చమురు ధరలు మూడేళ్ల గరిష్టాలను దాటేశాయ్‌!

చమురు ధరలు మూడేళ్ల గరిష్టాలను దాటేశాయ్‌!

ప్రపంచ మార్కెట్లలో ముడిచమురు ధరలు మరోసారి మంట పుట్టించాయి. లైట్‌ స్వీట్‌ క్రూడ్‌గా పిలిచే నైమెక్స్ చమురు బ్యారల్‌ 2014 డిసెంబర్‌ తరువాత మళ్లీ 63 డాలర్లను అధిగమించగా.. సోర్‌ క్రూడ్‌ బ్రెంట్‌ 69 డాలర్లను దాటేసింది. నిజానికి మంగళవారం ఇంట్రాడేలో బ్రెంట్‌ 69.30 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ 0.9 శాతం ఎగసి 63.51 డాలర్లకు చేరగా.. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ 0.54 శాతం పెరిగి 69.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం 2014 డిసెంబర్‌లో మాత్రమే చమురు ధరలు ఈ స్థాయిలో ట్రేడయ్యాయి. 2017 ద్వితీయార్థం నుంచీ ఊపందుకున్న ఆయిల్‌ ధరలు గత ఆరు నెలల్లో 40 శాతం పెరిగాయి. 

చమురు బిల్లు తడిసిమోపెడు
విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు మండితే దేశీయంగా ఇబ్బందికర పరిణామాలు తలెత్తే అవకాశముంది. దేశీ అవసరాలలో 75 శాతం చమురు కోసం దిగుమతులపై ఆధారపడే సంగతి తెలిసిందే. దీంతో దిగుమతుల బిల్లు పెరిగి ప్రభుత్వంపై భారం పడుతుంది. డాలర్లలో చెల్లింపులు చేపట్టాల్సి ఉండటంతో ఇది రూపాయినీ బలహీనపరుస్తుంది. పెట్రోల్‌, డీజీల్‌ ధరలు పెరగడం వల్ల దేశీయంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికీ దారితీస్తుంది. పెట్రో ఉత్పత్తులపై పన్ను ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడం సానుకూల అంశంకాగా.. ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాకు లబ్ది చేకూరగలదు.

చమురు షేర్ల ర్యాలీ
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మండుతుండటంతో ఆయిల్‌ అన్వేషణ సంబంధిత కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం బీఎస్ఈలో అబాన్‌ ఆఫ్‌షోర్‌ 14.5 శాతం దూసుకెళ్లి రూ. 251కు చేరింది. ఈ బాటలో జిందాల్‌ డ్రిల్లింగ్‌ 6 శాతం జంప్‌చేసి రూ. 227ను తాకింది. తొలుత రూ. 231 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఇక హిందుస్తాన్‌ ఆయిల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ 5 శాతం పెరిగి రూ. 146 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 148 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. 
ఇదే విధంగా ఆయిల్‌ ఇండియా 2 శాతం బలపడి రూ. 384 వద్ద, ఓఎన్‌జీసీ 0.25 శాతం పుంజుకుని రూ. 198 వద్ద ట్రేడవుతున్నాయి. తొలుత ఆయిల్‌ ఇండియా రూ. 388 వద్ద, ఓఎన్‌జీసీ రూ. 200 వద్ద ఇంట్రాడే గరిష్టాలకు చేరడం గమనించదగ్గ అంశం! మరోపక్క ప్రభుత్వ రంగ  ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు ఐవొసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ మార్జిన్లు క్షీణించే అవకాశముంది. ఇటీవల ఈ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం విదితమే.

కారణాలున్నాయ్‌...
గత కొన్నేళ్లుగా పతనబాటలో సాగుతున్న ధరలకు నిలకడ తీసుకువచ్చే బాటలో ఒపెక్‌ దేశాలు 2017 జనవరి నుంచీ చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. దీనికి రష్యా వంటి నాన్‌ఒపెక్‌ దేశాలు సైతం మద్దతు పలకడంతో ఇటీవల కొంతకాలంగా చమురు ధరలు బలపడుతూ వస్తున్నాయి. గత వారం ఇరాన్‌లో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి చమురుధరల మంటకు ఆజ్యంపోసింది. ఒపెక్‌ దేశాలలో ప్రాధాన్యమున్న ఇరాన్‌ రోజుకి 38 లక్షల బ్యారళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. దీనికితోడు ఇటీవల లిబియాలో పైప్‌లైన్‌ పేలడంతో ధరలకు రెక్కలొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు 2008 ఆర్థిక మాంద్యం తరువాత అమెరికాసహా జపాన్‌, యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు పురోగమిస్తున్న సంకేతాలు ముడిచమురుకు డిమాండ్‌ను పెంచగలవన్న అంచనాలు ఇటీవల పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

చైనా ఎఫెక్ట్‌
ప్రపంచంలోనే అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే చైనా 2017లో రోజుకి 8.5 మిలియన్ల బ్యారళ్లను కొనుగోలు చేసింది. ఇక 2018లో కొత్త రిఫైనింగ్‌ సామర్థ్యాలు అందుబాటులోకి రానుండటంతో మరింత అధికంగా చమురును దిగుమతి చేసుకునే అవకాశమున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి పలు అంశాలు చమురు ధరలను మండిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు వివరిస్తున్నాయి.Most Popular