మధ్యలో షాక్‌- చివరికి సరికొత్త రికార్డ్స్‌! 

మధ్యలో షాక్‌- చివరికి సరికొత్త రికార్డ్స్‌! 

సుప్రీం కోర్టు సీనియర్‌ జస్టిస్‌లు నలుగురు కోర్టు నిర్వహణపట్ల బాహాటంగా అసంతృప్తిని వ్యక్తం చేయడంతో మిడ్ సెషన్‌లో దెబ్బతిన్న మార్కెట్లు చివరికి కోలుకున్నాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 89 పాయింట్లు పెరిగి 34,592కు చేరగా.. నిఫ్టీ 30 పాయింట్లు బలపడి 10,681 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్ల సానుకూలతల కారణంగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే జోరందుకున్న మార్కెట్లు మధ్యలో నష్టాలలోకి ప్రవేశించినప్పటికీ చివరికి చరిత్రాత్మక గరిష్టాలను అందుకోవడం విశేషం!
రియల్టీ పతనం
గత ఆరు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న రియల్టీ రంగం ఎన్‌ఎస్ఈలో లాభాల స్వీకరణ కారణంగా 1.5 శాతం పతనంకాగా.. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 0.35 శాతం చొప్పున నీరసించాయి. మీడియా 1.7 శాతం జంప్‌చేయగా.. మెటల్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.5 శాతం చొప్పున ఎగశాయి. 
నిఫ్టీ దిగ్గజాలలో
బ్లూచిప్స్‌లో జీ, ఐసీఐసీఐ, వేదాంతా, మారుతీ, హెచ్పీసీఎల్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ 3-1 శాతం మధ్య పెరిగాయి. మరోపక్క లుపిన్‌, యూపిఎల్‌, భారతీ, అంబుజా, అరబిందో, బాష్‌, ఐటీసీ, సన్‌ ఫార్మా తదితరాలు 1 శాతంస్థాయిలో డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో ట్రేడైన మొత్తం షేర్లలో 1563 లాభపడితే.. 1352 నష్టపోయాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు..
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 624 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 770 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. గత రెండు రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 875 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌  రూ. 1,123 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 693 కోట్లు ఇన్వెస్ట్‌చేస్తే, దేశీ ఫండ్స్‌ రూ. 206 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.  Most Popular