70 డాలర్లకు బ్రెంట్‌ చమురు!

70 డాలర్లకు బ్రెంట్‌ చమురు!

ఇటీవల ప్రపంచ మార్కెట్లలో మరుగుతున్న ముడిచమురు ధరలు మరోసారి మంట పుట్టించాయి. గురువారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ ఇంట్రాడేలో 1.5 శాతం జంప్‌చేసి 70.05 డాలర్లను తాకింది. చివరికి 69.26 డాలర్ల వద్ద నిలిచింది. వెరసి 2014 డిసెంబర్‌ 4 తరువాత మళ్లీ 70 డాలర్లను చేరింది. ఇంతక్రితం 2014 డిసెంబర్‌ 4న మాత్రమే బ్రెంట్‌ చమురు బ్యారల్‌ ధర 70.60 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. మరోవైపు న్యూయార్క్‌ మార్కెట్లో లైట్‌ స్వీట్‌ క్రూడ్‌గా పిలిచే నైమెక్స్ చమురు బ్యారల్‌ సైతం మూడేళ్ల తరువాత తొలిసారి 64 డాలర్లను తాకింది. ఇంతక్రితం 2014 డిసెంబర్‌ 8న మాత్రమే నైమెక్స్‌ బ్యారల్‌ 64.77 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. 

కారణాలున్నాయ్‌...
గత కొన్నేళ్లుగా పతనబాటలో సాగుతున్న ధరలకు నిలకడ తీసుకువచ్చే బాటలో ఒపెక్‌ దేశాలు 2017 జనవరి నుంచీ చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. దీనికి రష్యా వంటి నాన్‌ఒపెక్‌ దేశాలు సైతం మద్దతు పలకడంతో ఇటీవల కొంతకాలంగా చమురు ధరలు బలపడుతూ వస్తున్నాయి. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 40 శాతం వాటా ఒపెక్‌దేకాగా.. రష్యా వంటి దేశాలకూ ప్రాధాన్యత ఉంది. కాగా.. గత వారం ఇరాన్‌లో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి చమురుధరల మంటకు ఆజ్యంపోసింది. ఒపెక్‌ దేశాలలో ప్రాధాన్యమున్న ఇరాన్‌ రోజుకి 38 లక్షల బ్యారళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. దీనికితోడు ఇటీవల లిబియాలో పైప్‌లైన్‌ పేలడంతో ధరలకు రెక్కలొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

చైనా ఎఫెక్ట్‌
2008 ఆర్థిక మాంద్యం తరువాత అమెరికాసహా జపాన్‌, యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు పురోగమిస్తున్న సంకేతాలు ముడిచమురుకు డిమాండ్‌ను పెంచగలవన్న అంచనాలు ఇటీవల పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే చైనా 2017లో రోజుకి 8.5 మిలియన్ల బ్యారళ్లను కొనుగోలు చేసింది. ఇక 2018లో కొత్త రిఫైనింగ్‌ సామర్థ్యాలు అందుబాటులోకి రానుండటంతో మరింత అధికంగా చమురును దిగుమతి చేసుకునే అవకాశమున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి పలు అంశాలు చమురు ధరలను మండిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు వివరిస్తున్నాయి.Most Popular