లిక్కర్ బిజినెస్ కిక్కేంటో ఈమెకు బాగా తెలుసు

లిక్కర్ బిజినెస్ కిక్కేంటో ఈమెకు బాగా తెలుసు

ఆది నుంచి మన సమాజంలో పురుషపెత్తనం నడుస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో చాలా మార్పులు వస్తున్నాయి. మహిళలు ప్రతి పనిలోనూ ముందుకు దూసుకెళ్తూ పురుషాధిక్యతకు చెక్ పెడుతున్నారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యాపారం అనేది పురుషులకే మాత్రమే పరిమితం కాదని.. లిక్కర్‌ బిజినెస్‌లోనైనా సత్తా చూపే శక్తి తమకు ఉందని  చేతల్లో చేసిచూపించారు  'ఐ బ్రాండ్స్ బేవరేజెస్‌ లిమిటెడ్‌' సీఎండీ లిసా శ్రావ్‌. దశాబ్దక్రితం వరకు లిక్కర్‌ రంగంలో పురుషాధిక్యం ఉండగా.. ఎవరూ ఊహించని రీతిలో ఈ రంగంలోకి ఎంతో సహసంతో అడుగుపెట్టి విజయపథంలో పయనిస్తున్నారు లిసా.

ఇప్పటికీ మద్యం షాపుకు వెళ్ళాలంటే  మహిళలు భయపడుతుంటారు. అలాంటిది ఎనిమిదేళ్ళ క్రితం ఏకంగా మద్యం తయారీ కంపెనీనే నెలకొల్పింది లిసా శ్రావ్‌. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా మనదేశ ప్రజలకు మద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించారు. కంపెనీని ప్రారంభించే ముందు ఎగతాళిగా నవ్విన ఎంతో మంది... ప్రస్తుతం ఆమె సక్సెస్‌ను చూసి శభాష్‌ అని మెచ్చుకుంటున్నారు. బ్లెండ్‌, డిజైన్‌, చెల్లించే ధరకు అనుగుణంగా క్వాలిటీని అందిస్తూ లిక్కర్‌ రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ  అతి తక్కువ కాలంలోనే అగ్రస్థాయి కంపెనీగా 'ఐ బ్రాండ్స్ బేవరేజెస్‌ లిమిటెడ్‌'ను తీర్చిదిద్దారామె. 

కుటుంబ నేపథ్యం..
భారతీయ సంతతికి చెందిన లిసా శ్రావ్‌ పుట్టి పెరిగిందంతా ఇంగ్లాండ్‌లోనే. బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్‌ యూనివర్సిటీలో బీఎస్సీ పట్టాను పొందిన లిసా తొలుత మీడియా రంగంలోకి అడుగుపెట్టింది. యూకేలోని పెద్ద పెద్ద మీడియా సంస్థలైన వయాకామ్‌, వివేంది యూనివర్శల్‌, న్యూస్‌ కార్పొరేషన్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించింది. 2003లో పెళ్ళి చేసుకుని ఇంటి బాధ్యతలకు పరిమితమైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుందని ఆలోచించింది. అంతకు ముందే లిక్కర్‌ వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉండటంతో గ్రౌండ్‌ వర్క్‌ పూర్తి చేసింది లిసా శ్రావ్‌. తండ్రి కూడా ఇదే రంగంలో ఉండటం కూడా ఆవిడకు కలిసొచ్చింది.  అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా భారత్‌లో మద్యం ఉత్పత్తుల్లో పలు రకాలు అందుబాటులో లేవని గమనించిన లీసా... ఆ లోటును భర్తీ చేయాలన్న లక్ష్యంతో 2010 ఆగస్టులో 'ఐ బ్రాండ్స్ బేవరేజెస్‌ లిమిటెడ్‌'ను ప్రారంభించింది.

టర్నింగ్‌ పాయింట్‌..
లిక్కర్‌ రంగంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌ అయిన భారత్‌లో ప్రీమియం లిక్కర్‌కు డిమాండ్‌ చాలా తక్కువ. అయితే చైనా, రష్యాలకు దీటుగా ఈ రంగంలో వేగంగా వృద్ధి చెందుతూ భారత్‌ అగ్రస్థానికి చేరే అవకాశం ఉందని దశాబ్దం క్రితమే అంచనా వేసిన లీసా.. "గ్రాంటన్‌ విస్కీ" పేరుతో తొలి ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బ్రాండ్‌ హాట్‌కేకుల్లా అమ్ముడైంది. దీంతో ప్రస్తుతం ప్రీమియం విస్కీ బ్రాండ్‌, త్రీ రాయల్స్, డీలక్స్ విస్కీ, గ్రాంటన్‌ విస్కీ. గ్రాంటన్‌ ప్యాకేజ్‌ వంటి బ్రాండ్స్‌ను అందిస్తూ లిక్కర్‌ వ్యాపారంలో వేగంగా ఎదుగుతోంది.

విస్తరణ ప్రణాళికలు..
లిక్కర్‌ రంగంలో వ్యాపారమేనేది కత్తిమీద సాములాంటిది. మగవాళ్ళ పెత్తనం ఉన్న ఈ వ్యాపారంలో  తొలి రెండేళ్లు తీవ్ర ఇబ్బందులు పడినప్పటికీ ఆ తర్వాత బుల్లెట్‌ వేగంతో వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తోంది లీసా. తయారీ, విక్రయం, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, ప్రొడక్ట్ డిజైన్‌, ప్యాకేజింగ్‌ ఇలా ప్రతీ దానిపైనా కుణ్ణంగా అవగాహన కలిగి పోటీ మార్కెట్లో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం నార్త్‌ ఇండియాలోని  పంజాబ్‌, హర్యానా, చండీఘడ్‌, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో.. అలాగే దక్షిణ భారత్‌లోని గోవా, పాండిచ్చేరి రాష్ట్రాలకు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది 'ఐ బ్రాండ్స్ బేవరేజెస్‌ లిమిటెడ్‌'. పారా మిలిటరీ ఆర్డర్లను కూడా ఇప్పటికే దక్కించుకున్న ఈ సంస్థ త్వరలో ఢిల్లీ, రాజస్థాన్‌, త్రిపుర, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, పశ్చిమబెంగాల్‌, అండమాన్‌ నికోబార్‌లకు విస్తరించే లక్ష్యంతో ఉంది.

వ్యాపార లక్ష్యం..
వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్ల మార్కెట్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ సీఎండీ లీసా చెబుతున్నారు. దేశంలోని 5 అత్యుత్తమ లిక్కర్‌ కంపెనీలలో ఐ బ్రాండ్స్‌కు స్థానం దక్కేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే రెండేళ్ళలో టర్నోవర్‌ను రెట్టింపు చేసి  దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని, తాను ఈ స్థాయిని రావడానికి తన తండ్రి, భర్త ఎంతో సహకరించారని ఆమె చెప్పారు.

అవార్డులు..
లిక్కర్‌ రంగంలో వేగంగా ఎదుగుతోన్న 'ఐ బ్రాండ్స్ బేవరేజెస్‌ లిమిటెడ్‌'కు ఎన్నో ప్రెస్టీజియస్‌ అవార్డులు లభించాయి. "లిక్కర్‌ అవార్డు ఫర్‌ ది బెస్ట్ స్టార్టప్‌" కంపెనీ అవార్డు, స్పిరిట్స్ 2014 అవార్డు, ది ఇండ్‌ స్పిరిట్‌ 2014 ఎక్సలెన్స్ ఇన్‌ ప్యాకేజింగ్‌ అవార్డు, ఫ్రాంచైజ్‌ ఇండియా 2014 వంటి అవార్డులను పొందింది.

మగువలు ఇంటిని చక్కబెట్టడమే కాదు ఆఫీసు కార్యకలాపాలను చక్కబెట్టే సమర్థులుగా నిరూపించిన లీసా.. పరిస్థితులను ఎదుర్కోగల ధైర్యం, మార్కెట్ పరిస్థితులను సమన్వయ పరుచుకోవడం, స్థిరత్వం, సహనం ఉంటే ఏ వ్యాపారంలోనైనా విజయం సాధించవచ్చని వర్ధమాన పారిశ్రామిక వేత్తలకు సలహా ఇస్తున్నారు.Most Popular