హైదరాబాదీ సంస్థ అపోలో మైక్రోసిస్టమ్స్‌ ఐపీవో ఓకేనా? 

హైదరాబాదీ సంస్థ అపోలో మైక్రోసిస్టమ్స్‌ ఐపీవో ఓకేనా? 

దేశీ స్టాక్‌ మార్కెట్ చరిత్రలో గతేడాది(2017) రికార్డు సృష్టించిన ప్రైమరీ మార్కెట్‌ మరోసారి ఇన్వెస్టర్లను ఊరించనుంది. వైమానిక, రక్షణ, రవాణా రంగాలకు సమీకృత సేవలు అందిస్తున్న హైదరాబాద్‌ సంస్థ అపోలో మైక్రోసిస్టమ్స్‌ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 10న ప్రారంభంకానున్న ఇష్యూకి రూ. 270-275 ధరల శ్రేణిని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. షేరు ముఖ విలువ రూ. 10కాగా..  ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 156 కోట్లను సమీకరించాలని ఆశిస్తోంది. 2017లో ఐపీవోల ద్వారా దేశీ కార్పొరేట్‌ సంస్థలు సమారు రూ. 75,000 కోట్లను సమీకరించిన విషయం విదితమే. 
రిటైలర్లకు డిస్కౌంట్‌
జనవరి 12న ముగియనున్న ఇష్యూలో భాగంగా అపోలో మైక్రో.. అర్హతగల ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేరు ధరలో రూ. 12 డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. రిటైలర్లు కనీసం 50 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆపై రూ. 2 లక్షల మొత్తానికి మించకుండా అప్లై చేసుకోవచ్చు. 

కంపెనీ వివరాలివీ
హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు కలిగిన అపోలో మైక్రోసిస్టమ్స్‌ ప్రధానంగా ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రో మెకానికల్‌, ఇంజినీరింగ్‌ డిజైన్లతో మిషన్‌, టైమ్‌ క్రిటికల్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది. మార్చితో ముగిసిన 2016-17లో ఆదాయం రూ. 212 కోట్లకు చేరగా..  రూ. 18 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. రూ. 13 ఈపీఎస్‌ సాధించింది. కాగా.. ఐపీవో నిధులను అదనపు వర్కింగ్‌ కేపిటల్‌తోపాటు.. సాధారణ పాలనా అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. 


రిస్క్‌ చేయగలిగితే?
సాంకేతికత(టెక్నాలజీ), పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ), నాణ్యతా ప్రమాణాలు(క్వాలిటీ కంట్రోల్‌) వంటి అంశాలలో కంపెనీ మంచి ట్రాక్‌ రికార్డును కలిగి ఉంది. గత ఐదేళ్లుగా ఆదాయంలో స్థిరమైన పురోగతిని సాధిస్తూ వస్తోంది. ఈ కాలంలో ఆదాయం దాదాపు ఆరు రెట్లు పెరిగింది. 9 శాతం స్థాయిలో నికర లాభ మార్జిన్లు ఆర్జిస్తూ వస్తోంది. సెప్టెంబర్‌తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 109 కోట్ల ఆదాయం, రూ. 7 కోట్ల నికర లాభం ఆర్జించింది. రూ. 5 ఈపీఎస్‌ సాధించింది. వార్షిక ప్రాతిపదికన లెక్కగడితే రూ. 10 ఈపీఎస్‌ నమోదుకావచ్చు. అంటే ఐపీవోకు ఆశిస్తున్న ధర ప్రకారం 27 రెట్లు(పీఈ)లో లభిస్తోంది. అయితే రిస్క్‌ చేయగలిగిన ఇన్వెస్టర్లు మాత్రమే ఈ ఐపీవోకు దరఖాస్తు చేసుకోవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.


కారణాలేంటి?
అపోలో మైక్రో ప్రత్యేక తరహా సేవలు అందిస్తున్నప్పటికీ ఆదాయంలో అధికభాగం కొద్దిపాటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచే లభిస్తోంది. గత కొన్నేళ్లలో కొన్ని సందర్భాలలో లిటిగేషన్స్‌ను ఎదుర్కోవడంతోపాటు నెగిటివ్‌ క్యాష్‌ఫ్లో స్థాయికీ చేరుకున్నట్లు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో రిస్క్‌ భరించే ఇన్వెస్టర్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం మేలని సూచిస్తున్నారు. Most Popular