ తదితర సర్వీసులనూ అందిస్తోంది. క్లయింట్లకు ఎంటర్‌ప్రైజ్‌ కంటెంట్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌, కస్టమర్‌ కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌ తదితర సర్వీసులు సమకూరుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్టుల విక్రయం ద్వారా 27 శాతం ఆదాయం ఆర్జిస్తోంది. సపోర్ట్‌ సేవల నుంచి 40 శాతం, ఇతర సర్వీసుల ద్వారా 33 శాతం ఆదాయం సమకూరుతోంది. 450 వరకూ కస్టమర్లను కలిగి ఉంది. 

ఆర్థిక పనితీరు
మార్చితో ముగిసిన గతేడాది(2016-17)లో 23 శాతం అధికంగా రూ. 390 కోట్ల ఆదాయం సాధించింది. నికర లాభం 92 శాతం జంప్‌చేసి రూ. 64 కోట్లను తాకింది. రూ. 10 ఈపీఎస్‌ నమోదైంది.  ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18)లో తొలి ఆరు నెలల్లో ఆదాయం రూ. 186 కోట్లకు చేరగా.. రూ. 7 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈపీఎస్‌ రూ. 1గా మాత్రమే నమోదైంది. 

నిపుణులు ఏమంటున్నారంటే
2013-17 మధ్య ఆదాయం 20 శాతం, నికర లాభం 9 శాతం చొప్పున వార్షిక వృద్ధిని సాధించినప్పటికీ ఇటీవల లాభాలు తగ్గుతూ వచ్చాయి. 2013లో 18 శాతంగా నమోదైన మార్జిన్లు సైతం 12 శాతానికి బలహీనపడ్డాయి. 2017 ఈపీఎస్‌తో పోల్చిన ఇష్యూ ధర 24 రెట్లు(పీఈ) అధికం. పరిశ్రమ సగటు 19 పీఈగా ఉంది. దీంతో ఇష్యూకి ఆశిస్తున్న ధర అధికంగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 Most Popular